ఇది 50 శాతమే

టీమ్‌ఇండియాకు ఎంపికవడంతో తన కల 50 శాతమే నెరవేరిందని, జెర్సీ వేసుకుని జట్టుకు విజయాలు అందిస్తేనే అది పూర్తవుతుందని నితీశ్‌ కుమార్‌ రెడ్డి తెలిపాడు.

Published : 25 Jun 2024 04:30 IST

దిల్లీ: టీమ్‌ఇండియాకు ఎంపికవడంతో తన కల 50 శాతమే నెరవేరిందని, జెర్సీ వేసుకుని జట్టుకు విజయాలు అందిస్తేనే అది పూర్తవుతుందని నితీశ్‌ కుమార్‌ రెడ్డి తెలిపాడు. 2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున  21 ఏళ్ల నితీశ్‌ 11 ఇన్నింగ్స్‌లో 303 పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. తన కెరీర్‌ కోసం ఉద్యోగం వదులుకుని ఇబ్బందులు పడ్డ తండ్రి ముత్యాల రెడ్డి గర్వపడేలా చేయడమే లక్ష్యమన్నాడు. ‘‘జాతీయ జట్టుకు ఎంపికవడం గర్వపడే సందర్భం. కానీ  50 శాతం కల మాత్రమే నెరవేరింది. జెర్సీ వేసుకుని దేశం కోసం మ్యాచ్‌లు గెలిస్తేనే అది పూర్తవుతుంది. నా నైపుణ్యాలను నమ్మి ఉద్యోగం వదిలేసుకున్నప్పుడు నా తండ్రిని మాటలన్న వాళ్ల కళ్లలో ఆయనపై గౌరవం చూడాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు నాన్నకు రాజస్థాన్‌కు బదిలీ అయింది. కానీ అక్కడ నా ఆట మెరుగయ్యేలా వసతులు లేకపోవడంతో మా అమ్మతో మాట్లాడాక ఆయన ఉద్యోగం వదిలేశారు. అప్పుడు వచ్చిన రూ.20 లక్షలతో వ్యాపారం మొదలెట్టారు. కానీ కొంతమంది స్నేహితులు ఆయన్ని ముంచడంతో డబ్బంతా పోయింది. ఉద్యోగం వదిలేయడం, డబ్బులు నష్టపోవడంతో అందరూ ఆయన్ని వేలెత్తిచూపారు. అప్పుడు నాకు 12 ఏళ్లు కావడంతో అంతా అర్థమైంది. భారత జట్టుకు ఎంపికై ఆయన త్యాగానికి అర్థం ఉండేలా చేయాలని అప్పుడే అనుకున్నా. నా జూనియర్‌ కెరీర్‌ ఆరంభంలో డబ్బులు లేక సీజన్‌కు ఒకే బ్యాట్‌ వాడేవాణ్ని. పగుళ్లు వస్తే టేపు వేసుకునేవాణ్ని. ఒకప్పుడు నాన్నను మాటలు అన్నవాళ్లే ఈ ఏడాది ఐపీఎల్‌లో నా ప్రదర్శన తర్వాత పొగుడుతున్నారు. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్, క్లాసెన్, భువనేశ్వర్‌ నాకు కీలకమైన సూచనలిచ్చారు’’ అని నితీశ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని