భారత మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ జాన్సన్‌ ఆత్మహత్య!

భారత మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ జాన్సన్‌ (52) తాను నివసించే అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు.

Published : 21 Jun 2024 03:14 IST

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: భారత మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ జాన్సన్‌ (52) తాను నివసించే అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. జాన్సన్‌ మృతిపై విచారణ ప్రారంభించారు. మరణంపై కుటుంబ సభ్యులెవరూ సందేహాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. జాన్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాన్సన్‌కు నివాళిగా అఫ్గానిస్థాన్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లను భుజాలకు ధరించారు. భారత జట్టు తరఫున జాన్సన్‌ 1996లో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతడు 33 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 39 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అప్పట్లో కుంబ్లే, శ్రీనాథ్, వెంకటేశ్‌ ప్రసాద్, దొడ్డ గణేశ్‌ కూడా ఉన్న బలమైన కర్ణాటక బౌలింగ్‌ దళంలో జాన్సన్‌ సభ్యుడు. ‘‘నా క్రికెటింగ్‌ సహచరుడు జాన్సన్‌ మరణ వార్తతో చాలా బాధ కలిగింది. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ‘బెన్నీ’ చాలా త్వరగా వెళ్లిపోయావు’’ అని కుంబ్లే ‘ఎక్స్‌’లో పేర్కొన్నాడు. సచిన్, వెంకటేశ్‌ ప్రసాద్, గౌతమ్‌ గంభీర్‌ బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు జాన్సన్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని