సంక్షిప్తవార్తలు(6)

భారత ఆర్చరీ జట్లకు పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం దక్కింది. క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా నేరుగా పొందని బెర్తులను మెరుగైన ర్యాంకింగ్స్‌ ద్వారా పురుషులు, మహిళల జట్లు సొంతం చేసుకున్నాయి.

Updated : 25 Jun 2024 06:48 IST

పారిస్‌కు భారత ఆర్చరీ జట్లు 

దిల్లీ: భారత ఆర్చరీ జట్లకు పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం దక్కింది. క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా నేరుగా పొందని బెర్తులను మెరుగైన ర్యాంకింగ్స్‌ ద్వారా పురుషులు, మహిళల జట్లు సొంతం చేసుకున్నాయి. ఒలింపిక్స్‌కు అర్హత సాధించని దేశాలతో కూడిన జాబితాలో భారత పురుషులు, మహిళల జట్లు నంబర్‌వన్‌ స్థానాల్లో నిలిచాయి. టాప్‌-2 జట్లు ఈ మెగా ఈవెంట్లో ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో పురుషుల విభాగంలో భారత్, చైనా.. మహిళల్లో భారత్, ఇండోనేషియా పారిస్‌ వెళ్లబోతున్నాయి. వెటరన్‌ స్టార్లు దీపిక కుమారి, తరుణ్‌దీప్‌ రాయ్‌లకు నాలుగోసారి ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం లభించింది. పురుషుల్లో తరుణ్‌దీప్‌ రాయ్, తెలుగుతేజం బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్‌.. మహిళల్లో దీపిక కుమారి, భజన్‌ కౌర్, అంకిత భాకత్‌ టీమ్‌ ఈవెంట్లో ఆడతారు. ధీరజ్, భజన్‌ సింగిల్స్‌నూ బరిలో ఉన్నారు. మిక్స్‌డ్‌ విభాగాల్లోనూ భారత ఆర్చర్లు పోటీపడబోతున్నారు.


జర్మనీ అజేయంగా..

ఫ్రాంక్‌ఫుర్ట్‌ (జర్మనీ): యూరో కప్‌ 2024లో ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన ఆతిథ్య జర్మనీ గ్రూప్‌-ఎ ను అగ్రస్థానంతో ముగించింది. సోమవారం స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ను ఆ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. మూడు మ్యాచ్‌లాడిన జర్మనీ అజేయంగా (రెండు విజయాలు, ఓ డ్రా) రౌండ్‌ 16 సమరానికి సై అంటోంది. స్విట్జర్లాండ్‌ (ఓ విజయం, రెండు డ్రాలు) గ్రూప్‌లో రెండో స్థానంతో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. జర్మనీతో మ్యాచ్‌లో ఆ జట్టు దూకుడు ప్రదర్శించింది. ఎండోయె (28వ నిమిషంలో) గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ప్రత్యర్థిని అందుకునేందుకు జర్మనీ కష్టపడింది. చివరకు 90 నిమిషాలు ముగిశాక స్టాపేజీ సమయంలో ఫుల్‌క్రగ్‌ (90+2) గోల్‌తో ఆ జట్టు ఓటమి తప్పించుకుంది. ముగ్గురు ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకుని అతను ఈ గోల్‌ కొట్టాడు. మరో గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో హంగేరీ 1-0తో స్కాట్లాండ్‌పై నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. మరో నిమిషం ఆట మాత్రమే ఉందనగా సోబోత్‌ (90+10వ) గోల్‌ చేసి జట్టును గెలిపించాడు. 

యూరో కప్‌లో ఈనాడు

నెదర్లాండ్స్‌ × ఆస్ట్రియా (రాత్రి 9.30); ఫ్రాన్స్‌ × పోలెండ్‌ (రాత్రి 9.30)
ఇంగ్లాండ్‌ × స్లొవేనియా (రాత్రి 12.30); డెన్మార్క్‌ × సెర్బియా (రాత్రి 12.30) 


గంభీర్‌.. అయిదు షరతులు

దిల్లీ: భారత జట్టు చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అయిదు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్‌ కోసం గంభీర్‌ ఒక్కడే దరఖాస్తు చేసుకోవడంతో అతని ఎంపిక లాంఛనమేనని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అయితే గతవారం క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ముందు ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్‌ తన షరతులు తెలియజేసినట్లు సమాచారం. తన అయిదు షరతులకు అంగీకరిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. అందులో మొదటిది.. జట్టు క్రికెట్‌ వ్యవహారాల్లో పూర్తి నియంత్రణ తనకే ఉండాలి. బోర్డు జోక్యం అస్సలు ఉండకూడదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌తో సహా సహాయక సిబ్బందిని ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛనివ్వాలన్నది రెండోది. మూడో షరతు అత్యంత కీలకమైనది. పాకిస్థాన్‌ వేదికగా జరిగే 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, షమీకి చివరి అవకాశం. భారత్‌ విజేతగా నిలవడంలో విఫలమైతే వీరందరినీ జట్టు నుంచి తప్పించాలి. అయితే మూడు ఫార్మాట్ల నుంచా లేదా అన్నది స్పష్టత లేదు. టెస్టులకు ప్రత్యేక జట్టు ఎంపిక చేయాలన్నది నాలుగోది. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నది చివరి షరతు. గంభీర్‌ షరతులకు బీసీసీఐ ఒప్పుకుంటే రోహిత్, కోహ్లి, జడేజా, షమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్లే. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఓడితే ఈ నలుగురికి ఉద్వాసన ఖాయమన్న సంకేతాలిచ్చినట్లు అవుతుంది. అదే జరిగితే సీనియర్‌ ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో కొనసాగుతారా? అన్నది అతిపెద్ద ప్రశ్న!


మా వాళ్లు వెస్టిండీస్‌కే ప్రాధాన్యమివ్వాలి: పావెల్‌ 

నార్త్‌ సౌండ్‌: వెస్టిండీస్‌ బోర్డుతో జీతాల గొడవ కారణంగా ఆ దేశ స్టార్‌ ఆటగాళ్లు చాలా ఏళ్ల నుంచి లీగ్‌ క్రికెట్‌కే ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్‌ గేల్, కీరన్‌ పొలార్డ్, డ్వేన్‌ బ్రావో, సునీల్‌ నరైన్‌ లాంటి మేటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమై ప్రపంచవ్యాప్తంగా లీగ్స్‌ ఆడుతూ సాగారు చాలా ఏళ్లు. ఈ మధ్య ఆండ్రి రసెల్, నికోలస్‌ పూరన్‌ లాంటి స్టార్లు తరచుగా వెస్టిండీస్‌కు ఆడుతుండడంతో ఆ జట్టు ప్రదర్శన మెరుగు పడుతోంది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లందరూ ఫ్రాంఛైజీ క్రికెట్‌ను మించి జాతీయ జట్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని విండీస్‌ టీ20 కెప్టెన్‌ రోమన్‌ పావెల్‌ కోరాడు. ‘‘మేమందరం వెస్టిండీస్‌కు ఆడుతుంటే దేశంలో ఒక ఉత్సాహం కనిపిస్తోంది. ఇది ఇక ముందూ కొనసాగుతుందని, మా దేశ క్రికెట్‌ సరైన దారిలో నడుస్తుందని ఆశిస్తున్నాం. మా ప్రధాన ఆటగాళ్లు వెస్టిండీస్‌కు ఆడడానికే ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటున్నా. సహచరుల్లో స్ఫూర్తి నింపి ఇటువైపు నడిపించడం కెప్టెన్‌ బాధ్యత. ఫ్రాంఛైజీ క్రికెట్‌ను ప్రధానంగా నడిపించేది డబ్బే. వెస్టిండీస్‌ లాంటి చిన్న బోర్డుకు దాన్ని తట్టుకుని ఉత్తమ జట్టును నిలబెట్టడం సవాలే. అయితే మా ఆటగాళ్లు అందులో ఆడుతూనే దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తూ రెండు చోట్లా రాణించాలని కోరుకుంటున్నా’’ అని పావెల్‌ తెలిపాడు.


బషీర్‌.. ఒకే ఓవర్లో 38 పరుగులు 

వొర్సెస్టర్‌: ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ అవాంచిత రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లిష్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వొర్సెస్టర్‌షైర్‌కు ఆడుతూ.. సర్రేపై ఒకే ఓవర్లో 38 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి అయిదు బంతులను సర్రే బ్యాటర్‌ డాన్‌ లారెన్స్‌ సిక్స్‌లుగా మలిచాడు. ఆరో బంతి వైడ్‌ పడడంతో పాటు బౌండరీకి వెళ్లింది. ఆ తర్వాతి బంతికి బషీర్‌ నోబాల్‌ వేయగా.. లారెన్స్‌ సింగిల్‌ తీశాడు. చివరి బంతికి అతడు డాట్‌ బాల్‌ వేశాడు. కౌంటీ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా మ్యాక్స్‌ ట్యూడర్‌ (38)ను బషీర్‌ సమం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌ తరఫున అరంగేట్రం చేసిన బషీర్‌కు.. ఇది పన్నెండో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ మాత్రమే.


టైటిల్‌పై గాయత్రి జోడీ గురి 

ఫోర్ట్‌ వర్త్‌ (అమెరికా): భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ.. యూఎస్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 టైటిల్‌పై గురిపెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో గాయత్రి- ట్రీసా జోడీ తమ అదృష్టం పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో రెండో సీడ్‌ బరిలో దిగుతున్న భారత జోడీకి తొలి రౌండ్లో బై లభించింది. ప్రిక్వార్టర్స్‌లో షాన్‌- హుంగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీతో గాయత్రి- ట్రీసా జంట తలపడుతుంది. పారిస్‌ ఒలింపిక్స్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్, లక్ష్యసేన్, సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో టోర్నీకి దూరంగా ఉన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని