జ్యోతి త్రయం.. హ్యాట్రిక్‌ స్వర్ణం

వేదిక మారినా.. పరిస్థితులు మారినా.. ప్రత్యర్థి మారినా.. భారత మహిళల కాంపౌండ్‌ జట్టు పసిడి వేట మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. పోటీపడ్డ టోర్నీల్లో రాణిస్తూ.. ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ త్రయం దూసుకెళ్తోంది.

Published : 23 Jun 2024 01:42 IST

ఈ ఏడాది మూడో ప్రపంచకప్‌లోనూ పసిడి సొంతం

అంటల్యా: వేదిక మారినా.. పరిస్థితులు మారినా.. ప్రత్యర్థి మారినా.. భారత మహిళల కాంపౌండ్‌ జట్టు పసిడి వేట మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. పోటీపడ్డ టోర్నీల్లో రాణిస్తూ.. ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ త్రయం దూసుకెళ్తోంది. తాజాగా మూడో అంచె ప్రపంచకప్‌లోనూ కాంపౌండ్‌ మహిళల జట్టు స్వర్ణాన్ని ఈ భారత బృందం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన మూడు ప్రపంచకప్‌ల్లోనూ బంగారు పతకాలతో ఈ త్రయం హ్యాట్రిక్‌ కొట్టింది. శనివారం ఫైనల్లో టాప్‌సీడ్‌ భారత్‌ 232-229 తేడాతో ఎస్తోనియాపై నెగ్గింది. హోరాహోరీగా సాగిన ఈ తుదిపోరులో భారత ఆర్చర్లు పట్టుదలతో పోరాడారు. తొలి సెట్లో 58-57తో ఆధిక్యంలో నిలిచారు. రెండో సెట్‌ 57-57తో సమంగా ముగిసింది. 59-58, 58-57తో వరుసగా చివరి రెండు సెట్లలో ఆధిపత్యంతో భారత్‌ విజేతగా నిలిచింది. భారత అమ్మాయిలకు ఇది వరుసగా 13వ విజయం. 2023 మెడెలిన్‌ ప్రపంచకప్‌ కాంస్య పతక పోరులో గెలుపు తర్వాత ఆ జట్టు ఓడిందే లేదు. గతేడాది పారిస్‌ ప్రపంచకప్‌నూ కలుపుకొని చూస్తే భారత అమ్మాయిలకు ఇది వరుసగా నాలుగో స్వర్ణం. ఈ ఏడాది షాంఘై, యెచియాన్‌లోనూ వీళ్లు ఛాంపియన్లుగా నిలిచారు. దీంతో ఈ ఏడాది ప్రపంచకప్‌లను స్వీప్‌ చేసినట్లయింది. పారిస్‌ ఒలింపిక్స్‌ కారణంగా ఈ సారి పారిస్‌ ప్రపంచకప్‌ అంచె పోటీలు జరగడం లేదు. మరోవైపు పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌లో ప్రియాన్ష్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో అతను 148-149తో షూలోసర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో పోరాడి ఓడాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని