క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను వైట్‌వాష్‌తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది.

Published : 05 Jul 2024 03:46 IST

దక్షిణాఫ్రికా మహిళలతో టీ20 సిరీస్‌ నేటి నుంచే

చెన్నై: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను వైట్‌వాష్‌తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్‌ను, 1-0తో ఏకైక టెస్టును గెలుచుకున్న భారత్‌.. టీ20ల్లోనూ 3-0తో సంపూర్ణ ఆధిపత్యం కనబరచాలని ఉవ్విళ్లూరుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి పోరులో భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. సఫారీలతో సిరీస్‌ను ఈనెల 19న శ్రీలంకలో ప్రారంభమయ్యే ఆసియా కప్, అక్టోబరు 4న బంగ్లాదేశ్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్‌ చూస్తోంది. వరుసగా వన్డేలు, టెస్టుల్లో సత్తాచాటిన భారత్‌.. పొట్టి సిరీస్‌లోనూ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. వన్డే సిరీస్‌లో వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన రెండు శతకాలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సెంచరీ సాధించింది. ఏకైక టెస్టులో షెఫాలీ వర్మ డబుల్‌ సెంచరీతో అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌ కూడా రాణించారు. రేణుక సింగ్, పూజ వస్త్రాకర్, అరుంధతిరెడ్డి, దీప్తి శర్మ, రాధ యాదవ్‌తో భారత బౌలింగ్‌ పటిష్టంగా ఉంది. మరోవైపు టీ20 సిరీస్‌లో సత్తాచాటి పరువు కాపాడుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.


14 ఏళ్లకే ఒలింపిక్స్‌కు.. 

బెంగళూరు: ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఏ క్రీడాకారులకైనా పెద్ద కల.. ఎంతగా శ్రమించినా కెరీర్‌లో ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించని అథ్లెట్లు చాలామంది ఉంటారు. అలాంటిది 14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది భారత స్విమ్మర్‌ దినింది దేశింగు. కర్ణాటకకు చెందిన ఈ టీనేజ్‌ కెరటం.. పారిస్‌లో మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పోటీపడబోతోంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ అమ్మాయి.. వేగంగా స్విమ్మింగ్‌లో ఎదిగింది. గతేడాది జాతీయ క్రీడలు, జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో సత్తా చాటిన దినింది.. యూనివర్సిటీ ర్యాంకింగ్‌ ద్వారా ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంది. ‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. సాధారణంగా నా వయసు వాళ్లు స్నేహితులతో ఎక్కువ గడుపుతారు. కానీ నేను స్విమ్మింగ్‌పూల్‌నే ఎక్కువ సమయం వెచ్చించాను. కొన్ని ఆనందాలను కోల్పోయినా ఒలింపిక్స్‌లో పాల్గొనబోతుండడం మరింత ఆనందాన్ని ఇస్తోంది’’ అని దినింది తెలిపింది.


అథ్లెట్‌ దీపాంషిపై వేటు 

దిల్లీ: భారత అగ్రశ్రేణి 400 మీటర్ల అథ్లెట్‌ దీపాంషిపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) వేటు వేసింది. ఇటీవలి జాతీయ అంతర్‌ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో విఫలమైన దీపాంషిపై సస్పెన్షన్‌ విధించింది. ఈ పోటీల్లో దీపాంషి రెండో స్థానంలో నిలిచింది. పోటీల సందర్భంగా నాడా సేకరించిన నమూనాల్లో దీపాంషి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది.


గుకేశ్, ప్రజ్ఞానందలకు మళ్లీ డ్రానే 

బుచారెస్ట్‌ (రొమేనియా): సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నీలో భారత స్టార్‌ ఆటగాళ్లు గుకేశ్, ప్రజ్ఞానందలకు మరోసారి డ్రానే ఎదురైంది. ఏడో రౌండ్లో గుకేశ్‌ టాప్‌ సీడ్‌ ఫాబియానో కరువాన (అమెరికా)తో గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఆసక్తికరంగా సాగిన ఈ గేమ్‌లో పాయింటును పంచుకోవడానికి 62 ఎత్తుల తర్వాత ఆటగాళ్లు అంగీకరించారు. మరోవైపు ప్రజ్ఞానంద, నెపోమ్నియాచి (రష్యా) మధ్య గేమ్‌ డ్రాగా ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఏడో రౌండ్‌ ముగిసేసరికి కరువాన (4.5) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 4 పాయింట్లతో గుకేశ్, ప్రజ్ఞానంద, అలీరెజా ఫిరౌజా (ఫ్రాన్స్‌) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.


ఒలింపిక్స్‌కు జకోవిచ్, నాదల్‌ 

లండన్‌: టెన్నిస్‌ దిగ్గజాలు రఫెల్‌ నాదల్, నొవాక్‌ జకోవిచ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బరిలో నిలవనున్నారు. గురువారం అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఒలింపిక్స్‌లో పోటీపడనున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. బ్రిటన్‌ స్టార్‌ ఆటగాడు ఆండీ ముర్రే, రష్యా ఆటగాడు డానియల్‌ మెద్వెదెవ్‌ కూడా ఒలింపిక్స్‌ స్వర్ణం కోసం పోటీపడనున్నారు. రష్యాపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో మెద్వెదెవ్‌ తటస్థ ఆటగాడిగా ఆడనున్నాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన నాదల్‌.. ఒలింపిక్స్‌లో 2008లో సింగిల్స్‌లో, 2016లో డబుల్స్‌లో స్వర్ణం నెగ్గాడు. జకోవిచ్‌ ఇప్పటివరకు ఒలింపిక్స్‌ పసిడి సాధించలేదు. మహిళల విభాగంలో ప్రపంచ నం.1 ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌), ప్రపంచ నం.2 కొకో గాఫ్‌ (అమెరికా), నాలుగో ర్యాంకర్‌ ఎలీనా రిబకిన (కజకిస్థాన్‌) ఒలింపిక్స్‌లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.


ఆడ్వాణీ ముందంజ 

రియాద్‌: ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ ఆడ్వాణీ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆడ్వాణీ 4-2తో సిద్ధార్థ్‌ పారిఖ్‌పై గెలిచి ముందంజ వేశాడు. ఒకదశలో 0-2తో వెనుకంజలో ఉన్న అతడు గొప్పగా పుంజుకుని సిద్ధార్థ్‌పై పైచేయి సాధించాడు.


రజావత్‌ శుభారంభం 

కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత ఆటగాడు ప్రియాన్షు రజావత్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో రజావత్‌ 17-21, 21-16, 21-14తో రస్‌ముస్‌ గెమ్కె (డెన్మార్క్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో శంకర్‌ ముత్తుసామి 16-21, 17-21తో అలెక్స్‌ లేనియర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, ఆయుష్‌ శెట్టి 14-21, 11-21తో కొకి వతనబె (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌లో తాన్యా హేమంత్‌ 21-13, 20-22, 21-14తో జాకీ డెంట్‌ (కెనడా)పై, అనుపమ ఉపాధ్యాయా 21-11, 21-11తో రాచెల్‌ డారా (ఐర్లాండ్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని