తొడ కండరాల నొప్పితో: నీరజ్‌ చోప్రా

తొడ కండరాల నొప్పి కారణంగా ఈ సీజన్లో ఎక్కువ టోర్నీల్లో పాల్గొనలేకపోతున్నానని భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా వెల్లడించాడు. ఈ సమస్యకు పరిష్కారం కోసం పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత వేర్వేరు వైద్యులను కలుస్తానని అతనన్నాడు.

Published : 20 Jun 2024 02:24 IST

టర్కూ: తొడ కండరాల నొప్పి కారణంగా ఈ సీజన్లో ఎక్కువ టోర్నీల్లో పాల్గొనలేకపోతున్నానని భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా వెల్లడించాడు. ఈ సమస్యకు పరిష్కారం కోసం పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత వేర్వేరు వైద్యులను కలుస్తానని అతనన్నాడు. తాజాగా పావో నూర్మి క్రీడల్లో అతను తొలిసారి పసిడి నెగ్గిన సంగతి తెలిసిందే. 85.97 మీటర్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన 26 ఏళ్ల నీరజ్‌.. తొడ కండరాల నొప్పితో ముందు జాగ్రత్తగా గత నెలలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ పోటీలకు దూరమయ్యాడు. దోహా డైమండ్‌ లీగ్‌లో రజతంతో ఈ సీజన్‌ను మొదలెట్టిన అతను ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ‘‘ఇప్పుడు తొడ కండరాల నొప్పి లేదు. ఈ పోటీ (పావో నూర్మి)ల్లో ఆరు త్రోలు విసరగలిగా. కానీ ప్రతి ఏడాది ఈ గాయంతో సమస్య తప్పడం లేదు. ఒలింపిక్స్‌ తర్వాత వేర్వేరు వైద్యులను సంప్రదిస్తానేమో! ఈ సీజన్‌లో ఎక్కువ పోటీల్లో పాల్గొనాలని అనుకున్నా. కానీ నొప్పి కారణంగా సాధ్యపడలేదు. వచ్చే వారాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నా అత్యుత్తమ త్రోలను విసరబోతున్నా’’ అని నీరజ్‌ చెప్పాడు. వచ్చే నెల 7న జరిగే పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో అతను బరిలో దిగబోతున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ దిశగా ఫిన్లాండ్‌లో సన్నాహకాలు మొదలెట్టిన నీరజ్‌ ఇప్పుడు జర్మనీ వెళ్లనున్నాడు. అక్కడ కొన్ని రోజుల సాధన తర్వాత ఒలింపిక్స్‌కు ముందు చివరగా తుర్కియేలో ప్రాక్టీస్‌ చేస్తాడు.


విరాట్‌.. గొప్ప ఆటగాళ్లలో ఒకడు: వెస్లీ 

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లి గొప్ప ఆటగాళ్లలో ఒకడని వెస్టిండీస్‌ దిగ్గజ పేసర్‌ వెస్లీ హాల్‌ కితాబిచ్చాడు. ‘‘ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను చూశా. వారిలో నువ్వొకడివి. నీ కెరీర్‌ మొత్తాన్ని అనుసరించా. ఇంకా చాలా ఏళ్లు భారత్‌కు ఆడతావు’’ అంటూ కోహ్లీతో 86 ఏళ్ల వెస్లీ అన్నాడు. కెన్సింగ్టన్‌ ఓవల్‌లో ప్రాక్టీసు సెషన్‌కు ప్రత్యేక అతిథిగా వచ్చిన వెస్లీ.. భారత ఆటగాళ్లను కలిశాడు. కోహ్లి, చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు తన ఆత్మకథ పుస్తకాన్ని బహుకరించాడు.


రెగాన్‌ ప్రపంచ రికార్డు

ఇండియానాపొలిస్‌: అమెరికా స్విమ్మర్‌ రెగాన్‌ స్మిత్‌ సత్తాచాటింది. అమెరికా స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో ఆమె ప్రపంచ రికార్డు తిరగరాసింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 57.13 సెకన్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా స్విమ్మర్‌ కేలీ మెక్‌యోన్‌ నిరుడు నెలకొల్పిన ప్రపంచ రికార్డు (57.33సె)ను 22 ఏళ్ల రెగాన్‌ బద్దలుకొట్టింది. రెగాన్‌ 17 ఏళ్ల వయసులోనే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ విభాగంలో ఆమె ప్రపంచ రికార్డు నమోదు చేయడం విశేషం. ఒక్కసారిగా వచ్చిన పేరు, ప్రతిష్ఠలతో ఆమె దారి తప్పింది. మెక్‌యోన్‌ ఆధిపత్యంతో రెగాన్‌ కనుమరుగైంది. టోక్యో ఒలింపిక్స్‌లో మెక్‌యోన్‌ స్వర్ణం నెగ్గగా.. రెగాన్‌ కాంస్యానికే పరిమితమైంది. ఇప్పుడు దిగ్గజ స్విమ్మర్‌ మైకెల్‌ ఫెల్ప్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన బాబ్‌ బోమన్‌ శిక్షణతో రెగాన్‌ తిరిగి గాడిన పడుతోంది.


వైల్డ్‌కార్డుతో ఒసాక, వోజ్నియాకి

వింబుల్డన్‌: మాజీ గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్లు ఒసాక, వోజ్నియాకి, కెర్బర్, రదుకానుకు వింబుల్డన్‌ టోర్నీలో వైల్డ్‌కార్డు ప్రవేశం లభించింది. మాతృత్వం కారణంగా ఆటకు దూరమైన నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఒసాక, మూడు సార్లు ఛాంపియన్‌ కెర్బర్‌ ఈ సీజన్‌తోనే తిరిగి కోర్టులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వైటెక్‌ చేతిలో ఒసాక ఓడింది. మణికట్టు, చీలమండ శస్త్రచికిత్సల నుంచి కోలుకున్న రదుకాను రెండేళ్లలో తొలిసారి వింబుల్డన్‌లో ఆడబోతుంది. మరోవైపు 2019 తర్వాత వోజ్నియాకి తిరిగి వింబుల్డన్‌కు రాబోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆమె నిరుడు ఆగస్టులో పునరాగమనం చేసింది. ఈ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ వచ్చే నెల 1న ఆరంభమవుతుంది.


క్వార్టర్స్‌లో బోపన్న జోడీ 

లండన్‌: రోహన్‌ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జంట కించ్‌ ఛాంపియన్‌షిప్స్‌ పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. బోపన్న జోడీ బుధవారం తొలి రౌండ్లో 6-4, 6-4తో అలెగ్జాండర్‌ ఎర్లెర్‌-లుకాస్‌ మీద్లెర్‌ (ఆస్ట్రేలియా) ద్వయంపై విజయం సాధించింది. బోపన్న, ఎబ్డెన్‌ జంట ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే. 


స్ప్రింటర్లకో ట్రాక్‌ లీగ్‌ 

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో లీగ్‌ల హవా కొనసాగుతోంది. ఇంకా కొత్తవి కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడా బాటలోనే స్ప్రింటర్ల కోసం ‘గ్రాండ్‌ స్లామ్‌ ట్రాక్‌’ లీగ్‌ వస్తోంది. స్ప్రింట్‌ దిగ్గజం మైకెల్‌ జాన్సన్‌ ఈ లీగ్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ లీగ్‌ ఆరంభమవుతుందని అతను తాజాగా వెల్లడించాడు. తొలి సీజన్‌లో 100 మంది అత్యుత్తమ రన్నర్లతో ఏడాదిలో నాలుగు సార్లు పోటీలు నిర్వహించబోతున్నారు. ఈ అథ్లెట్లు దాదాపు రూ.105 కోట్ల నగదు బహుమతి కోసం పోటీపడతారు. అమెరికాలోని రెండు నగరాల్లో, విదేశాల్లో మరో రెండు చోట్ల ఈ పరుగు పోటీలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ లీగ్‌ కోసం ప్రపంచ రికార్డు హార్డిల్స్‌ రేసర్‌ మెక్‌లాగ్లిన్‌తో ఒప్పందం కూడా పూర్తయింది. ‘గ్రాండ్‌ స్లామ్‌ ట్రాక్‌ (జీఎస్‌టీ) రేసర్స్‌’గా 48 మందితో ఈ లీగ్‌ ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. అనంతరం ‘జీఎస్‌టీ ఛాలెంజర్స్‌’గా మరో 48 మందిని తీసుకుని, వీళ్ల మధ్య పోటీలు నిర్వహించనున్నారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో 200మీ, 400మీ. పరుగులో ఛాంపియన్‌గా జాన్సన్‌ చరిత్ర సృష్టించారు. అప్పుడు 200మీ. పరుగులో ప్రపంచ రికార్డూ నమోదు చేశారు.


‘హండ్రెడ్‌’ జట్టు వాటా కొనుగోలుపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ఆసక్తి

లండన్‌: ‘ది హండ్రెడ్‌’ టీ20 లీగ్‌ జట్టు లండన్‌ స్పిరిట్‌లో వాటా కొనుగోలు చేసేందుకు అయిదు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఆసక్తి ప్రదర్శించాయని ఎంసీసీ అధ్యక్షుడు మార్క్‌ నికోలస్‌ తెలిపాడు. స్పిరిట్‌ జట్టులో 49 శాతం వాటా అమ్మకానికి అనుమతివ్వాలంటూ ఈసీబీకి ఎంసీసీ సీఈఓ లావెండర్‌ ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో నికోలస్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ ఫ్రాంచైజీల పేర్లను అతను వెల్లడించలేదు. వ్యాఖ్యాత, రచయిత కూడా అయిన నికోలస్‌ ఈ ఏడాది అక్టోబరులో స్పిరిట్‌ జట్టు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.


ఆ మూడు ప్రశ్నలు! 

దిల్లీ: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం వర్చువల్‌గా ఇంటర్వ్యూకు హాజరైన గౌతమ్‌ గంభీర్‌కు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మూడు ముఖ్యమైన ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. గంభీర్‌తో పాటు కోచ్‌ పదవి రేసులో ఉన్న డబ్ల్యూవీ రామన్‌కు సైతం సీఏసీ సభ్యులు ఈ ప్రశ్నలు సంధించారని సమాచారం. ‘‘జట్టు కోచింగ్‌ సిబ్బందిపై మీ ఆలోచనలు ఏమిటి? బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో కొంతమంది వయసు మీదపడ్డ ఆటగాళ్లున్నారు, ఈ సంధి దశను మీరు ఎలా ఎదుర్కొంటారు? వేర్వేరు ఫార్మాట్లకు భిన్న కెప్టెన్లు, పని భారం నిర్వహణలో భాగంగా ఫిట్‌నెస్‌ పరిమితులు, ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడంలో జట్టు వైఫల్యంపై మీ అభిప్రాయాలు ఏమిటీ?’’ అని సీఏసీ కమిటీ అడిగిందని తెలిసింది. భారత పురుషుల క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌గా గంభీర్‌ బాధ్యతలు స్వీకరించేందుకే ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటికే గంభీర్‌ డిమాండ్లనూ బీసీసీఐ అంగీకరించిందనే వార్తలొచ్చాయి. ఈ ఇంటర్వ్యూ ఏదో నామమాత్రమే అని, త్వరలోనే గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా బీసీసీఐ ప్రకటిస్తుందని సమాచారం.


నంబర్‌వన్‌గా స్టాయినిస్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ సాయినిస్‌ నంబర్‌వన్‌ ర్యాంకు సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో స్టాయినిస్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. వనిందు హసరంగ (శ్రీలంక), షకిబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), మహ్మద్‌ నబి (అఫ్గానిస్థాన్‌) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. హార్దిక్‌ పాండ్య ఏడో ర్యాంకు సాధించాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యశస్వి జైశ్వాల్‌ 7, రుతురాజ్‌ గైక్వాడ్‌ 13వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ 9, రవి బిష్ణోయ్‌ 12వ ర్యాంకులు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని