రిబకినా జోరు

రెండో వింబుల్డన్‌ టైటిల్‌పై గురి పెట్టిన రిబకినా జోరు కొనసాగిస్తోంది. మెరుగైన ఆటతీరుతో ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. మరోవైపు ఒస్టాపెంకోకు షాకిచ్చి క్రెజికోవా కూడా ముందంజ వేసింది.

Published : 11 Jul 2024 03:33 IST

సెమీస్‌లో ప్రవేశం 
జకోవిచ్‌ కూడా
లండన్‌

రెండో వింబుల్డన్‌ టైటిల్‌పై గురి పెట్టిన రిబకినా జోరు కొనసాగిస్తోంది. మెరుగైన ఆటతీరుతో ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. మరోవైపు ఒస్టాపెంకోకు షాకిచ్చి క్రెజికోవా కూడా ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో జకోవిచ్‌కు వాకోవర్‌ లభించింది.  

వింబుల్డన్‌లో 2022 ఛాంపియన్‌ ఎలీనా రిబకినా దూసుకెళ్తోంది. కజకిస్థాన్‌కు చెందిన ఈ నాలుగో సీడ్‌ క్రీడాకారిణి బుధవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 6-3, 6-2 తేడాతో స్వితోలినా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. పదునైన సర్వీస్‌లతో చెలరేగే రిబకినా ఈ పోరులోనూ అదే దూకుడు కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 7 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టింది. తొలి సెట్‌ మొదటి గేమ్‌ కోల్పోయిన రిబకినా వెంటనే పుంజుకుంది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్వితోలినా కూడా ప్రతిఘటించడంతో స్కోరు 3-3తో సమమైంది. ఇక అక్కడి నుంచి రిబకినాకు ఎదురులేకుండా పోయింది.  రెండో సెట్లో మరింత విజృంభించి మ్యాచ్‌ గెలుచుకుంది. మరోవైపు 13వ సీడ్‌ వొస్తాపెంకో (లాత్వియా)ను కంగుతినిపించిన 31వ సీడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలిసారి వింబుల్డన్‌ సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో క్రెజికోవా 6-4, 7-6 (7-4)తో గెలిచింది. రెండో సెట్లో ఓ దశలో 1-4తో వెనుకబడ్డప్పటికీ  గొప్ప పోరాట పటిమ ప్రదర్శించిన క్రెజికోవా టైబ్రేకర్‌లో విజయతీరాలకు చేరింది.  

వాకోవర్‌తో: పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ జకోవిచ్‌ సెమీస్‌ చేరాడు. తుంటి గాయంతో మ్యాచ్‌ ఆరంభానికి ముందే డిమినార్‌ (ఆస్ట్రేలియా) టోర్నీ నుంచి తప్పుకోవడంతో జకోవిచ్‌కు వాకోవర్‌ లభించింది. దీంతో ఫెదరర్‌తో సమానంగా రికార్డు స్థాయిలో 13వసారి వింబుల్డన్‌ సెమీస్‌లో అడుగు పెట్టాడు. 

టెన్నిస్‌ వదిలేద్దామనుకుని..: గాయాలు, ఫామ్‌లేమి.. ఎంతగా ప్రయత్నించినా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాననే నిరాశ. ఇక టెన్నిస్‌ను వదిలేద్దామనే ఆలోచనలు. కానీ ఆ కుంగుబాటును దాటి.. డోనా వెకిచ్‌ ఇప్పుడు ఉత్తమ ఫలితాలు అందుకుంటోంది. వింబుల్డన్‌లో సెమీస్‌ చేరిన ఈ క్రొయేషియా భామ.. ఇందుకోసం  43వ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ వరకూ ఎదురు చూసింది. 2021లో మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకునేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. తిరిగి కోర్టులో అడుగుపెట్టినా లయ అందుకునేందుకు ఇబ్బంది పడింది. అయినా ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టి సంకల్ప బలంతో పుంజుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని