సినర్‌ ఔట్‌

వింబుల్డన్‌లో మహిళల్లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌ ఇప్పటికే ఓడిపోగా.. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ సీడ్‌ సినర్‌ కూడా ఇంటిముఖం పట్టాడు.

Published : 10 Jul 2024 02:42 IST

మెద్వెదెవ్‌ చేతిలో ఓటమి
సెమీస్‌లో అల్కరాస్, వెకిచ్‌
లండన్‌

వింబుల్డన్‌లో మహిళల్లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌ ఇప్పటికే ఓడిపోగా.. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ సీడ్‌ సినర్‌ కూడా ఇంటిముఖం పట్టాడు. క్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ చేతిలో అతడు పరాజయం చవిచూశాడు. స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాస్‌ కూడా సెమీస్‌ చేరాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో వెకిచ్, పౌలిని తుది నాలుగు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

వింబుల్డన్‌లో మరో సీడెడ్‌ క్రీడాకారుడు ఔట్‌! టాప్‌సీడ్‌గా బరిలో దిగిన జానెక్‌ సినర్‌ (ఇటలీ) కథ క్వార్టర్స్‌తోనే ముగిసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పోరులో రష్యా స్టార్‌ డేనియల్‌ మెద్వెదెవ్‌ 6-7 (7-9), 6-4, 7-6 (7-4), 2-6, 6-3తో సినర్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌ ఆరంభంలో మెద్వెదెవ్‌ తడబడ్డాడు. తొలి సెట్‌ ఓడినా.. ఈ అయిదో సీడ్‌ బలంగా పుంజుకున్నాడు. తర్వాతి రెండు సెట్లను గెలిచి ముందంజలో నిలిచాడు. కానీ సినర్‌ వదల్లేదు. బలమైన సర్వీసులు, మెరుపు ప్లేస్‌మెంట్లతో విజృంభించిన ఈ ఇటలీ కుర్రాడు నాలుగో సెట్లో రెండుసార్లు మెద్వెదెవ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు.

అదే జోరుతో సెట్‌ గెలిచి స్కోరు సమం చేశాడు. నిర్ణయాత్మక అయిదో సెట్లో మెద్వెదెవ్‌ సత్తా చాటాడు. డ్రాప్‌ షాట్లతో సినర్‌కు పరీక్ష పెట్టిన అతడు నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే దూకుడు కొనసాగించి తేలిగ్గా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 15 ఏస్‌లు, 56 విన్నర్లు కొట్టాడు. టైటిల్‌పై గురిపెట్టిన అల్కరాస్‌ కూడా సెమీస్‌ చేరాడు. అతడు 5-7, 6-4, 6-2, 6-2తో టామీ పాల్‌ (అమెరికా)ను ఓడించాడు. తొలి సెట్లో మాత్రమే తడబడిన అల్కరాస్‌.. తర్వాత దూకుడుగా ఆడి మ్యాచ్‌ ముగించాడు. మరోవైపు నొవాక్‌ జకోవిచ్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరాడు. ఈ సెర్బియా దిగ్గజం పెద్దగా కష్టపడకుండానే నాలుగో రౌండ్‌ అధిగమించాడు. రెండోసీడ్‌ జకో 6-3, 6-4, 6-2తో రూన్‌ (డెన్మార్క్‌) పోరాటానికి తెరదించాడు. ఈ క్రమంలో నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నొవాక్‌.. 5 ఏస్‌లు, 21 విన్నర్లు కొట్టాడు. 

వెకిచ్‌ దూకుడు: వింబుల్డన్‌లో డోనా వెకిచ్‌ దూసుకెళ్తోంది. పోరాట పటిమ ప్రదర్శిస్తూ ఈ క్రొయేషియా అమ్మాయి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో వెకిచ్‌ 5-7, 6-4, 6-1తో క్వాలిఫయర్‌ లులూ సన్‌ (ఆస్ట్రేలియా) జోరుకు అడ్డుకట్ట వేసింది. తొలి సెట్‌ గెలిచి మరో సంచలనం సృష్టించేలా కనిపించిన సన్‌.. తర్వాత తడబడింది. వెకిచ్‌ ధాటికి నిలువలేకపోయింది. 2, 3 సెట్లలో నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన వెకిచ్‌ వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె 5 ఏస్‌లు, 12 విన్నర్లు కొట్టింది. జాస్మిన్‌ పౌలిని (ఇటలీ) కూడా సెమీస్‌ చేరింది. ఈ ఏడోసీడ్‌ 6-2, 6-1తో నవారో (అమెరికా)ను ఓడించింది. మరోవైపు క్రెజికోవా (చెక్‌) క్వార్టర్స్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 7-5, 6-3తో కొలిన్స్‌ (అమెరికా)ను ఇంటిముఖం పట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు