Updated : 13 Dec 2020 07:06 IST

శతక్కొట్టారు

పంత్‌ కసిగా.. విహారి కళాత్మకంగా

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 386/4
సిడ్నీ

భారత వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ పంజా విసిరాడు.. కంగారూ గడ్డపై ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్‌కు ముందు సరైన సమయంలో ఫామ్‌ అందుకున్నాడు. ఆస్ట్రేలియా- ఎ జట్టుతో సన్నాహక మ్యాచ్‌లో ధనాధన్‌ సెంచరీతో తన ఆటతీరుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాడు. మరోవైపు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి సైతం శతకంతో కదం తొక్కాడు. విందు భోజనం లాంటి క్లాస్‌ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ వార్మప్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. పృథ్వీ షా, రహానె మినహా రెండో రోజు బ్యాటింగ్‌ చేసిన ఆటగాళ్లు మంచి జోరు మీద కనిపించారు.

ఆస్ట్రేలియా- ఎ జట్టుతో రెండో సన్నాహక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన భారత బ్యాట్స్‌మెన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై శనివారం ఆటలో పూర్తి ఆధిపత్యం చలాయించి జట్టుకు 472 పరుగుల ఆధిక్యం సాధించింది. విహారి (104 బ్యాటింగ్‌; 194 బంతుల్లో 13×4) క్లాస్‌ శతకానికి.. పంత్‌ (103 బ్యాటింగ్‌; 73 బంతుల్లో 9×4, 6×6) మెరుపు సెంచరీ తోడవడంతో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. వీళ్లతో పాటు మయాంక్‌ (61; 120 బంతుల్లో 4×4, 2×6), శుభ్‌మన్‌ గిల్‌ (65; 78 బంతుల్లో 10×4) రాణించడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 386 పరుగులతో రెండో రోజు ఆటను ముగించింది.

షా మినహా..: రెండో రోజు ఆటలో పృథ్వీ షా (3) వికెట్‌ మినహా పెత్తనమంతా భారత్‌దే. కంకషన్‌కు గురైన కార్వే స్థానంలో జట్టులోకి వచ్చిన పేసర్‌ స్టెకెటీ (2/54) ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే షాను ఔట్‌ చేసి భారత్‌కు షాకిచ్చాడు. గిల్‌ జతగా మరో ఓపెనర్‌ మయాంక్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఒక్కసారి పిచ్‌కు అలవాటు పడ్డాక స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. శతకం దిశగా సాగేలా కనిపించిన గిల్‌ను.. స్వెప్సన్‌ (1/148) ఔట్‌ చేశాడు. దీంతో 111/2తో భారత్‌ తొలి సెషన్‌ను ముగించింది.  విరామం తర్వాత విహారితో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. మాడిసన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతను స్వెప్సన్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్‌, ఫోర్‌తో అర్ధశతకానికి చేరుకున్నాడు. ఆ కొద్దిసేపటికే అనవసర షాట్‌కు ప్రయత్నించి విల్డర్‌ముత్‌ (1/79) బౌలింగ్‌లో ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. గత ఇన్నింగ్స్‌ల్లో.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయిన విహారి.. ఈసారి పట్టుదలగా నిలబడ్డాడు. చూడముచ్చటైన బ్యాటింగ్‌తో అలరించాడు. రహానె (38) భారీస్కోరు చేయలేకపోయాడు. చివరి సెషన్‌లో ముందుగా వర్షం మైదానాన్ని తడిపేసి వెళ్లిపోతే.. ఆ తర్వాత పంత్‌ ప్రత్యర్థిని నిలువునా ముంచేశాడు. సిక్సర్లతో చెలరేగాడు. పేస్‌, స్పిన్‌ అనే తేడా లేకుండా.. తనదైన శైలి ఆటతీరుతో హోరెత్తించాడు. విహారి కూడా వేగాన్ని అందుకోవడంతో ప్రత్యర్థి బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో టెస్టులో బ్యాటింగ్‌ కష్టంగా ఉంటుందనే భావనను పూర్తిగా తొలగించేలా పంత్‌ ఇన్నింగ్స్‌ సాగింది. 43 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న అతను.. ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. మరోవైపు విహారి 188 బంతుల్లో శతకం చేరుకున్నాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్‌ క్యాచ్‌ను సదర్‌లాండ్‌ వదిలేశాడు.
ఆ ఓవర్‌..: రెండో రోజు ఆట ముగిసేందుకు మరో ఓవర్‌ మాత్రమే మిగిలి ఉంది. పంత్‌ 81 పరుగులతో ఉన్నాడు. అప్పటికే భారత్‌కు భారీ ఆధిక్యం ఉండడంతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం దాదాపు లేనట్లే! ఈ నేపథ్యంలో పంత్‌ సెంచరీ చేయడం అసాధ్యమే అనుకున్నారంతా. విల్డర్‌ముత్‌ వేసిన ఆ ఓవర్‌ రెండో బంతి నుంచి పంత్‌ ఊచకోత మొదలైంది. వరుసగా రెండు ఫోర్లు బాదిన అతను.. నాలుగో బంతిని స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్‌గా మలచి 95కు చేరుకున్నాడు. చివరి 2 బంతులను బౌండరీ దాటించి 73 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. పంత్‌, విహారి జోడీ అభేద్యమైన అయిదో వికెట్‌కు 136 బంతుల్లో 147 పరుగులు జోడించింది.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 194 ఆలౌట్‌; ఆస్ట్రేలియా-ఎ తొలి ఇన్నింగ్స్‌: 108 ఆలౌట్‌; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 386/4 (విహారి బ్యాటింగ్‌ 104, పంత్‌ బ్యాటింగ్‌ 103, మయాంక్‌ 61, గిల్‌ 65)

శతకంతో పోటీలోకి..

ఆస్ట్రేలియా- ఎ జట్టుతో రెండో వార్మప్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు శతకం బాదిన పంత్‌.. టీమ్‌ఇండియా మేనెజ్‌మెంట్‌కు తీయని తలనొప్పి కలిగించనున్నాడు. టెస్టు సిరీస్‌లో ప్రధాన వికెట్‌ కీపర్‌గా సాహాను ఎంపిక చేసుకోవాలా గత పర్యటనలో మెరిసిన పంత్‌నే ఆడించాలా అన్నది ఇప్పుడు సమస్యే. కెరీర్‌ ఆరంభంలోనే బ్యాట్‌తో రాణించి.. వికెట్ల వెనకాల మంచి ప్రదర్శనతో జట్టు భవిష్యత్‌ ఆశాకిరణంగా కనిపించిన పంత్‌ ఆ తర్వాత నిలకడగా విఫలమవుతూ వచ్చాడు. దీంతో పరిమిత ఓవర్ల జట్లలో స్థానం కోల్పోయాడు. తాజాగా రెండో వార్మప్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి కేవలం 5 పరుగులే చేసి వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టులకు వికెట్‌కీపర్‌గా అతణ్ని తీసుకునే అవకాశాలు తక్కువగానే కనిపించాయి. తొలి వార్మప్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కఠిన పరిస్థితుల్లో అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్న సాహాకు చోటు దక్కడం ఖాయమనిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా సెంచరీతో తిరిగి పంత్‌ పోటీలోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో పట్టుదలతో బ్యాటింగ్‌ చేసిన అతను.. ధనాధన్‌ ఆటతో మునుపటి పంత్‌ను గుర్తుకుతెచ్చాడు. గత ఆస్ట్రేలియా (2018-19) సిరీస్‌లో 4 టెస్టుల్లో 58.33 సగటుతో 350 పరుగులు చేసిన అతను జట్టు చారిత్రక విజయంలో కీలకంగా వ్యవహరించాడు. తొలిసారి కంగారూ గడ్డపై ఆడుతున్నాననే భయం, బెరుకు లేకుండా దూకుడు ప్రదర్శించాడు. అక్కడి పిచ్‌లపై మంచి రికార్డున్న పంత్‌ను కొనసాగిస్తారా? లేదా అనుభవజ్ఞుడైన సాహాను జట్టులోకి తీసుకుంటారా అన్నది చూడాలి.

మరొకరికి కంకషన్‌

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో కంకషన్‌ బారిన పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ జడేజా కంకషన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- ఎ ఓపెనర్‌ పకోస్కీ, రెండో వార్మప్‌ మ్యాచ్‌లో కామెరూన్‌ గ్రీన్‌ తలకు బంతి తగలడంతో ఆటకు దూరమయ్యారు. తాజాగా ఆ జాబితాలో ఆసీస్‌ పేసర్‌ హ్యారీ కాన్వే చేరాడు. రెండో సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- ఎ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన కాన్వే హెల్మెట్‌కు సిరాజ్‌ విసిరిన బౌన్సర్‌ బలంగా తగిలింది. అప్పుడు మైదానంలోకి ఫిజిషియన్‌ వచ్చి పరీక్షించగా కంకషన్‌ లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. కానీ ఆట ముగిసిన తర్వాత మరోసారి అతణ్ని పరీక్షించగా.. మైకం కమ్మినట్లు అవుతుందని తేలడంతో రెండో రోజు ఆటలో అతనికి బదులు స్టెకెటీని కంకషన్‌  సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దించారు.

ఇవీ చదవండి..

మీ ఇంట్లోవాళ్లు అదే చెబుతున్నారు: ధావన్

రోహిత్‌ అక్కడికి వెళ్లాక...

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని