వినేశ్‌కు స్వర్ణం

గ్రాండ్‌ప్రి రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగాట్‌ సత్తా చాటింది.

Published : 07 Jul 2024 03:28 IST

మాడ్రిడ్‌: గ్రాండ్‌ప్రి రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగాట్‌ సత్తా చాటింది. 50 కేజీల విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో వినేశ్‌ 10-5తో మారియా టిమెర్‌కోవా (రష్యా)పై విజయం సాధించింది. అంతకుముందు వరుసగా మూడు బౌట్లలో భారత స్టార్‌ తేలిగ్గా నెగ్గింది. తొలి రౌండ్లో గుజ్‌మన్‌ (క్యూబా)పై 12-4తో విజయం సాధించిన వినేశ్‌... తర్వాత క్వార్టర్స్‌లో మాడిసన్‌ (కెనడా)ను మ్యాట్‌పైకి పడేసి విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో కేథీ (కెనడా)పై 9-4తో గెలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహకాల్లో భాగంగా ఫొగాట్‌ ఈ టోర్నీలో ఆడుతోంది.


టీ20 ఆసియా కప్‌లో అరుంధతి 

ముంబయి: ఆసియా కప్‌ టీ20 టోర్నీలో పోటీ పడే భారత మహిళల జట్టులో తెలుగమ్మాయి, పేసర్‌ అరుంధతి రెడ్డి చోటు దక్కించుకుంది. ఈ జట్టులో ఉన్న తెలుగమ్మాయి ఆమె మాత్రమే. ఈ నెల 19 నుంచి శ్రీలంకలో జరిగే టోర్నీలో భారత జట్టు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో జట్టు బరిలోకి దిగుతుంది.

జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌కెప్టెన్‌), షెఫాలి, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెట్టి, పూజ వస్త్రాకర్, అరుంధతి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక, సజన.


ధ్రువ్‌కు ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌

రియాద్‌: ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ధ్రువ్‌ సిత్వాలా విజేతగా నిలిచాడు. శనివారం తుదిపోరులో 2-5తో దిగ్గజ ఆటగాడు పంకజ్‌ ఆడ్వాణీకి షాకిచ్చాడు. ఈ పోరులో తొలి రెండు గేమ్‌లను గెలిచి ధ్రువ్‌ ఆధిక్యంలో నిలిచాడు. ఆడ్వాణీ తర్వాతి రెండు గేమ్‌లను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లను నెగ్గిన ధ్రువ్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు.


గెలిస్తేనే నిలిచేది 

నేడే దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20
రా.7 గంటల నుంచి

చెన్నై: దక్షిణాఫ్రికాతో మూడు టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన భారత మహిళల జట్టుకు సవాల్‌! సిరీస్‌ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఆదివారం రెండో టీ20లో హర్మన్‌ప్రీత్‌ బృందం గెలవక తప్పదు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవడంతో తొలి టీ20లో భారత్‌ను దెబ్బతీసింది.


ప్రజ్ఞానంద, గుకేశ్‌లకు నిరాశ 

బుకారెస్ట్‌: ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్‌లకు నిరాశ!  ఈ భారత యువ తారలు కొద్దిలో సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. ఎనిమిదో రౌండ్‌ ఆఖరికి చెరో 4.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ప్రజ్ఞానంద, గుకేశ్‌.. శనివారం చివరిదైన తొమ్మిదో రౌండ్లో డ్రా చేసుకున్నారు. మరోవైపు అగ్రస్థానంలో ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫాబియానో కరువానా (అమెరికా) ఆఖరి రౌండ్లో అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడాడు. దీంతో ప్రజ్ఞానంద, గుకేశ్‌తో పాటు కరువానా, అలీరెజా (ఫ్రాన్స్‌) తలో 5 పాయింట్లతో సమమయ్యారు. ఈ నలుగురి మధ్య టైబ్రేకర్‌ నిర్వహించగా.. కరువానా టైటిల్‌ ఎగరేసుకుపోయాడు.


సెమీస్‌లో కెనడా

కోపా అమెరికా 

అర్లింగ్టన్‌: కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో కెనడా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్‌ పోరులో ఆ జట్టు పెనాల్టీ షూటౌట్లో 4-3తో వెనెజువెలాను ఓడించింది. నిర్ణీత సమయంలో కెనడా-వెనెజువెలా 1-1తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఆరంభం కెనడాదే. 13వ నిమిషంలో జాకబ్‌ కొట్టిన గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. ద్వితీయార్థంలో వెనెజువెలా పుంజుకోకపోవడంతో కెనడా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ 64వ నిమిషంలో రాండాన్‌ బంతిని నెట్‌లోకి పంపడంతో మ్యాచ్‌ ఆసక్తికర మలుపు తిరిగింది. ఆ తర్వాత రెండు జట్ల గోల్‌ ప్రయత్నాలు సఫలం కాలేదు. అదనపు సమయంలోనూ ఫలితం రాకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్లో కెనడా తరఫున జొనాథన్, మొయిజ్, అల్ఫెన్సో, కోన్‌ సఫలం కాగా.. వెనెజువెలా జట్టులో రాండాన్, రింకాన్, జొండర్‌ మాత్రమే గోల్స్‌ కొట్టడంతో విజయం కెనడా సొంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు