ద్రవిడ్‌.. వృత్తిపరమైన భార్య

పేరు ప్రఖ్యాతుల్ని డ్రెస్సింగ్‌ రూమ్‌ బయటే వదిలేసి తమతో కలిసిపోయాడంటూ మాజీ చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొనియాడాడు.

Published : 10 Jul 2024 02:36 IST

దిల్లీ: పేరు ప్రఖ్యాతుల్ని డ్రెస్సింగ్‌ రూమ్‌ బయటే వదిలేసి తమతో కలిసిపోయాడంటూ మాజీ చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొనియాడాడు. ద్రవిడ్‌ జట్టు నిర్వహణ నైపుణ్యం అద్భుతమని రోహిత్‌ ప్రశంసించాడు. పొట్టి కప్పు విజయంలో చీఫ్‌ కోచ్‌గా కీలకపాత్ర పోషించిన ద్రవిడ్‌కు రోహిత్‌ భావోద్వేగ వీడ్కోలు సందేశం రాశాడు. సుమారు మూడేళ్లు భారత్‌కు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్‌.. పొట్టి కప్పు విజయం తర్వాత తన పదవికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ‘‘మీరు (ద్రవిడ్‌) నా వృత్తిపరమైన భార్య అంటూ రితిక (రోహిత్‌ భార్య) అంటూ ఉంటుంది. మిమ్మల్ని నేను కూడా అలాగే పిలవడం నా అదృష్టం. నా భావాల్ని వ్యక్తపరచడానికి సరైన పదాల కోసం వెతుకుతున్నా. కానీ అందులో సఫలమవుతానో లేదో తెలియదు. క్రికెట్లో మీరు తిరుగులేని దిగ్గజం. మీ పేరు ప్రఖ్యాతలు, ఘనతల్ని వదిలేసి కోచ్‌గా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అడుగుపెట్టారు. మీతో ఏదైనా చెప్పగలిగేంత సౌకర్యంగా ఉండే స్థాయికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆట పట్ల వినయం, ప్రేమ మీరిచ్చిన బహుమతి. మీ నుంచి చాలా నేర్చుకున్నా. ప్రతి జ్ఞాపకం చిరస్మరణీయం. మీ కీర్తి కిరీటంలో ప్రపంచకప్‌ ఒక్కటే లేదు. ఇప్పుడు కలిసికట్టుగా ప్రపంచకప్‌ను సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని