క్వార్టర్స్‌లో అల్కరాస్‌

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) వింబుల్డన్‌లో దూసుకెళ్తున్నాడు. జోరు కొనసాగిస్తూ ఈ మూడో సీడ్‌ ఆటగాడు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అల్కరాస్‌ 6-3, 6-4, 1-6, 7-5తో హాంబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు.

Updated : 08 Jul 2024 04:39 IST

వింబుల్డన్‌లో జకో, మెద్వెదెవ్‌ ముందంజ

లండన్‌: టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) వింబుల్డన్‌లో దూసుకెళ్తున్నాడు. జోరు కొనసాగిస్తూ ఈ మూడో సీడ్‌ ఆటగాడు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అల్కరాస్‌ 6-3, 6-4, 1-6, 7-5తో హాంబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి అతడు దూకుడుగా ఆడాడు. తొలి రెండు సెట్లలో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి తేలిగ్గా మ్యాచ్‌ గెలిచేలా కనిపించాడు. కానీ మూడో సెట్లో హాంబర్ట్‌ అనూహ్యంగా ప్రతిఘటించాడు. బలమైన సర్వీసులతో విజృంభించిన ఈ ఫ్రాన్స్‌ కుర్రాడు ఆరంభంలోనే అల్కరాస్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. అదే జోరు 6-1తో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్లోనూ హాంబర్ట్‌ అంత తేలిగ్గా లొంగలేదు. సర్వీస్‌ కోల్పోకూడదనే లక్ష్యంతో ఆడాడు. దీంతో సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లుతుందేమో అనిపించింది. అయితే పదకొండో గేమ్‌లో హాంబర్ట్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన అల్కరాస్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అతడు 14 ఏస్‌లు, 45 విన్నర్లు కొట్టాడు. మరోవైపు టాప్‌ సీడ్‌ సినర్‌ (ఇటలీ) కూడా క్వార్టర్స్‌ చేరాడు. అతడు 6-2, 6-4, 7-6 (11-9)తో షెల్టాన్‌ (అమెరికా) పోరాటానికి తెరదించాడు. ఈ క్రమంలో ఏడు ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టాడు. రెండోసీడ్‌ జకోవిచ్‌ (సెర్బియా), అయిదోసీడ్‌ మెద్వదెవ్‌ (రష్యా) కూడా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో జకోవిచ్‌ 4-6, 6-3, 6-4, 7-6 (7-3)తో పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలి సెట్‌ ఓడినా.. తర్వాతి మూడు సెట్లు ఖాతాలో వేసుకున్న నొవాక్‌ మ్యాచ్‌ ముగించాడు. మెద్వెదెవ్‌ క్వార్టర్స్‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌ తొలి సెట్లో 5-3తో మెద్వెదెవ్‌ ఆధిక్యంలో ఉన్న సమయంలో దిమిత్రోవ్‌ గాయంతో తప్పుకున్నాడు. 

పాలిని ముందుకు: ఇటలీ అమ్మాయి జాస్మైన్‌ పాలిని క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. మాడిసన్‌ కీస్‌ (అమెరికా)తో ప్రిక్వార్టర్స్‌లో పాలిని 6-3, 6-7 (6-8), 5-5తో ఉన్నప్పుడు ప్రత్యర్థి గాయంతో మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. తొలి సెట్‌లో పోటీ ఇచ్చి.. తర్వాతి సెట్‌ను గెలుచుకున్న కీస్‌.. నాలుగోసెట్లోనూ గట్టిగానే పోరాడింది. అయితే ఆమెకు గాయం బ్రేక్‌ వేసింది. నాలుగో సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌)6-0, 6-1తో వోజ్నియాకి (డెన్మార్క్‌)ని ఓడించి ప్రిక్వార్టర్స్‌ చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని