పోర్చుగల్‌ శుభారంభం

యూరో కప్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్‌ శుభారంభం చేసింది. డ్రాగా ముగిసేలా కనిపించిన మ్యాచ్‌లో అదనపు సమయంలో ఫ్రాన్సిస్కో (90+2వ నిమిషంలో) చేసిన గోల్‌తో ఆ జట్టు విజయతీరాలకు చేరింది.

Published : 20 Jun 2024 02:27 IST

లీప్‌జిగ్‌ (జర్మనీ): యూరో కప్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్‌ శుభారంభం చేసింది. డ్రాగా ముగిసేలా కనిపించిన మ్యాచ్‌లో అదనపు సమయంలో ఫ్రాన్సిస్కో (90+2వ నిమిషంలో) చేసిన గోల్‌తో ఆ జట్టు విజయతీరాలకు చేరింది. బుధవారం గ్రూప్‌- ఎఫ్‌ పోరులో పోర్చుగల్‌ 2-1 తేడాతో చెక్‌ రిపబ్లిక్‌పై విజయం సాధించింది. చెక్‌ రిపబ్లిక్‌ తరపున ప్రొవోద్‌ (62వ నిమిషంలో) తొలి గోల్‌ చేశాడు. కానీ ఆ తర్వాత 7 నిమిషాలకే ఆ జట్టు ఆటగాడు రాబిన్‌ (69వ) సెల్ఫ్‌ గోల్‌ చేశాడు. నూనో తలతో కొట్టిన బంతిని చెక్‌ రిపబ్లిక్‌ గోల్‌కీపర్‌ జింద్రిచ్‌ అడ్డుకున్నాడు. కానీ ఆ బంతి అక్కడే ఉన్న రాబిన్‌ కాలికి తగిలి నెట్‌ లోపలికి వెళ్లిపోయింది. దీంతో పోర్చుగల్‌ స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి ఆధిక్యం కోసం రెండు జట్లూ తీవ్రంగా పోరాడాయి. పోర్చుగల్‌ దాడులకు చెక్‌ రిపబ్లిక్‌ దీటుగా బదులివ్వడంతో 90 నిమిషాల నిర్ణీత సమయంలో మరో గోల్‌ నమోదు కాలేదు. మ్యాచ్‌ డ్రాగా ముగిసే సంకేతాలు కనిపించాయి. కానీ అదనపు సమయంలో ఫ్రాన్సిస్కో మెరుపు కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి పోర్చుగల్‌ను గెలిపించాడు. మరోవైపు ఆరోసారి యూరో కప్‌ ఆడుతున్న తొలి ఆటగాడిగా 39 ఏళ్ల రొనాల్డో చరిత్ర సృష్టించాడు. క్రొయేషియా, అల్బేనియా మధ్య జరిగిన మరో మ్యాచ్‌ (గ్రూప్‌-బి) 2-2తో డ్రాగా ముగిసింది. ఇంకో మ్యాచ్‌లో జర్మనీ 2-0తో హంగేరిపై గెలిచింది.


యూరో కప్‌లో ఈనాడు

స్లోవేనియా × సెర్బియా (సా।। 6.30)
డెన్మార్క్‌ × ఇంగ్లాండ్‌  (రాత్రి 9.30)
స్పెయిన్‌ × ఇటలీ   (రాత్రి 12.30)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని