మంధానకు మూడో ర్యాంకు

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. మంగళవారం ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ జాబితాలో రెండు స్థానాలు మెరుగైన ఆమె మూడో ర్యాంకు కైవసం చేసుకుంది.

Published : 19 Jun 2024 04:20 IST

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. మంగళవారం ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ జాబితాలో రెండు స్థానాలు మెరుగైన ఆమె మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నటాలీ బ్రంట్‌ అగ్రస్థానంలో ఉంది. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ నాలుగో స్థానంలో నిలిచింది.


ఆస్ట్రియాపై ఫ్రాన్స్‌ విజయం

యూరో కప్‌లో ఫేవరెట్‌ ఫ్రాన్స్‌ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌ (గ్రూప్‌-డి)లో మంగళవారం 1-0తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. కానీ ఆ జట్టు ఈ మ్యాచ్‌లో సాధికారికంగా ఆడలేకపోయింది. ఆస్ట్రియా ఆటగాడు మ్యాక్సిమిలియన్‌ వూబెర్‌ 38వ నిమిషంలో చేసిన సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ పైచేయి సాధించింది. ఫ్రాన్స్‌ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించినప్పటికీ ఎక్కువగా అవకాశాలు సృష్టించుకోలేకపోయింది. ఆటలో ఫ్రాన్స్‌ స్టార్‌ కిలియన్‌ ఎంబాపె ముక్కుకు తీవ్ర గాయమైంది. మరో మ్యాచ్‌లో తుర్కియే 3-1తో జార్జియాను ఓడించింది. 


సురేఖకు రెండో స్థానం

ఆంటల్యా: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సత్తా చాటింది. మహిళల కాంపౌండ్‌ సింగిల్స్‌లో క్వాలిఫయింగ్‌ సురేఖ (705) రెండో స్థానంలో నిలిచింది. ఆండ్రియా బెరెకా (మెక్సికో, 706) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదితి (699), పర్ణీత్‌ కౌర్‌ (696) 10, 14వ స్థానాలు సాధించారు. మొత్తంగా టీమ్‌ విభాగంలో భారత్‌ (2100) తొలి స్థానం.. మెక్సికో (2098) రెండు, అమెరికా (2086) మూడో స్థానాల్లో నిలిచాయి. 


ఉగాండా ఆటగాడిపై ఫిక్సింగ్‌ వల! 

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): క్రికెట్‌ బుకీల పట్ల అసోసియేట్‌ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఐసీసీ హెచ్చరించింది. కెన్యా అంతర్జాతీయ మాజీ ఆటగాడొకరు ఫిక్సింగ్‌ కోసం టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా ఆటగాడిని సంప్రదించడంతో ఐసీసీ వెంటనే అప్రమత్తమైంది. గయానాలో గ్రూపు మ్యాచ్‌ సందర్భంగా కెన్యా మాజీ పేసర్‌ భిన్నమైన ఫోన్‌ నంబర్ల నుంచి పలుమార్లు ఉగాండా ఆటగాడిని సంప్రదించేందుకు ప్రయత్నించాడు. ఆ ఆటగాడు వెంటనే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) అధికారులకు సమాచారం అందించాడు. ‘‘ఉగాండా ఆటగాడిని ఆ వ్యక్తి లక్ష్యంగా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద జట్లతో పోల్చుకుంటే అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు అవినీతిపరులకు సులువుగా లక్ష్యమవుతారు. ఈ ఉదంతంలో ఆటగాడు వెంటనే ఏసీయూకు సమాచారం అందించాడు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.


పారిస్‌కు అయిదుగురు షాట్‌గన్‌ షూటర్లు 

దిల్లీ: సీనియర్‌ ట్రాప్‌ షూటర్‌ పృథ్వీరాజ్‌ తొండైమన్‌ నాయకత్వంలో భారత షాట్‌గన్‌ జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలో దిగనుంది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్‌ కోసం అయిదుగురు సభ్యులతో కూడిన భారత షాట్‌గన్‌ జట్టును భారత రైఫిల్‌ సంఘం(ఎన్‌ఆర్‌ఏఐ) మంగళవారం ప్రకటించింది. పురుషుల ట్రాప్‌లో పృథ్వీరాజ్, మహిళల విభాగంలో రాజేశ్వరి కుమారి బరిలో దిగుతారు. స్కీట్‌ షూటింగ్‌ వ్యక్తిగత విభాగాల్లో అనంత్‌జీత్‌ సింగ్‌ నరుక.. రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌ అదృష్టం పరీక్షించుకోనున్నారు. స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అనంత్‌జీత్‌- మహేశ్వరి జోడీ బరిలో దిగుతుంది. ట్రాప్‌ షూటర్‌ శ్రేయాషి సింగ్‌కు కోటా బెర్తు కోసం అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్యకు ఎన్‌ఆర్‌ఏఐ విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని