జ్వెరెవ్‌ ఇంటికి.. ఫ్రిట్జ్‌ చేతిలో ఓటమి

వింబుల్డన్‌లో సీడెడ్‌ క్రీడాకారుల నిష్క్రమణ కొనసాగుతోంది. జర్మనీ స్టార్‌ జ్వెరెవ్‌ ఓడిపోయాడు. అమెరికా కుర్రాడు ఫ్రిట్జ్‌ అతడికి షాకిచ్చాడు. మరోవైపు డిమెనార్, ముసెటి నాలుగో రౌండ్‌ దాటగా.. మహిళల సింగిల్స్‌లో స్వితోలినా, రిబకినా, ఒస్టాపెంకో తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Published : 09 Jul 2024 02:37 IST

స్వితోలినా, రిబకినా ముందంజ
లండన్‌

వింబుల్డన్‌లో సీడెడ్‌ క్రీడాకారుల నిష్క్రమణ కొనసాగుతోంది. జర్మనీ స్టార్‌ జ్వెరెవ్‌ ఓడిపోయాడు. అమెరికా కుర్రాడు ఫ్రిట్జ్‌ అతడికి షాకిచ్చాడు. మరోవైపు డిమెనార్, ముసెటి నాలుగో రౌండ్‌ దాటగా.. మహిళల సింగిల్స్‌లో స్వితోలినా, రిబకినా, ఒస్టాపెంకో తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

వింబుల్డన్‌లో మరో షాక్‌! అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ఇంటిముఖం పట్టాడు. సోమవారం ప్రిక్వార్టర్స్‌లో ఈ నాలుగోసీడ్‌ 6-4, 7-6 (7-4), 4-6, 6-7 (3-7), 3-6తో 13వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ చేతిలో కంగుతిన్నాడు. తొలి రెండు సెట్లు గెలిచి తేలిగ్గా మ్యాచ్‌ నెగ్గేలా కనిపించిన జ్వెరెవ్‌కు ఫ్రిట్జ్‌ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వరుసగా మూడు సెట్లు కైవసం చేసుకున్న ఈ అమెరికా కుర్రాడు.. క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో 15 ఏస్‌లు, 69 విన్నర్లు కొట్టాడు. 3 డబుల్‌ఫాల్ట్స్, 33 అనవసర తప్పిదాలు చేసిన జ్వెరెవ్‌ ఓటమి కొనితెచ్చుకున్నాడు. మరోవైపు ముసెటి (ఇటలీ), డిమెనార్‌ (ఆస్ట్రేలియా) క్వార్టర్స్‌ చేరారు. ముసెటి 4-6, 6-3, 6-3, 6-2తో పెరికార్డ్‌ (ఫ్రాన్స్‌)ను ఇంటిముఖం పట్టించగా.. డిమెనార్‌ 6-2, 6-4, 4-6, 6-3తో ఆర్థర్‌ ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. టామీ పాల్‌ (అమెరికా) కూడా తుది ఎనిమిదిలో స్థానం దక్కించుకున్నాడు. అతడు 6-2, 7-6 (7-3), 6-2తో బటిస్టా అగట్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. 

స్వితోలినా ముందుకు: ఉక్రెయిన్‌ అమ్మాయి స్వితోలినా వింబుల్డన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో 6-2, 6-1తో వాంగ్‌ (చైనా)ను చిత్తు చేసింది. దూకుడుగా ఆడిన స్వితోలినా తొలి సెట్లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి తేలిగ్గా సెట్‌ గెలుచుకుంది. రెండో సెట్లో ఈ ఉక్రెయిన్‌ అమ్మాయి జోరు మరింత పెరిగింది. ఏడు గేమ్‌లలో ఆరింటిని తానే సొంతం చేసుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె 8 ఏస్‌లు, 21 విన్నర్లు కొట్టింది. నాలుగోసీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌) కూడా ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్‌లో రిబకినా 6-3, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి కలిన్‌స్కయా (రష్యా) గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకుంది. ఒస్టాపెంకో (లాత్వియా) కూడా ప్రిక్వార్టర్స్‌ అధిగమించింది. ఈ పదమూడో సీడ్‌ 6-2, 6-3తో యూలియా (కజకిస్థాన్‌)ను ఓడించింది. 

గాఫ్‌ ఔట్‌: మరోవైపు రెండోసీడ్‌ కొకోగాఫ్‌ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 4-6, 3-6తో నవారో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నవారో తేలిగ్గా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 3 డబుల్‌ఫాల్ట్స్, 25 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్‌ మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్‌ లులూ సన్‌ (న్యూజిలాండ్‌) కూడా తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-2, 5-7, 6-2తో రదుకాను (బ్రిటన్‌)ను ఓడించింది. 2010 తర్వాత ఓ క్వాలిఫయర్‌ వింబుల్డన్‌ క్వార్టర్స్‌ చేరడం ఇదే తొలిసారి. పౌలా బదోసా (స్పెయిన్‌) కథ కూడా ముగిసింది. వికిచ్‌ (క్రొయేషియా) 6-2, 1-6, 6-4తో బదోసాపై విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని