సెమీస్‌లో అర్జెంటీనా

కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్‌తో ఈక్వెడార్‌ను ఓడించింది.

Published : 06 Jul 2024 03:54 IST

కోపా అమెరికా 

హోస్టన్‌: కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్‌తో ఈక్వెడార్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమమైంది. 35వ నిమిషంలో లిసానోర్డ్‌ బంతిని నెట్‌లోకి పంపి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని అందించాడు. అక్కడి నుంచి ఈక్వెడార్‌ కూడా స్కోరు సమం చేయడానికి గట్టిగానే పోరాడింది. 62వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను రోడ్రిగో వృథా చేసి ఈక్వెడార్‌ను నిరాశపరిచాడు. మ్యాచ్‌ ఇంజురీ సమయంలోకి వెళ్లడంతో అర్జెంటీనాదే విజయంగా కనిపించింది. కానీ చివరి సెకన్లలో కెవిన్‌ గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. దీంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్లో తొలి ప్రయత్నంలో మెస్సి బంతిని బార్‌కు కొట్టడంతో అర్జెంటీనా ఒత్తిడిలో పడింది. కానీ జులియన్, అలెక్సిస్, గొంజాలో, ఒటాండీ సఫలం కావడంతో అర్జెంటీనా విజయాన్ని అందుకుంది. ఈక్వెడార్‌ తరఫున జాన్, జార్డీ మాత్రమే గోల్స్‌ కొట్టగలిగారు. అర్జెంటీనా గోల్‌కీపర్‌ మార్టినెజ్‌ మెరుపు డైవ్‌లతో రెండు షాట్లను ఆపి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 


స్విస్‌తో ఇంగ్లాండ్‌ క్వార్టర్స్‌ నేడే 

రాత్రి 9.30 నుంచి

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): యూరో ఫుట్‌బాల్‌ టోర్నీలో మరో ఆసక్తికర పోరు! క్వార్టర్‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌తో ఇంగ్లాండ్‌ తలపడబోతోంది. ప్రిక్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇటలీని ఇంటికి పంపిన స్విస్‌ జట్టు జోరు మీదుంది. కానీ మేనేజర్‌ సౌత్‌గేట్‌ సారథ్యంలో ఓ పెద్ద టోర్నీలో ఇప్పటికే మూడుసార్లు క్వార్టర్స్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ రెండింట్లో గెలిచింది. ఓ మేజర్‌ టోర్నీలో మూడోసారి మాత్రమే క్వార్టర్స్‌కు వచ్చిన స్విస్‌.. ఈసారి మరో అడుగు ముందుకేయాలనే ఉత్సాహంతో ఉంది. రాత్రి 12.30కు ఆరంభమయ్యే మ్యాచ్‌లో తుర్కియేతో నెదర్లాండ్స్‌ ఢీకొంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని