సంక్షిప్తవార్తలు(5)

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ట్రాప్‌ షూటర్‌ శ్రేయసి సింగ్‌ బరిలో దిగనుంది. 21 మంది సభ్యుల భారత జట్టులో శ్రేయసికి ఎన్‌ఆర్‌ఏఐ చోటు కల్పించింది. కోటా బెర్తులో ఆమెకు అవకాశం కల్పించాలన్న ఎన్‌ఆర్‌ఏఐ విజ్ఞప్తికి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆమోదం తెలిపింది.

Updated : 22 Jun 2024 04:34 IST

భారత షూటింగ్‌ జట్టులో శ్రేయసి 

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ట్రాప్‌ షూటర్‌ శ్రేయసి సింగ్‌ బరిలో దిగనుంది. 21 మంది సభ్యుల భారత జట్టులో శ్రేయసికి ఎన్‌ఆర్‌ఏఐ చోటు కల్పించింది. కోటా బెర్తులో ఆమెకు అవకాశం కల్పించాలన్న ఎన్‌ఆర్‌ఏఐ విజ్ఞప్తికి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆమోదం తెలిపింది. ఎయిర్‌ పిస్టల్, స్పోర్ట్స్‌ పిస్టల్‌ రెండింట్లోనూ మను బాకర్‌ అగ్రస్థానంలో నిలిచినందున.. ఒక బెర్తు మార్పునకు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ అనుమతించింది. ఎయిర్‌ పిస్టల్‌ స్థానంలో ట్రాప్‌ (షాట్‌గన్‌) విభాగంలో శ్రేయసికి కోటా బెర్తు దక్కింది. మొత్తంగా పారిస్‌కు వెళ్లే భారత జట్టులో 8 మంది రైఫిల్, ఏడుగురు పిస్టల్, ఆరుగురు షాట్‌గన్‌ షూటర్లు ఉన్నారు.


ఒలింపిక్స్‌కు భారత్‌ బిడ్‌ ప్రయత్నాలు ముమ్మరం 

దిల్లీ: 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యం బిడ్‌ ప్రయత్నాల్ని భారత్‌ మరింత ముమ్మరం చేయనుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ సమయంలోనూ గట్టిగా లాబీయింగ్‌ చేయాలని నిర్ణయించింది. బిడ్‌ విజయవంతమైతే యోగా, ఖోఖో, కబడ్డీ వంటి దేశీయ క్రీడల్ని ఒలింపిక్స్‌లో చేర్చాలని భావిస్తోంది. ఈ మేరకు భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) పూర్తిస్థాయి నివేదికను కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు గురువారం అందజేసింది. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కితే యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, టీ20 క్రికెట్, స్క్వాష్‌లను చేర్చాలని నివేదికలో పేర్కొంది. 2036 హక్కుల కోసం పారిస్‌ ఒలింపిక్స్‌లో ముమ్మర ప్రయత్నాలు చేయనున్నట్లు ఎంఓసీ సభ్యుడు తెలిపారు.


నవంబరులో దక్షిణాఫ్రికాకు టీమ్‌ఇండియా 

జొహానెస్‌బర్గ్‌: ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయని సీఎస్‌ఏ, బీసీసీఐ శుక్రవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. నవంబరు 8, 10, 13, 15 తేదీల్లో వరుసగా డర్బన్, గబేరా, సెంచూరియన్, జొహానస్‌బర్గ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి మధ్యలో ఈ సిరీస్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.


బోపన్న జోడీ ఓటమి 

లండన్‌: సించ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో రోహన్‌ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జంట కథ ముగిసింది. శుక్రవారం పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో బోపన్న ద్వయం 6-7 (1-7), 6-7 (3-7)తో కరెన్‌ కచానోవ్‌-టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) చేతిలో ఓడింది. రెండు సెట్లూ టైబ్రేకర్‌లోనే ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో.. బోపన్న జంట చివరిదాకా పోరాడినా సర్వీసుల్లో తడబడి ఓటమి చవిచూసింది. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్లో బోపన్న జోడీ సెమీఫైనల్‌కు వెళ్లింది. 


అర్జెంటీనా తొలి అడుగు ఘనంగా 

అట్లాంటా: కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా తొలి అడుగు ఘనంగా వేసింది. శుక్రవారం గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో ఆ జట్టు 2-0 తేడాతో కెనడాను చిత్తుచేసింది. దిగ్గజ ఆటగాడు మెస్సి నామస్మరణతో మార్మోగిన స్టేడియంలో అతని జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అర్జెంటీనా తరపున జులియన్‌ అల్వారెజ్‌ (49వ నిమిషంలో), లాటారో మార్టినెజ్‌ (88వ) చెరో గోల్‌ కొట్టారు. ఈ రెండు గోల్స్‌ నమోదు కావడంలో మెస్సి సహాయం అందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని