ఇంగ్లాండ్‌ బోణీ.. సెర్బియాపై విజయం

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 1-0తో సెర్బియాపై విజయం సాధించింది.

Updated : 18 Jun 2024 03:49 IST

జెల్‌సెంకిర్చెన్‌: యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 1-0తో సెర్బియాపై విజయం సాధించింది. 13వ నిమిషంలో హెడర్‌తో జూడ్‌ బెలింగ్‌హామ్‌.. ఇంగ్లాండ్‌కు ఆధిక్యాన్నిచ్చాడు. హారీ కేన్‌ రెండో అర్ధభాగంలో ఆ జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచింనంత పనిచేశాడు. కానీ సెర్బియా గోల్‌ కీపర్‌ రజ్కోవిచ్‌ అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ‘‘వ్యక్తిగతంగా నాకిది గొప్ప ఆరంభం. నా ఆత్మవిశ్వాసం పెరిగింది. జట్టు గెలవడానికి సహకరించినంద]ుకు సంతోషంగా ఉంది’’ అని మ్యాచ్‌ అనంతరం బెలింగ్‌హామ్‌ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్, సెర్బియా అభిమానులు కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇంగ్లాండ్‌ జట్టు గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌ (గ్రూప్‌-ఇ)లో రొమేనియా 3-0తో ఉక్రెయిన్‌ను మట్టికరిపించింది. రొమేనియా తరఫున నికోల్‌ స్టాన్సియు (29వ), రజ్వాన్‌ మారిన్‌ (53వ), డెనిస్‌ డ్రేగస్‌ (57వ) తలో గోల్‌ కొట్టారు. 


‘లక్ష్య’ శ్రీతేజకు కాంస్యం 

బిలాస్‌పుర్‌ (చత్తీస్‌గఢ్‌): జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి తోలెం శ్రీతేజ (తెలంగాణ) మెరిసింది. బాలికల హెప్టాథ్లాన్‌లో శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ పోటీలో శ్రీతేజ 4136 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.


ఇంకా ఆలోచించలేదు

కెప్టెన్సీ వదిలేయడంపై బాబర్‌

ఫోర్ట్‌ లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): పాకిస్థాన్‌ జట్టు సారథ్యం నుంచి వైదొలగడం గురించి ఇంకా ఆలోచించలేదని కెప్టెన్‌ బాబర్‌ ఆజాం అన్నాడు. పీసీబీతో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ నుంచి పాక్‌ గ్రూపు దశలోనే నిష్క్రమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘స్వదేశానికి వెళ్లిన తర్వాత ఇక్కడ జరిగిన విషయాల్ని పీసీబీతో చర్చిస్తా. సారథ్యం నుంచి తప్పుకోవాల్సి వస్తే ఆ నిర్ణయాన్ని అందరికీ చెప్తా. తెరవెనుక ఏదీ చేయను. బహిరంగంగా తెలియజేస్తా. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం గురించి ఆలోచించలేదు. నిర్ణయం పీసీబీదే. పాక్‌ ప్రదర్శన పట్ల ప్రతి ఒక్కరికి బాధగానే ఉంది. జట్టుగా మేం బాగా ఆడలేదు. కేవలం ఒక్క ఆటగాడి వల్ల టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. జట్టుగా ఓడిపోయాం. కెప్టెన్‌ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అందరి స్థానాల్లో నేనొక్కడినే ఆడలేను. 11 మంది ఆటగాళ్లలో ప్రతి ఒక్కరికి ఒక్కో బాధ్యత ఉంటుంది’’ అని బాబర్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని