టీమ్‌ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుపై కాసుల  వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది.

Published : 06 Jul 2024 03:52 IST

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుపై కాసుల  వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. భారత జట్టులో సభ్యులైన నలుగురు మహారాష్ట్ర ఆటగాళ్లను శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. రాష్ట్ర శాసనసభలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సూర్యకుమార్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్‌ దూబెలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శిందే భారత జట్టుకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 


మాపై నమ్మకముంచండి 

దిల్లీ: భారత హాకీ జట్టుపై నమ్మకముంచాలని.. పారిస్‌ ఒలింపిక్స్‌లో అభిమానులను నిరాశపరచమని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పాడు. ఎనిమిదిసార్లు స్వర్ణ పతక విజేత భారత్‌...41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి పతక కరవు తీర్చుకుంది. ఈసారి క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ ఇలా స్పందించాడు. ‘‘టోక్యోలో పతకం గెలవడంతో భారత హాకీకి జీవం వచ్చింది. ఈసారి మాపై బాధ్యత మరింత పెరిగింది. గత క్రీడల్లో కాంస్యం నెగ్గిన తర్వాత అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాలను మరిచిపోలేను. ఇదే ప్రేమ, నమ్మకాన్ని మాపై ఉంచండి. పారిస్‌లో నిరాశపరచం. సర్వశక్తులూ ఒడ్డి మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం’’ అని హర్మన్‌ప్రీత్‌ చెప్పాడు. పారిస్‌లో పసిడి గెలవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నట్లు అతడు తెలిపాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయాన్ని అభిమానులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. పారిస్‌లో హాకీ జట్టు పసిడి గెలిస్తే కూడా ఇలాంటి విజయోత్సవ ర్యాలీనే జరుగుతుందని అనుకుంటున్నా. అందుకే పారిస్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాం’’ అని హర్మన్‌ప్రీత్‌ తెలిపాడు.


క్వార్టర్స్‌లో రజావత్‌ 

కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రజావత్‌ 21-19, 21-11తో తకుమ ఒబయాషి (జపాన్‌)పై నెగ్గాడు. క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌)తో రజావత్‌ తలపడనున్నాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ క్వార్టర్స్‌ చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 17-21, 21-7, 21-8తో నటాషా (డెన్మార్క్‌)- అలీసా (నెదర్లాండ్స్‌) జంటపై గెలుపొందింది. క్వార్టర్స్‌లో పీ షాన్‌- హుంగ్‌ జు (చైనీస్‌ తైపీ) జోడీతో గాయత్రి- ట్రీసా జంట పోటీపడనుంది. మహిళల సింగిల్స్‌లో తాన్య హేమంత్, అనుపమ ఉపాధ్యాయా పోరాటానికి తెరపడింది.


ప్రజ్ఞానంద గేమ్‌ డ్రా 

బుకారెస్ట్‌: సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు మరో డ్రా ఎదురైంది. ఎనిమిదో రౌండ్లో ఫాబియానో కరువానా (అమెరికా)తో అతడు పాయింట్‌ పంచుకున్నాడు. మరో గేమ్‌లో అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో దొమ్మరాజు గుకేశ్‌ డ్రాకు అంగీకరించాడు. ఈ పోరు 30 ఎత్తుల్లోనే ముగిసింది. నిపోమ్నియాషి (రష్యా)తో అలీరెజా (ఫ్రాన్స్‌).. నొదెర్‌బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో డానియల్‌ (రొమేనియా).. లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌)తో వెస్లీ (అమెరికా) డ్రా చేసుకున్నారు. మరో రౌండ్‌ మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో గుకేశ్, ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. కరువానా (5) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


ఫైనల్లో ఆడ్వాణీ 

రియాద్‌: ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు పంకజ్‌ ఆడ్వాణీ  ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆడ్వాణీ 5-0తో సౌరభ్‌  కొఠారిపై విజయం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని