ప్రిక్వార్టర్స్‌లో బదోసా

స్పెయిన్‌ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్‌లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది.

Published : 06 Jul 2024 03:55 IST

చెమటోడ్చిన అల్కరాస్‌
వింబుల్డన్‌ 

లండన్‌: స్పెయిన్‌ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్‌లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో అన్‌సీడెడ్‌ బదోసా 7-6 (8-6), 4-6, 6-4తో 14వ సీడ్‌ కసత్‌కీనా (రష్యా)పై గెలిచింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటనను ఎదుర్కొన్న బదోసా.. ఆ తర్వాతి నుంచి విజృంభించి ఆడింది. కీలక సమయాల్లో బ్రేక్‌లు సాధించి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో 44 విన్నర్లు కొట్టింది. ఏడోసీడ్‌ పౌలిని (ఇటలీ) కూడా ముందంజ వేసింది. రెండో రౌండ్లో ఆమె 7-6 (7-4), 6-1తో ఆండ్రెస్క్యూ (కెనడా)ను ఓడించింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌ వరకు తీసుకెళ్లిన ఆండ్రెస్క్యూ.. రెండో సెట్లో పౌలిని ధాటికి తేలిపోయింది. మరో మ్యాచ్‌లో కొకోగాఫ్‌ (అమెరికా) 6-4, 6-0తో కర్టాల్‌ (బ్రిటన్‌)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. వోజ్నియాకి (డెన్మార్క్‌), కొలిన్స్‌ (అమెరికా) కూడా రెండో రౌండ్‌ దాటారు. వోజ్నియాకి 6-3, 2-6, 7-5తో లెలా ఫెర్నాండెజ్‌ (కెనడా) ఆట కట్టించగా.. కొలిన్స్‌ 6-3, 6-4తో గాల్ఫి (ఇటలీ)ని ఓడించింది. 

అల్కరాస్‌ ముందుకు: టైటిల్‌ ఫేవరెట్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) వింబుల్డన్‌లో చెమటోడ్చాడు. చాలా కష్టంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. అయిదు సెట్ల పాటు సాగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో అల్కరాస్‌ 5-7, 6-2, 4-6, 7-6 (7-2), 6-2తో టియోఫో (అమెరికా)ను అధిగమించాడు. తొలి సెట్‌ నుంచే అల్కరాస్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. టియోఫో ఎక్కడా తగ్గకపోవడంతో సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్తుందేమో అనిపించింది. కానీ 12వ గేమ్‌లో అల్కరాస్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన టియోఫో సెట్‌ గెలిచాడు. కానీ అల్కరాస్‌ పుంజుకున్నాడు. తన శైలిలో దూకుడుగా ఆడి సెట్‌ గెలిచి నిలిచాడు. ఆ తర్వాతి రెండు సెట్లలో ఇద్దరూ చెరొకటి గెలవడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే అయిదో సెట్లో విజృంభించిన అల్కరాస్‌ ప్రత్యర్థికి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. 5-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అతడు.. ఎనిమిదో గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకుని విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాస్‌ 16 ఏస్‌లు, 55 విన్నర్లు కొట్టాడు. మరోవైపు దిమిత్రోవ్‌ (బల్గేరియా), టామీ పాల్‌ (అమెరికా) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు. పదో సీడ్‌ దిమిత్రోవ్‌ 6-3, 6-4, 6-3తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) పోరాటానికి తెరదించగా.. పన్నెండో సీడ్‌ పాల్‌ 6-3, 6-4, 6-2తో బబ్లిక్‌ (కజకిస్థాన్‌)పై గెలిచాడు. జ్వెరెవ్‌ (జర్మనీ) 6-2, 6-1, 6-4తో గిరాన్‌ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌ చేరాడు.  పురుషుల డబుల్స్‌లో యుకి బాంబ్రి-ఒలివెటి (ఫ్రాన్స్‌) జంట పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో యుకి ద్వయం 6-4, 4-6, 3-6తో క్రావిట్జ్‌-పయిట్జ్‌ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని