సంక్షిప్తవార్తలు(4)

టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్‌ జాబితాలో సూర్య రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

Published : 11 Jul 2024 03:29 IST

రెండో స్థానంలోనే సూర్య 

దుబాయ్‌: టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్‌ జాబితాలో సూర్య రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా) నంబర్‌వన్‌ ర్యాంకులో ఉన్నాడు. 13 స్థానాలు మెరుగైన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఏడో ర్యాంకు సాధించాడు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ 9, కుల్‌దీప్‌ యాదవ్‌ 11, జస్‌ప్రీత్‌ బుమ్రా 14వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య అగ్రస్థానం నుంచి రెండో ర్యాంకుకు తగ్గాడు. హసరంగ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు.


అట్కిన్సన్‌ విజృంభణ 

121కే విండీస్‌ ఆలౌట్‌

లార్డ్స్‌: ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను వెస్టిండీస్‌ పేలవంగా ఆరంభించింది. బుధవారం లార్డ్స్‌లో మొదలైన తొలి టెస్టులో పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ కేవలం 41.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మైకెల్‌ లూయిస్‌ (27), కవెమ్‌ హాడ్జ్‌ (24), అథనేజ్‌ (23) వ్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కెరీర్లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న జేమ్స్‌ అండర్సన్‌ ఒక వికెట్‌ పడగొట్టగా.. వోక్స్, స్టోక్స్‌ కూడా తలో వికెట్‌ సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది. ఓపెనర్‌ క్రాలీ (76), ఓలీ పోప్‌ (57) అర్ధశతకాలు సాధించారు. విండీస్‌ బౌలర్లలో సీల్స్‌ (2/31) ఆకట్టుకున్నాడు. రూట్‌ (15), బ్రూక్‌ (25) క్రీజులో ఉన్నారు.


అర్జెంటీనాతో ఆడేదెవరో? 

కోపా అమెరికా సెమీస్‌లో నేడు ఉరుగ్వే × కొలంబియా

(ఉదయం 5.30 నుంచి)

ఛార్లోట్‌ (నార్త్‌ కరోలినా): కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో మరో ఆసక్తికర సమరానికి వేళైంది. తుదిపోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడే జట్టేదో గురువారం తేలిపోనుంది. నేడు రెండో సెమీస్‌లో ఉరుగ్వేతో కొలంబియా తలపడుతోంది. 16వ సారి కోపా అమెరికా టైటిల్‌పై కన్నేసిన ఉరుగ్వే, వరుసగా 27 మ్యాచ్‌ల్లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న కొలంబియా మధ్య పోరు హోరాహోరీగా సాగే ఆస్కారముంది. క్వార్టర్స్‌లో బ్రెజిల్‌పై పెనాల్టీ షూటౌట్లో ఉరుగ్వే గెలిచింది. అందులో రెడ్‌ కార్డు అందుకున్న నాందెజ్‌తో పాటు గాయంతో రొనాల్డ్‌ ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నారు. మరోవైపు పనామాపై 5-0తో గెలిచి సెమీస్‌ చేరిన కొలంబియా.. జేమ్స్‌ రోడ్రిగ్స్, లూయిస్‌ డయాజ్, కోర్డోబాపై ఆశలు పెట్టుకుంది. 


రిటైరైనా ఆగను: ఛెత్రి 

దిల్లీ: అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ఇక్కడితో ఆగిపోనని.. జట్టు పురోగతి కోసం శాయశక్తులా పాటుపడతానని భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్‌ ఛెత్రి అన్నాడు. ‘‘నా కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు చూశా. ఏదో ఒకరోజు మనందరం కలలు గన్న స్థాయికి భారత జట్టు చేరుకుంటుంది. ఆటకు వీడ్కోలు పలికినందున ఇప్పుడు పెద్దగా నేనేమీ చేయలేను. అయితే భారత్‌ అనుకున్న స్థాయికి చేరుకునేందుకు శాయశక్తులా పాటుపడతా. అందుకోసం చాలా కష్టపడాలి. కచ్చితంగా మనం కోరుకున్న స్థాయికి చేరుకుంటాం’’ అని ఛెత్రి తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని