నేను ఆ తరహా కాదు

టీమ్‌ఇండియా కోచ్‌గా తాను కెప్టెన్‌ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు.

Published : 07 Jul 2024 03:29 IST

ముంబయి: టీమ్‌ఇండియా కోచ్‌గా తాను కెప్టెన్‌ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. కోచ్‌గా తన అనుభవాల గురించి రాహుల్‌ మాట్లాడాడు. ‘‘నేను అంతకుముందున్నది ఆపేసి, మొత్తం మార్చేయాలనుకునే తరహా వ్యక్తిని కాదు. అస్థిరత మంచి వాతావరణాన్ని చెడగొడుతుందని నమ్ముతా. కోచ్‌గా నేను కూడా జట్టులో భాగమే కాబట్టి అక్కడ అంతా బాగుందనే భావన కలిగించాలి. విఫలమవుతామేమో అన్న భయం ఎవరిలోనూ ఉండకూడదు. ఈ దిశగా సభ్యులను నడిపించడంలో సవాలు ఎదుర్కొన్నా. కానీ ఇది నా విజయాల్లో ఒకటిగా భావిస్తా. కొవిడ్‌ చివరి దశలో ఉండగా కోచ్‌గా బాధ్యతలు అందుకున్న నాకు కీలకంగా మారిన విషయం.. మూడు ఫార్మాట్లకు తగ్గట్లుగా ఆటగాళ్లపై పనిభార నిర్వహణ. కెప్టెన్‌ రోహిత్‌తో పని చేయడాన్ని ఎంతో ఆస్వాదించా. అతను కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. వ్యక్తిగా, కెప్టెన్‌గా అతను ఎదిగిన తీరును చూశా. 10-12 ఏళ్లుగా జట్టు కోసం ఎంతో చేశాడు. తన జట్టును ఎంతో బాగా చూసుకుంటాడు. అతణ్ని తప్పకుండా మిస్సవుతా. కోచ్‌గా తొలి నాళ్లలో కెప్టెన్‌గా ఉన్న విరాట్‌తోనూ మంచి అనుబంధం ఉంది. ఆటలో తన ప్రొఫెషనలిజం ఎప్పుడూ కనిపిస్తుంటుంది. నిరంతరం మెరుగవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కోచ్‌గా ఫలితాల కోసమే పని చేస్తాం కానీ.. నా దృష్టిలో అది ముఖ్యం కాదు. కెప్టెన్‌ తన ప్రణాళికల్ని సమర్థంగా అమలు చేయడానికి తోడ్పడమే నా ప్రధాన బాధ్యత’’ అని బీసీసీఐ టీవీతో ద్రవిడ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని