వార్నర్‌ ముగించేశాడు

అద్భుత కెరీర్‌కు అనుకోని ముగింపు! ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్లో ఇక కనిపించడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్‌కు దూరమైన ఈ లెఫ్టార్మ్‌ డాషింగ్‌ ఓపెనర్‌.. వీడ్కోలు వందనాలు, అభిమానుల కేరింతలు లేకుండానే ఆస్ట్రేలియా తరఫున ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు.

Published : 26 Jun 2024 02:55 IST

కింగ్స్‌టౌన్‌: అద్భుత కెరీర్‌కు అనుకోని ముగింపు! ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్లో ఇక కనిపించడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్‌కు దూరమైన ఈ లెఫ్టార్మ్‌ డాషింగ్‌ ఓపెనర్‌.. వీడ్కోలు వందనాలు, అభిమానుల కేరింతలు లేకుండానే ఆస్ట్రేలియా తరఫున ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికట్‌ ముగిస్తానని ఇంతకుముందే ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్‌కు.. భారత్‌తో సూపర్‌-8 మ్యాచే ఆఖరిది. సోమవారం ఆరు బంతుల్లో 6 పరుగులు చేసిన వార్నర్‌.. అదే ఆఖరి మ్యాచ్‌ అవుతుందని ఊహించి ఉండకపోవచ్చు. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్‌ విజయం సాధించడంతో.. ఆస్ట్రేలియా సెమీస్‌ ఆశలకు, అతడి కెరీర్‌కు తెరపడింది. 2009 జనవరిలో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన వార్నర్‌.. టీ20 మ్యాచ్‌తోనే ముగించడం విశేషం. నిరుడు నవంబరులో భారత్‌తో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో వార్నర్‌ చివరి వన్డే ఆడాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టులో బరిలో దిగాడు. ఎంతో గొప్ప ఆటగాడిగా మన్ననలు పొందిన వార్నర్‌ కెరీర్లో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం. దీనిపై బంగ్లాదేశ్‌తో సూపర్‌-8 మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. ‘‘20, 30 ఏళ్ల తర్వాత నా ప్రస్తావన వచ్చినా బాల్‌ టాంపరింగ్‌ గురించి చర్చిస్తారు. దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే నన్ను అభిమానించే వాళ్లు మాత్రం క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన బ్యాటర్‌గా చూస్తారు. అది నాకు సంతృప్తినిచ్చే విషయం’’ అని అన్నాడు. కెరీర్లో 110 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 33.43 సగటు, 142.47 స్ట్రైక్‌ రేటుతో 3277 పరుగులు సాధించాడు. అందులో ఒక శతకం, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 112 టెస్టుల్లో 44.59 సగటుతో 8786 పరుగులు రాబట్టాడు. 26 శతకాలు, 37 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 161 వన్డేల్లో 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. అందులో 22 శతకాలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు