అదరగొట్టిన అల్కరాస్‌

టైటిల్‌ ఫేవరెట్‌ మూడో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ వింబుల్డన్‌లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్‌ చేరాడు. అయిదో సీడ్‌ మెద్వెదెవ్‌ రెండో రౌండ్‌ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్‌ రూడ్‌కు ఫోగ్నిని షాకిచ్చాడు.

Published : 04 Jul 2024 03:23 IST

మూడో రౌండ్లో ప్రవేశం 
రూడ్‌ ఔట్‌
వింబుల్డన్‌ 
లండన్‌

టైటిల్‌ ఫేవరెట్‌ మూడో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ వింబుల్డన్‌లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్‌ చేరాడు. అయిదో సీడ్‌ మెద్వెదెవ్‌ రెండో రౌండ్‌ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్‌ రూడ్‌కు ఫోగ్నిని షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ గాఫ్‌ మూడో రౌండ్లోకి ప్రవేశించింది.

టైటిల్‌కు గట్టిపోటీదారైన అల్కరాస్‌ (స్పెయిన్‌) వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో అతడు 7-6 (7-5), 6-2, 6-2తో వుకిచ్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలి సెట్లో ప్రతిఘటన ఎదుర్కొన్న అల్కరాస్‌.. ఆ తర్వాతి సెట్లలో అలవోకగా పైచేయి సాధించాడు. మ్యాచ్‌లో అల్కరాస్‌ 11 ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టాడు. మరోవైపు మెద్వెదెవ్‌ (రష్యా) 6-7 (3-7), 7-6 (7-4), 6-4, 7-5తో ముల్లర్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గాడు. గట్టి పోటీ ఎదుర్కొన్న మెద్వెదెవ్‌ మ్యాచ్‌లో 14 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. రూడ్‌ (నార్వే)  కథ రెండో రౌండ్లోనే ముగిసింది. ఇటలీకి చెందిన  ఫా గ్నిని 6-4, 7-5, 6-7 (1-7), 6-3తో రూడ్‌కు షాకిచ్చాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నకషిమ (జపాన్‌) 6-3, 6-2, 6-2తో థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)పై, హంబెర్ట్‌ (ఫ్రాన్స్‌) 7-6 (11-9), 6-1, 6-3తో వాన్‌ డి జాండ్‌షల్ప్‌ (నెదర్లాండ్స్‌)పై, తియోఫె (అమెరికా)  7-6 (7-5), 6-1, 6-3తో కోరిచ్‌ (క్రొయేషియా)పై గెలిచారు. పౌలీ (ఫ్రాన్స్‌) 3-6, 7-6 (7-4), 3-6, 6-3, 6-1తో డిజెరె (క్రొయేషియా)పై, నిషికోరి (జపాన్‌) 7-5, 4-6, 7-6 (7-2), 3-6, 6-2తో రిందెర్‌కెంచ్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గి రెండో రౌండ్‌ చేరుకున్నారు.

గాఫ్‌ ముందంజ: మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కొకో గాఫ్‌ (అమెరికా) అలవోకగా మూడో రౌండ్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో ఆమె 6-2, 6-1తో తొదోని (రొమేనియా)ని చిత్తు చేసింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గాఫ్, మ్యాచ్‌లో రెండు ఏస్‌లు, 13 విన్నర్లు కొట్టింది. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. మరో మ్యాచ్‌లో కార్టల్‌ (బ్రిటన్‌) 6-3, 5-7, 6-3తో బరెల్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. మరోవైపు 11వ సీడ్‌ కొలిన్స్‌ (అమెరికా) రెండో రౌండ్‌కు చేరుకుంది. మొదటి రౌండ్లో ఆమె 6-3, 7-6 (7-4)తో టౌసన్‌ (డెన్మార్క్‌)ను ఓడించింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో క్రెజికోవా (చెక్‌) 7-6 (7-4), 6-7 (1-7), 7-5తో కుదెర్‌మెతోవా (రష్యా)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌) 7-5, 6-7 (9-7), 6-3తో లినెటె (పోలెండ్‌)పై, నీమియర్‌ (జర్మనీ) 6-2, 6-1తో గొలుబిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై, వొలినెట్స్‌ (అమెరికా) 6-2, 7-5తో కార్లె (అర్జెంటీనా)పై, ఒసోరియో (కొలంబియా) 6-3, 6-1తో లారెన్‌ డేవిస్‌ (అమెరికా)పై, హదద్‌ మలా (బ్రెజిల్‌) 7-5, 6-3తో ఫ్రెచ్‌ (పోలెండ్‌)పై, ఆంద్రీస్కూ (కెనడా) 6-3, 7-6 (7-5)తో నొస్కోవా (చెక్‌)పై విజయం సాధించారు.

నగాల్‌ జోడీ ఔట్‌: పురుషుల డబుల్స్‌లో సుమిత్‌ నగాల్, లజోవిచ్‌ (క్రొయేషియా) జంట తొలి రౌండ్‌నే దాటలేకపోయింది. ఏకపక్ష పోరులో ఈ జోడీ 2-6, 2-6తో మార్టినెజ్‌-మునార్‌ (స్పెయిన్‌) ద్వయం చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని