భారత జట్టులో షబ్నమ్‌

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత జట్టులో విశాఖ అమ్మాయి ఎండీ షబ్నమ్‌ షకీల్‌ చోటు దక్కించుంది.

Published : 21 Jun 2024 03:12 IST

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత జట్టులో విశాఖ అమ్మాయి ఎండీ షబ్నమ్‌ షకీల్‌ చోటు దక్కించుంది. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం 17 ఏళ్ల ఈ మీడియం పేసర్‌ను సెలక్టర్లు జట్టులో చేర్చారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో రెండు వన్డేలు ఆడిన టీమ్‌ఇండియాలో ఈ ఒక్క మార్పే జరిగింది. తొలి రెండు వన్డేల్లో ఘన విజయాలు అందుకున్న హర్మన్‌ప్రీత్‌ బృందం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మూడో వన్డే పూర్తయ్యాక.. చెన్నైలో జరిగే ఏకైక టెస్టు (జూన్‌ 28-జులై 1)లో సఫారీ జట్టుతో భారత్‌ తలపడనుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్‌ జులై 5న ఆరంభమవుతుంది.


రికర్వ్‌ ఆర్చర్లకు రిక్తహస్తం

అంటాల్య: ప్రపంచకప్‌ స్టేజ్‌-3 చివరి ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నమెంట్లో భారత రికర్వ్‌ ఆర్చర్లకు రిక్తహస్తమే మిగిలింది. మహిళల టీమ్‌ సెమీస్‌లో భారత్‌ (దీపిక కుమారి, భజన్‌కౌర్, అంకిత) 4-5తో షూటాఫ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో ఓడింది. కాంస్య పతక పోరులోనూ జట్టుకు నిరాశే ఎదురైంది. 0-6తో జపాన్‌ చేతిలో చిత్తయింది. మరోవైపు భారత పురుషుల జట్టు (బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌) ప్రిక్వార్టర్స్‌లో 1-5తో నెదర్లాండ్స్‌కు తలొంచింది. ఈ టోర్నీలో విఫలమైనా పారిస్‌ కోటా స్థానాలు సాధించడానికి భారత జట్లకు ఇంకా అవకాశముంది. పురుషులు, మహిళల టీమ్స్‌ సోమవారం ప్రకటించే ర్యాంకింగ్స్‌పై ఆశలు పెట్టుకున్నాయి. ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో కోటా దక్కించుకోలేకపోయిన జట్లు టాప్‌-2 ర్యాంకుల్లో నిలిస్తే బెర్తులు సంపాదించనున్నాయి. పురుషుల్లో భారత జట్టు రెండు.. మహిళల్లో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. పురుషుల్లో నంబర్‌వన్‌ దక్షిణ కొరియా ఇప్పటికే ఒలింపిక్స్‌ బెర్తు సాధించింది. ఈ నేపథ్యంలో టాప్‌-2లో ఉన్న భారత్‌కు పారిస్‌ అవకాశం ఉంది. మహిళల్లో టాప్‌-7 జట్లు కూడా బెర్తు దక్కించుకోవడంతో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్‌ ఈ మెగా ఈవెంట్‌కు వెళ్తామనే భరోసాతో ఉంది. రికర్వ్‌ సింగిల్స్‌లో ధీరజ్, భజన్‌ కౌర్‌ ఇప్పటికే పారిస్‌ కోటా సాధించారు. 


బుమ్రాకు వీరాభిమానిని: ఆంబ్రోస్‌

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు తాను వీరాభిÅమానిని అని వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. ‘‘బుమ్రా గురించి ఏం చెప్పను! అతనికి నేను వీరాభిమానిని. బుమ్రాను మొదటి సారి చూసినప్పటి నుంచి అతనికి అభిమానిగా మారిపోయా. అతను సంప్రదాయేతర బౌలర్‌. కాని అత్యంత ప్రభావవంతుడు. అందుకే అతనంటే నాకిష్టం. సంప్రదాయ ఫాస్ట్‌ బౌలర్లను చూసినప్పుడు బుమ్రా వైపు తల తిప్పరు. అతనో భిన్నమైన బౌలర్‌. భారత్‌కు బుమ్రా అసాధారణ సేవలు అందించాడు. ఇంకా సత్తాచాటుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆంటిగ్వాలో భారత్‌ ఆడినప్పుడు అతడిని కలిశా. బుమ్రా భిన్నమైన శైలి కలిగిన బౌలర్‌. అతడి బౌలింగ్‌ను ఆస్వాదించాను’’ అని ఆంబ్రోస్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని