రజావత్‌ సంచలనం

కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ సంచలన విజయం సాధించాడు.

Published : 07 Jul 2024 03:34 IST

క్వార్టర్స్‌లో ప్రపంచ నం.4కు షాక్‌

కాల్గారి (కెనడా): కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ సంచలన విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో ఈ ప్రపంచ 39వ ర్యాంకు ఆటగాడు 21-11, 17-21, 21-19తో నాలుగో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)కు షాకిచ్చి సెమీస్‌కు దూసుకెళ్లాడు. తొలి గేమ్‌లో దూకుడుగా ఆడిన భారత కుర్రాడు.. 7-4తో ఆధిక్యం సాధించాడు. కానీ పుంజుకున్న ఆండెర్స్‌ 9-9తో స్కోరు సమం చేశాడు. అక్కడ నుంచి వరుసగా అయిదు పాయింట్లు సాధించిన రజావత్‌.. గేమ్‌ గెలిచేందుకు ఎక్కువ సమయం వృథా చేయలేదు. రెండో గేమ్‌లో రజావత్‌ సత్తా చాటినా.. పోరాడిన ఆండెర్స్‌ గేమ్‌ నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ హోరాహోరీ పోరు సాగింది. ఒక దశలో 19-19తో స్కోరు సమమైంది. ఈ స్థితిలో వరుసగా రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న రజావత్‌.. ఆండెర్స్‌ను కంగుతినిపించాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట కథ ముగిసింది. క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ 18-21, 21-19, 16-21తో షాన్‌-హంగ్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని