అభిమానితో హారిస్‌ రవూఫ్‌ గొడవ

పాకిస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ అమెరికాలో ఓ అభిమానితో గొడవ పడ్డ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Published : 19 Jun 2024 04:17 IST

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ అమెరికాలో ఓ అభిమానితో గొడవ పడ్డ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై ఓ అభిమాని రవూఫ్‌ను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్‌.. ఆ అభిమాని మీదికి దూసుకెళ్లాడు. ఆ సమయంలో తన వెంటే ఉన్న భార్య రవూఫ్‌ను ఆపే ప్రయత్నం చేసింది. సమీపంలో ఉన్న వేరే వ్యక్తులు కూడా అతణ్ని నిలువరించాలని చూశారు. ఆ అభిమాని భారతీయుడంటూ రవూఫ్‌ అరుస్తుంటే.. తాను పాకిస్థానీనే అని అతను చెప్పాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న రవూఫ్‌ను చుట్టూ ఉన్న వాళ్లు అతి కష్టం మీద ఆపారు.

నా కుటుంబం జోలికి వస్తే..: అభిమానితో గొడవపై రవూఫ్‌ ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడినందుకే తాను ఆ వ్యక్తితో గొడవ పడినట్లు అతను చెప్పాడు. ‘‘ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోకి తీసుకురావాలనుకోలేదు. కానీ వీడియో బయటికి వచ్చింది కాబట్టి ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. మేం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. మాకు మద్దతుగా నిలవొచ్చు లేదా విమర్శించొచ్చు. కానీ నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి వస్తే స్పందించకుండా ఉండలేను’’ అని రవూఫ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని