పారాలింపిక్స్‌కు అర్షద్‌

ఈ ఏడాది జరిగే పారిస్‌ పారాలింపిక్స్‌కు తెలుగు యువకుడు షేక్‌ అర్షద్‌ అర్హత సాధించాడు. పారా సైక్లింగ్‌లో అతనితో పాటు జ్యోతి గధేరియా (మహారాష్ట్ర) పారిస్‌ విమానమెక్కబోతున్నారు.

Published : 20 Jun 2024 02:30 IST

పారా సైక్లింగ్‌లో అర్హత

ఈనాడు,హైదరాబాద్‌: ఈ ఏడాది జరిగే పారిస్‌ పారాలింపిక్స్‌కు తెలుగు యువకుడు షేక్‌ అర్షద్‌ అర్హత సాధించాడు. పారా సైక్లింగ్‌లో అతనితో పాటు జ్యోతి గధేరియా (మహారాష్ట్ర) పారిస్‌ విమానమెక్కబోతున్నారు. పారాలింపిక్స్‌ చరిత్రలోనే పారా సైక్లింగ్‌లో భారత అథ్లెట్లు పోటీపడబోతుండటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ పారాలింపిక్స్‌లో ఒక్కసారి కూడా పారా సైక్లింగ్‌లో మన ప్రాతినిథ్యం లేదు. ఇటీవల ఆసియా రోడ్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఎలైట్‌ వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌ సీ2 విభాగం మహిళల్లో జ్యోతి స్వర్ణం, అర్షద్‌ రజతం గెలిచారు. దీంతో ర్యాంకింగ్స్‌లో మెరుగై పారాలింపిక్స్‌ బెర్తు పట్టేశారు. ఈ పారాలింపిక్స్‌ ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 8 వరకు జరుగుతాయి. 

వైకల్యాన్ని దాటి: నంద్యాల జిల్లాకు చెందిన 30 ఏళ్ల షేక్‌ అర్షద్‌ ఏడో తరగతిలో ఉండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మోకాలి వరకూ కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. వైకల్యంతో అర్షద్‌ కుంగిపోయాడు. అతణ్ని ఓదార్చడంతో పాటు తండ్రి ప్రోత్సహించాడు. చదువుపై దృష్టిసారిస్తే.. దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్నారు. ఓ వైపు చదువుకుంటునే.. మరోవైపు క్రీడా పోటీల్లోనూ అర్షద్‌ పాల్గొనేవాడు. ఇంటర్‌ వరకూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చదవిన అతను.. డిగ్రీ కోసం 2017లో విజయవాడ వెళ్లాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో తిరిగి నంద్యాలకు వచ్చి ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. అనంతరం అక్కడే ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరారు. అక్కడ పనిచేస్తున్న వారి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రాణించాడు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో చేరాక జాతీయ, అంతర్జాతీయ పారా సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని