10 జట్లతో 2022 ఐపీఎల్‌

ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల రాకకు ఆమోదముద్ర పడింది. గురువారం సౌరభ్‌ గంగూలీ అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో రెండు కొత్త ప్రాంచైజీల ఎంపికకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఫలితంగా 2022 నుంచి మొత్తం 10 జట్లతో ఐపీఎల్‌ జరుగనుంది. సమయం తక్కువగా ఉండటంతో 10 జట్లతో 2021 ఐపీఎల్‌ నిర్వహించడం ...

Updated : 25 Dec 2020 07:52 IST

రెండు కొత్త ఫ్రాంచైజీలకు ఆమోదం
బీసీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయాలు
ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు సూత్రప్రాయ అంగీకారం
అహ్మదాబాద్‌

పీఎల్‌లో రెండు కొత్త జట్ల రాకకు ఆమోదముద్ర పడింది. గురువారం సౌరభ్‌ గంగూలీ అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో రెండు కొత్త ప్రాంచైజీల ఎంపికకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఫలితంగా 2022 నుంచి మొత్తం 10 జట్లతో ఐపీఎల్‌ జరుగనుంది. సమయం తక్కువగా ఉండటంతో 10 జట్లతో 2021 ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యంకాదని ఏజీఎం అభిప్రాయపడింది. 9 జట్ల ప్రతిపాదన కూడా ఆచరణ సాధ్యంకాదని తేల్చింది. టెండర్ల ప్రక్రియ.. వేలం పాటను దృష్టిలో ఉంచుకుని 2022 ఐపీఎల్‌ నుంచి కొత్త జట్లను ఆడించాలని బోర్డు నిర్ణయించింది. కొత్త జట్ల కోసం ఏప్రిల్‌లో టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయి. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి మద్దతివ్వాలని బీసీసీఐ తీర్మానించడం ఏజీఎంలో మరో కీలక పరిణామం. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌ క్రికెట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనకు బీసీసీఐ మద్దతు పలికింది. ‘‘బీసీసీఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆ హోదా కొనసాగాలనే కోరుకుంటుంది. మా న్యాయ విభాగం ఐసీసీని కొన్ని వివరణలు అడిగింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం గొప్ప పరిణామమే’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు.
దేశవాళీ క్రికెటర్లకు పరిహారం: కరోనా మహమ్మారి కారణంగా దేశవాళీ క్రికెట్‌ ఆగిపోయిన నేపథ్యంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల (పురుషులు, మహిళలు)కు నష్టపరిహారం చెల్లించాలని బీసీసీఐ తీర్మానించింది. వచ్చే ఏడాది ఐపీఎల్‌-14 సమయంలోనే అండర్‌-16, అండర్‌-19, అండర్‌-23.. మహిళల (సీనియర్‌, జూనియర్‌)కు టోర్నీలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా: మహిమ్‌ వర్మ రాజీనామాతో ఖాళీ అయిన ఉపాధ్యక్షుడి పదవికి రాజీవ్‌ శుక్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఐసీసీ బోర్డులో గంగూలీ డైరెక్టర్‌గా కొనసాగాలని బోర్డు తీర్మానించింది. కార్యదర్శి జై షా ప్రత్నామ్నాయ డైరెక్టర్‌గా ఉంటాడు. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాల్లో జై షా బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తాడు. బీసీసీఐ సహాయక జనరల్‌ మేనేజర్‌ పదవికి రాజీనామా చేయాలంటూ కేవీపీ రావును ఆదేశించిన బోర్డు అతడిపై వేటువేసింది. సహాయక జీఎం బాధ్యతల నుంచి కేవీపీ రావును తొలగించింది. ఇక అంపైర్లు, స్కోరర్ల రిటైర్మెంట్‌ వయసును బోర్డు 55 నుంచి 60 ఏళ్లకు పెంచింది. గంగూలీ  పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ఏజీఎంలో చర్చకు రాలేదు.

రూ.900 కోట్లు నష్టం!

సీసీ కోరిన విధంగా కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చినా.. ఇవ్వకపోయినా 2021 టీ20 ప్రపంచకప్‌ భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ ఏజీఎం స్పష్టంచేసింది. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోతే ఆ నష్టాన్ని (రూ.900 కోట్లు) భరించాలని తీర్మానించింది. ఐసీసీ వార్షిక ఆదాయం (రూ.2855 కోట్లు) నుంచి ఆ మొత్తాన్ని మినహాయించాలని సూచించింది.    ‘‘పన్ను రాయితీ కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఐసీసీకి తెలియజేశాం. సుమారు రూ.900 కోట్ల పన్ను మినహాయింపు లభించకపోతే వార్షిక ఆదాయం నుంచి ఆ మొత్తాన్ని మినహాయించుకోవాలని చెప్పాం. అప్పుడు బోర్డుకు రూ.1955 కోట్లు ఆదాయం వస్తుంది. 2021 టీ20 ప్రపంచకప్‌ మాత్రం భారత్‌లోనే జరుగుతుంది’’ అని బోర్డు అధికారి వివరించాడు.

ఇవీ చదవండి..

దుమారం రేపిన సన్నీ!

భారత్‌కు బాక్సింగ్‌ పరీక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని