స్వైటెక్‌కు షాక్‌

వింబుల్డన్‌లో పెద్ద సంచలనం! టైటిల్‌ ఫేవరెట్‌ ఇగా స్వైటెక్‌ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్‌సీడ్‌కు కజకిస్థాన్‌ అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ యూలియా పుటిన్‌సెవా చెక్‌ పెట్టింది.

Published : 07 Jul 2024 03:30 IST

యూలియా చేతిలో ఓటమి
స్వితోలినా, జ్వెరెవ్‌ ముందంజ
లండన్‌

వింబుల్డన్‌లో పెద్ద సంచలనం! టైటిల్‌ ఫేవరెట్‌ ఇగా స్వైటెక్‌ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్‌సీడ్‌కు కజకిస్థాన్‌ అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ యూలియా పుటిన్‌సెవా చెక్‌ పెట్టింది. శనివారం మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో స్వైటెక్‌ 6-3, 1-6, 2-6తో యూలియా చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్‌ను స్వైటెక్‌ బాగానే ఆరంభించింది. తొలి సెట్‌ను పెద్దగా కష్టపడకుండానే గెలుచుకుంది. కానీ రెండో సెట్‌ నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. దూకుడుగా ఆడిన యూలియా.. వరుస పాయింట్లతో దూసుకెళ్లింది. రెండుసార్లు స్వైటెక్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఆమె తేలిగ్గా సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లోనూ స్వైటెక్‌ పుంజుకోలేదు. జోరు కొనసాగించిన యూలియా తేలిగ్గా సెట్‌ నెగ్గింది. ఈ క్రమంలో ఆమె నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. మరోవైపు పదోసీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా) ఓడిపోయింది. స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-1, 7-6 (7-4)తో జాబెర్‌ ఆట కట్టించింది. వాంగ్‌ (చైనా) ప్రిక్వార్టర్స్‌ చేరింది. ఆమె 2-6, 7-5, 6-3తో డార్ట్‌ (బ్రిటన్‌)ను ఓడించింది. తొమ్మిదోసీడ్‌ సకారి (గ్రీస్‌) పోరాటం ముగిసింది. ఆమె 2-6, 2-6తో రదుకాను (బ్రిటన్‌) చేతిలో ఓడింది. వికిచ్‌ (క్రొయేషియా) 7-6 (7-4), 6-7 (3-7), 6-1తో యాస్ట్రెంస్కా (ఉక్రెయిన్‌)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌ చేరింది.

జ్వెరెవ్‌ ముందంజ: జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో అతడు 6-4, 6-4, 7-6 (17-15)తో కామెరూన్‌ నోరి (బ్రిటన్‌) పోరాటానికి తెరదించాడు. ఈ క్రమంలో అతడు 15 ఏస్‌లు, 52 విన్నర్లు కొట్టాడు. షెల్టాన్‌ (అమెరికా), పెరికార్డ్‌ (ఫ్రాన్స్‌) కూడా ముందంజ వేశారు. అయిదు సెట్ల పోరులో షెల్టాన్‌ 6-7 (4-7), 6-2, 6-4, 4-6, 6-2తో షపొవ్‌లోవ్‌ (కెనడా)ను ఓడించాడు. పెరికార్డ్‌ 4-6, 6-2, 7-6 (7-5), 6-4తో రసువోరి (గ్రీస్‌)పై నెగ్గాడు. మరో మూడో రౌండ్‌ పోరులో సినర్‌ (ఇటలీ) 6-1, 6-4, 6-2తో కెక్‌మనోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. తొమ్మిదో సీడ్‌ డిమెనార్‌ (ఆస్ట్రేలియా) కూడా చివరి 16 మందిలో చోటు దక్కించుకున్నాడు. మూడో రౌండ్లో ప్రత్యర్థి పౌలీ (ఫ్రాన్స్‌) వాకోవర్‌ ఇవ్వడంతో డిమెనార్‌ ముందంజ వేశాడు. 

బోపన్న జోడీ ఔట్‌: రెండోసీడ్‌ రోహన్‌ బోపన్న-మథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో బోపన్న ద్వయం 3-6, 6-7 (4-7)తో జెబెన్స్‌-ఫ్రాంట్‌జెన్‌ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ శనివారం సెంటర్‌కోర్టులో మ్యాచ్‌లను వీక్షించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని