పడగొట్టలేక.. ఫలితం తేలక

ఆస్ట్రేలియా- ఎ జట్టుతో రెండో వార్మప్‌ మ్యాచ్‌నూ భారత్‌ డ్రాగా ముగించింది. గులాబి బంతితో జరిగిన ఈ మూడు రోజుల డేనైట్‌ సన్నాహక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన భారత బౌలర్లు..

Updated : 14 Dec 2020 07:26 IST

భారత్‌తో వార్మప్‌ మ్యాచ్‌ డ్రా
 
మెక్‌డెర్మట్‌, విల్డర్‌ముత్‌ శతకాలు
 రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా-ఎ 307/4

సిడ్నీ

ఆస్ట్రేలియా- ఎ జట్టుతో రెండో వార్మప్‌ మ్యాచ్‌నూ భారత్‌ డ్రాగా ముగించింది. గులాబి బంతితో జరిగిన ఈ మూడు రోజుల డేనైట్‌ సన్నాహక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జోరు ప్రదర్శించలేపోయారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి ఆటగాళ్లు మెక్‌డెర్మట్‌, విల్డర్‌ముత్‌ శతకాలు సాధించి భారత్‌కు విజయాన్ని దూరం చేశారు. మొత్తానికి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి ప్రాక్టీస్‌తో ఈ మ్యాచ్‌ను ముగించిన భారత్‌.. గురువారం ఆరంభమయ్యే తొలి టెస్టు (అడిలైడ్‌లో డేనైట్‌)కు సానుకూల దృక్పథంతో సిద్ధం కానుంది.
ఆస్ట్రేలియా-ఎ జట్టుతో రెండో వార్మప్‌ మ్యాచ్‌ను భారత్‌ డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 386/4 వద్ద భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో.. 473 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా- ఎ మూడో రోజు బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టులో బెన్‌ మెక్‌డెర్మట్‌ (107 నాటౌట్‌; 167 బంతుల్లో 16×4), జాక్‌ విల్డర్‌ముత్‌ (111 నాటౌట్‌; 119 బంతుల్లో 12×4, 3×6) అజేయ శతకాలతో సత్తాచాటడంతో 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులతో ఆ జట్టు ఆటను ముగించింది. కెప్టెన్‌ అలెక్స్‌ కేరీ (58; 111 బంతుల్లో 7×4) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో షమి (2/58) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆ ఇద్దరూ..: భారీ ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా- ఎ జట్టును ఆరంభంలో షమి దెబ్బకొట్టాడు. కొత్త బంతితో చెలరేగిన అతను.. పక్కా వ్యూహంతో ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో ఓపెనర్‌ హారిస్‌ (5)ను వలలో వేసుకున్నాడు. లెగ్‌స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టి ఆ దిశగా బ్యాట్స్‌మన్‌ ఆడేలా బంతులేశాడు. ఆ ప్రణాళిక ఫలించి షా పట్టిన క్యాచ్‌కు హారిస్‌ నిష్క్రమించాడు. ఆ కొద్దిసేపటికే ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న మరో ఓపెనర్‌ బర్న్స్‌ (1)ను షమి ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్‌ (1/54) తన తొలి బంతికే మాడిసన్‌ (14)ను వెనక్కుపంపాడు. దీంతో ఆ జట్టు 25/3తో కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. కానీ బౌలర్లు పట్టు విడవడంతో కేరీ, మెక్‌డెర్మాట్‌ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. షార్ట్‌పిచ్‌ బంతులను జాగ్రత్తగా కాచుకుంటూ ఒక్కో పరుగు జోడిస్తూ వెళ్లారు. దీంతో ఆ జట్టు 89/3తో టీ విరామానికి వెళ్లింది. బంతి పాతబడడంతో పాటు మృదువుగా మారడంతో రెండో సెషన్‌లో ఈ జోడీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. బుమ్రా ఓవర్లో చెరో రెండు ఫోర్లు బాదిన కేరీ, మెక్‌డెర్మాట్‌ ఇన్నింగ్స్‌ వేగాన్ని పెంచారు. అదే క్రమంలో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారడంతో పేసర్లు ప్రభావం చూపకపోవడంతో స్పిన్‌ వేసేందుకు విహారి (1/14)కి బంతి అందించడం ఫలితాన్నిచ్చింది. తన రెండో ఓవర్లో కేరీని ఔట్‌ చేసిన అతను.. జట్టును తిరిగి పోటీలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మెక్‌డెర్మట్‌కు జత కలిసిన విల్డర్‌ముత్‌ భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన అతను కుదురుకున్నాక వన్డే తరహాలో బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఆ జట్టు డిన్నర్‌ సమయానికి 200/4తో నిలిచింది. మూడో సెషన్‌లో ఈ జోడీ మరింత సులభంగా పరుగులు రాబట్టింది. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా క్యాచ్‌ వదిలేయడంతో బ్యాటింగ్‌ కొనసాగించిన విల్డర్‌ముత్‌ మరింత వేగంగా ఆడాడు. సిక్సర్‌తో అర్ధశతకాన్ని చేరుకున్న అతను.. చూస్తుండగానే శతకానికి చేరువయ్యాడు. మెక్‌డెర్మట్‌ 161 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. ఆ వెంటనే 109 బంతుల్లో విల్డర్‌ముత్‌ కూడా మూడంకెల స్కోరు చేరుకున్నాడు. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 15 ఓవర్ల ముందుగానే రెండు జట్లు డ్రాకు అంగీకరించాయి. విల్డర్‌ముత్‌, మెక్‌డెర్మట్‌ అయిదో వికెట్‌కు అజేయంగా 165 పరుగులు జోడించారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 194 ఆలౌట్‌; ఆస్ట్రేలియా- ఎ తొలి ఇన్నింగ్స్‌: 108 ఆలౌట్‌; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 386/4 డిక్లేర్డ్‌; ఆస్ట్రేలియా- ఎ రెండో ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) షా (బి) షమి 5; బర్న్స్‌ ఎల్బీ (బి) షమి 1; మాడిసన్‌ (సి) సైని (బి) సిరాజ్‌ 14; మెక్‌డెర్మట్‌ నాటౌట్‌ 107; కేరీ (సి) కార్తీక్‌ త్యాగి (బి) విహారి 58; విల్డర్‌ముత్‌ నాటౌట్‌ 111; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (75 ఓవర్లలో 4 వికెట్లకు) 307; వికెట్ల పతనం: 1-6, 2-11, 3-25, 4-142;   బౌలింగ్‌: షమి 13-3-58-2; బుమ్రా 13-7-35-0; సిరాజ్‌ 17-3-54-1; సైని 16-0-87-0; విహారి 7-1-14-1; మయాంక్‌ 6-0-30-0; పృథ్వీ 3-0-26-0

ఇవీ చదవండి..

నా ఆటపై నమ్మకం పెరిగింది

పంత్‌-సాహా స్థానంపై నిర్ణయం తలనొప్పే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని