సమరానికి ముందు సాహసం

ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం వస్తుందని అంచనాలున్న క్రీడల్లో హాకీ ఒకటి. గత క్రీడల్లో కాంస్యం నెగ్గి దశాబ్దాల పతక కరవును తీర్చింది భారత జట్టు. ఈసారి ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తామని హాకీ వీరులు ధీమాగా చెబుతున్నారు.

Published : 09 Jul 2024 02:29 IST

బెంగళూరు: ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం వస్తుందని అంచనాలున్న క్రీడల్లో హాకీ ఒకటి. గత క్రీడల్లో కాంస్యం నెగ్గి దశాబ్దాల పతక కరవును తీర్చింది భారత జట్టు. ఈసారి ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తామని హాకీ వీరులు ధీమాగా చెబుతున్నారు. మంచి ఫామ్‌తోనే ఒలింపిక్స్‌లో అడుగు పెడుతున్న హాకీ బృందం.. పారిస్‌లో పోరాటానికి ముందు సాహస యాత్రకు పూనుకోవడం విశేషం. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సాహసికుడు మైక్‌ హార్న్‌ క్యాంపులో మూడు రోజుల పాటు హర్మన్‌ప్రీత్‌ సేన శిక్షణ తీసుకోనుంది. సాహస కృత్యాలతో కూడిన ఈ శిబిరం ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది ముగిశాక భారత జట్టు నెదర్లాండ్స్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత ఒలింపిక్స్‌ కోసం పారిస్‌కు చేరుకుంటుంది.


కలలో జీవిస్తున్నా: బుమ్రా 

దిల్లీ: గత కొన్ని రోజులుగా కలలో జీవిస్తున్నానని టీమ్‌ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు.   ప్రపంచకప్‌ గెలిచిన తమ జట్టుకు జనం అపూర్వ స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ‘‘అందరికీ కృతజ్ఞతలు. గత కొన్ని రోజులుగా కలలో జీవిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది’’ అని బుమ్రా ఎక్స్‌లో పేర్కొన్నాడు. తమ జట్టుకు లభించిన స్వాగతానికి సంబంధించిన వీడియోను కూడా అతడు జత చేశాడు. 30 ఏళ్ల బుమ్రా ప్రపంచకప్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డును అందుకున్నాడు.


చెస్‌ లీగ్‌ జట్టును కొన్న అశ్విన్‌ 

దిల్లీ: గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో అరంగేట్రం చేయనున్న అమెరికన్‌ గ్యాంబిట్స్‌ జట్టును భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కొనుగోలు చేశాడు. టెక్‌ మహీంద్ర, అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య సంయుక్తంగా నిరుడు లీగ్‌ను ప్రారంభించాయి. ప్రచుర పి.పి., వెంకట్, అశ్విన్‌ ఉమ్మడిగా అమెరికన్‌ గ్యాంబిట్స్‌ను కొన్నారు. ‘‘గ్యాంబిట్స్‌ను చదరంగం ప్రపంచానికి పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. సహ యజమానిగా జట్టు విజయంలో భాగమవుతూ.. వారి ప్రయాణాన్ని చూడాలని భావిస్తున్నా’’ అని అశ్విన్‌ తెలిపాడు. ఈ ఏడాది అక్టోబరు 3 నుంచి 12 వరకు లండన్‌లో జరిగే లీగ్‌ రెండో సీజన్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని