Updated : 05/01/2021 02:25 IST

గబ్బాపై అభ్యంతరమా.. అదేం లేదే!

షెడ్యూల్‌ ప్రకారమే నాలుగో టెస్టు: సీఏ
బీసీసీఐ నుంచి విజ్ఞప్తేమీ రాలేదని స్పష్టీకరణ
నిబంధనలు అంగీకారమేనన్న భారత జట్టు!

సిడ్నీ

సిడ్నీలో మూడో టెస్టు తర్వాత చివరి మ్యాచ్‌ కోసం బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు టీమ్‌ఇండియా సుముఖంగా లేదని.. నాలుగో టెస్టును కూడా సిడ్నీలోనే ఆడాలనుకుంటోందని.. ఇలా కుదరదంటే సిరీస్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించిందని రెండు రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. ఆస్ట్రేలియా మీడియాఈ తరహాలో కథనాలు ప్రచురించింది కూడా. కానీ వాస్తవంగా భారత్‌ నుంచి ఇలాంటి అభ్యంతరాలేమీ తమ దృష్టికి రాలేదంటోంది క్రికెట్‌ ఆస్ట్రేలియా. సిడ్నీలోనే కాక బ్రిస్బేన్‌లోనూ నిబంధనలకు కట్టుబడి వ్యవహరించడానికి టీమ్‌ఇండియా నిరాకరించే అవకాశమే లేదన్నది జట్టు వర్గాల మాట.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు వేదికగా ఉన్న సిడ్నీలోనే నాలుగో టెస్టు ఆడతామని, గబ్బా మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ కోసం బ్రిస్బేన్‌కు వెళ్లమని టీమ్‌ఇండియా మొండికేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. బ్రిస్బేన్‌లో కరోనా నిబంధనలు అత్యంత కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో భారత జట్టు అక్కడ మ్యాచ్‌ ఆడేందుకు సుముఖంగా లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వేదిక మార్పు కోసం బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తులూ రాలేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. ‘‘మేం బీసీసీఐతో రోజూ మాట్లాడుతున్నాం. భారత్‌, ఆస్ట్రేలియా జట్లు రెండూ షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాయి. దానికి భిన్నంగా బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక విజ్ఞప్తీ రాలేదు’’ అని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్‌ హాక్లీ స్పష్టం చేశాడు. మరోవైపు భారత జట్టు వర్గాల సమాచారం ప్రకారం కొవిడ్‌ నిబంధనలను పాటించే విషయంలో టీమ్‌ఇండియాకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిసింది. సీఏ తమకు అందించిన విధివిధానాల సూచీ ప్రకారమే ఆటగాళ్లు నడుచుకుంటున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. సిడ్నీ టెస్టు ముగిశాక, బ్రిస్బేన్‌లో చివరి టెస్టుకు ముందు నాలుగు రోజుల విరామమే ఉందని.. ఆ తర్వాత మ్యాచ్‌ ఆడగానే స్వదేశానికి బయల్దేరవచ్చని.. దుబాయ్‌లో నెలన్నర పాటు కఠిన బయో బబుల్‌ నిబంధనల మధ్య ఐపీఎల్‌ ఆడిన ఆటగాళ్లకు అటు ఇటుగా వారం రోజులు బ్రిస్బేన్‌లో నిబంధనలు పాటిస్తూ మ్యాచ్‌ ఆడటంపై అభ్యంతరాలు ఏముంటాయన్న ప్రశ్నలు జట్టు నుంచి వస్తున్నాయి. ‘‘భారత జట్టుకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉంది. జట్టు యాజమాన్యం వాటికి అంగీకరించింది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. ప్రాక్టీస్‌కు మినహాయిస్తే దేనికీ హోటల్‌ దాటి బయటికి వెళ్లట్లేదు. సాధనలోనూ ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తున్నారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బ్రిస్బేన్‌లో కఠిన క్వారంటైన్‌ నిబంధనల విషయంలోనూ భారత జట్టుకు పెద్దగా అభ్యంతరాలేమీ లేవని ఆ అధికారి చెప్పారు. అయితే అక్కడ పూర్తిగా హోటల్‌ గదులకే పరిమితం కావాలన్న షరతులో కొంత మినహాయింపు అడిగారని, హోటల్‌ ఫ్లోర్లలోనూ తిరిగే అవకాశం కల్పించాలని కోరారని.. అంతకుమించి బ్రిస్బేన్‌లో చివరి టెస్టు ఆడే విషయంలో జట్టు నుంచి ఏ అభ్యంతరాలూ లేవని ఆ అధికారి స్పష్టం చేశారు. కాగా భారత ఆటగాళ్లు నిబంధనలు పాటించలేకపోతే బ్రిస్బేన్‌కు రావాల్సిన అవసరం లేదని క్వీన్స్‌ ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి చేసిన వ్యాఖ్యలపై మాత్రం బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

భారత బృందంలో అందరికీ నెగెటివ్‌

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముంగిట భారత జట్టు సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌ వచ్చింది. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన నెలకొనగా.. ఇటీవల రోహిత్‌ శర్మతో ఇంకో నలుగురు ఆటగాళ్లు బయో బబుల్‌ నిబంధనల్ని అతిక్రమించి బయట రెస్టారెంటుకు వెళ్లి భోంచేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల ముంగిట కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఎవరికీ కరోనా సోకలేదని ఈ నెల 3న నిర్వహించిన పరీక్షల్లో తేలడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది.

సిడ్నీ టెస్టుకు 25 శాతమే

భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు ముందు అనుకున్నట్లు 50 శాతం కాకుండా, 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. సిడ్నీలో ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిడ్నీ మైదానం సామర్థ్యం 38 వేలు కాగా.. గురువారం ఆరంభమయ్యే మ్యాచ్‌కు 9500 మందినే అనుమతించనున్నారు. ఇప్పటికే అమ్ముడైన టికెట్లన్నింటినీ రద్దు చేసి, స్టేడియంలో సీటింగ్‌ ఏర్పాటును మార్చి మళ్లీ కొత్తగా టికెట్లు అమ్మనున్నారు. టెస్టు సిరీస్‌కు ముందు సిడ్నీ రెండు వన్డేలు, ఒక టీ20కి ఆతిథ్యమిచ్చింది. మొదట వన్డేలకు 18 వేల మందిని, తర్వాత టీ20కి 30 వేల మందిని స్టేడియంలోకి  అనుమతించిన సీఏ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మూడో టెస్టుకు స్టేడియం  సామర్థ్యాన్ని 9500కు పరిమితం చేసింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని