జకోవిచ్‌ జోరు.. ఒసాకా ఔట్‌

వింబుల్డన్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్‌ మూడో రౌండ్‌ చేరాడు.

Published : 05 Jul 2024 03:47 IST

వింబుల్డన్‌

లండన్‌: వింబుల్డన్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్‌ మూడో రౌండ్‌ చేరాడు. గురువారం జకో 6-3, 6-4, 5-7, 7-5తో ఫియర్న్‌లే (బ్రిటన్‌)పై నెగ్గాడు. మ్యాచ్‌లో 14 ఏస్‌లు కొట్టిన జకో.. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. హోరాహోరీగా సాగిన మరో పోరులో ప్రపంచ నం.1 జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) 7-6 (7-3), 7-6 (7-4), 2-6, 7-6 (7-4)తో సహచరుడు 2021 రన్నరప్‌ బెరెటినిపై విజయం సాధించి మూడో రౌండ్‌ చేరాడు.స్విస్‌ స్టార్‌ వావ్రింకా 6-7 (5-7), 4-6, 6-7 (3-7)తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) చేతిలో కంగుతిన్నాడు. ఏడోసీడ్‌ హర్కాజ్‌ (పోలెండ్‌) 6-7 (2-7), 4-6, 6-2, 6-6 (8-9)తో ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)తో మ్యాచ్‌లో వెనకబడిన దశలో గాయం కారణంగా మ్యాచ్‌ను వదులుకున్నాడు. నోరి (బ్రిటన్‌), డిమెనార్‌ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌ చేరారు. 

ఒసాకాకు షాక్‌: నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ నవోమి ఒసాకా (జపాన్‌) రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 19వ సీడ్‌ ఎమ్మా నవారో 6-4, 6-1తో ఒసాకాను ఓడించింది. మరోవైపు టైటిల్‌ ఫేవరెట్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) మూడో రౌండ్‌ చేరింది. ఆమె 6-4, 6-3తో మార్టిచ్‌ (క్రొయేషియా)ను ఓడించింది. అయిదోసీడ్‌ పెగులా (అమెరికా) ఓడిపోయింది. ఆమె 4-6, 7-6 (9-7), 1-6తో వాంగ్‌ (చైనా) చేతిలో కంగుతింది. జాబెర్‌ (ట్యునీసియా), రిబకినా (కజకిస్థాన్‌), బౌజాస్‌ (స్పెయిన్‌), డార్ట్‌ (బ్రిటన్‌) కూడా రెండో రౌండ్‌ దాటారు. 

బోపన్న జోడీ శుభారంభం: పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో రెండోసీడ్‌ బోపన్న ద్వయం 7-5, 6-4తో రాబిన్‌ హాస్, సాండర్‌ అరెండ్స్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించింది. నిరుడు బోపన్న, ఎబ్డెన్‌ జంట వింబుల్డన్‌లో సెమీఫైనల్‌ చేరింది. మరోవైపు యుకి బాంబ్రి, అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జంట 6-4, 6-4తో అలెగ్జాండర్‌ బుబ్లిక్, అలెగ్జాండర్‌ షెవ్‌చెంకో (కజకిస్థాన్‌)పై విజయం సాధించగా.. శ్రీరామ్‌ బాలాజీ, జాన్సన్‌ (బ్రిటన్‌) జోడీ 4-6, 5-7తో నాలుగో సీడ్‌ మార్సెలో అలెవారో, మాట్‌ పవిచ్‌ (క్రొయేషియా) చేతిలో పరాజయంపాలైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని