Updated : 06/01/2021 02:34 IST

ఇదే మంచి తరుణం

జోరు మీద టీమ్‌ఇండియా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రేపటి నుంచే
మయాంక్‌ స్థానంలో రోహిత్‌!
మ్యాచ్‌ ప్రసారం ఉదయం 5 నుంచి
సిడ్నీ

ఓటమి తర్వాత పుంజుకోవడం ఎంత ముఖ్యమో విజయం తర్వాత అప్రమత్తంగా ఉండటం అంతే ముఖ్యం. అడిలైడ్‌ షాక్‌ తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంటే.. కోహ్లి లేని భారత జట్టును తక్కువగా అంచనా వేసి బోల్తా కొట్టింది ఆసీస్‌. ఇప్పుడు ఇరు జట్లూ సమాన స్థితిలో ఉన్నాయి. తొలి టెస్టు తర్వాత ఆసీస్‌లా విజయాన్ని తలకెక్కించుకోకుండా తీవ్రత కొనసాగిస్తూ ఆతిథ్య జట్టును మరో దెబ్బ కొట్టి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లడం టీమ్‌ఇండియా ముందున్న కర్తవ్యం. ఆస్ట్రేలియాలో భారత్‌కు కొంచెం అనుకూలంగా ఉండే వేదికైన సిడ్నీలో ఈ మ్యాచ్‌ జరగబోతుండటం కలిసొచ్చే అంశం. చివరి టెస్టు పేసర్ల స్వర్గధామం గబ్బాలో కాబట్టి కంగారూలకు సిడ్నీలో అవకాశమిస్తే సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సింది. మరి జోరుమీదున్న రహానే సేన మూడో టెస్టులో ఏం చేస్తుందో?

స్ట్రేలియా పర్యటనలో మరో కీలక సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మొదట తడబడి తర్వాత పుంజుకున్నట్లే, టెస్టు సిరీస్‌లోనూ ఆరంభ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసి, రెండో టెస్టులో ఆతిథ్య జట్టును దెబ్బకు దెబ్బ తీసిన టీమ్‌ఇండియా.. గురువారం సిడ్నీలో మూడో టెస్టును ఆరంభించనుంది. తొలి టెస్టు పరాభవానికి తోడు కోహ్లి, షమి లాంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ ప్రభావం ఏమాత్రం లేకుండా.. రహానే సేన స్ఫూర్తిమంతమైన ఆటతో ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై మట్టి కరిపించిన తీరు ప్రశంసనీయం. మెల్‌బోర్న్‌లో మాదిరే సమష్టిగా సత్తా చాటితే.. ఆసీస్‌ను మరోసారి ఓడించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లడం కష్టమేమీ కాదు.

అతనొస్తున్నాడు..

మెల్‌బోర్న్‌ పరాభవం తర్వాత ఆస్ట్రేలియా పుంజుకునేందుకు బలంగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఆ జట్టు సిడ్నీలో కసిగా ఆడుతుందని, జాగ్రత్తగా ఉండాలని మాజీలు టీమ్‌ఇండియాను హెచ్చరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఆడబోతుండటం భారత్‌కు హెచ్చరికే. ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించనప్పటికీ.. అతణ్ని బరిలోకి దించుతున్నారు. భారత్‌పై వార్నర్‌ రికార్డు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని నెలల నుంచి అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. బర్న్స్‌ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. వేడ్‌ను పక్కన పెట్టి యువ ఓపెనర్‌ పకోస్కీని ఆడించే అవకాశాలు కూడా లేకపోలేదు. తొలి రెండు టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపని గ్రీన్‌ స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌ను ఎంచుకోవడంపై ఆసీస్‌ ఆలోచిస్తుండొచ్చు. అయితే సిడ్నీ టెస్టులో అందరి దృష్టీ నిలవబోయేది స్టీవ్‌ స్మిత్‌ మీదే. ఎన్నో అంచనాల మధ్య సిరీస్‌లో అడుగు పెట్టిన అతను.. తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. టీమ్‌ఇండియాకు పెను సవాలు విసురుతాడనుకుంటే.. భారత బౌలర్ల బుట్టలో సులువుగా పడిపోయాడు. సిడ్నీలో తన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడకుంటే తీవ్ర విమర్శలు తప్పవు. అతడి కోసం ఈసారి భారత బౌలర్లు ఎలాంటి ప్రణాళికలతో వస్తారో చూడాలి. భారీ ఇన్నింగ్స్‌ ఆడకున్నా లబుషేన్‌ మంచి లయలోనే ఉన్న సంగతి మరిచిపోరాదు. ఇక పేస్‌ త్రయం స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌కు ఎప్పుడూ ముప్పే. కొత్త బంతితో అత్యంత ప్రభావం చూపే వీరిని.. కొన్ని గంటలు నిలువరిస్తే తర్వాత బ్యాటింగ్‌ తేలికవుతుంది. మెల్‌బోర్న్‌లో అమలు చేసిన ఈ పద్ధతినే సిడ్నీలోనూ భారత్‌ కొనసాగించాల్సిన అవసరముంది.

అందరి చూపూ రోహిత్‌ మీదే

మూడో టెస్టు ముంగిట అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది రోహిత్‌ శర్మనే. పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం అతడి స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. మిడిలార్డర్లో నిలకడ అందుకోలేకపోయిన అతణ్ని 2019లో దక్షిణాఫ్రికాపై ఓపెనర్‌గా పంపితే అదరగొట్టాడు. కానీ ఆ సిరీస్‌ ఆడింది సొంతగడ్డపై. విదేశీ ఫాస్ట్‌ పిచ్‌లపై అతనింకా నిరూపించుకోని నేపథ్యంలో ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే ప్రదర్శనను కొనసాగించడగలడా అన్నది ప్రశ్న. పైగా అతను సిరీస్‌లోకి చిత్రమైన పరిస్థితుల్లో అడుగు పెడుతున్నాడు. ఐపీఎల్‌లో గాయపడ్డాక అతడి ఫిట్‌నెస్‌పై ఎడతెగని చర్చ జరిగింది. జట్టుతో ఉండకుండా స్వదేశానికి వెళ్లడం వల్ల క్వారంటైన్‌ ఆలస్యమై మూడో టెస్టుకు కానీ జట్టులోకి రాలేకపోయాడు. ఇప్పుడు కోహ్లి జట్టులో లేని సమయంలో మూడో టెస్టులో బరిలోకి దిగుతున్న అతడిపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. కానీ చాలా రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రోహిత్‌.. ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని కాచుకుని జట్టుకు శుభారంభాలివ్వగలడా అన్నది ప్రశ్న. మరో ఓపెనర్‌ గిల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న నేపథ్యంలో ఈసారి అతడి నుంచి జట్టు పెద్ద స్కోరు ఆశిస్తోంది. పుజారా ఈ మ్యాచ్‌లో అయినా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడతాడేమో చూడాలి. గత మ్యాచ్‌లో కెప్టెన్‌గానే కాక, బ్యాట్స్‌మన్‌గానూ అదరగొట్టిన రహానెపై భారీ అంచనాలే ఉన్నాయి. విహారిని ఆడిస్తే ఇది చివరి అవకాశంగా భావించవచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే వేటు తప్పదు కాబట్టి అతను సత్తా చాటాల్సిందే. పంత్‌ బ్యాట్స్‌మన్‌గానే కాక వికెట్‌ కీపర్‌గానూ తన ముద్ర వేయాల్సి ఉంది. సిరీస్‌లో అంచనాల్లేకుండా అడుగు పెట్టి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా మారిన అశ్విన్‌ నుంచి మరోసారి మంచి ప్రదర్శన ఆశిస్తోంది జట్టు. జడేజా మీదా ఇలాంటి ఆశలే ఉన్నాయి. వీళ్లిద్దరూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేస్తే జట్టుకు ఎంతో ఉపకరిస్తుంది. ఉమేశ్‌ కూడా దూరమవడం బుమ్రాపై బాధ్యతను మరింత పెంచేదే. అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న సిరాజ్‌.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. మెల్‌బోర్న్‌లో ఫీల్డింగ్‌లోనూ మెరిసిన టీమ్‌ఇండియా.. సిడ్నీలోనూ అదే తీవ్రతను కొనసాగించాల్సి ఉంది.

ఉమేశ్‌ స్థానంలో ఎవరు?

తొలి టెస్టు తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఒకేసారి తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది టీమ్‌ఇండియా. మూడో టెస్టుకు తుది జట్టులో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. రోహిత్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేసిన మయాంక్‌పై వేటు పడబోతున్నట్లే. రోహిత్‌.. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. మెల్‌బోర్న్‌లో గాయపడి సిరీస్‌కు దూరమైన ఉమేశ్‌ స్థానంలో ఎవరు తుది జట్టులోకి వస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సైని, శార్దూల్‌, నటరాజన్‌.. ఇలా మూడు ప్రత్యామ్నాలున్నాయి. వేగమే ప్రధానమనుకుంటే దేశంలోనే ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా పేరున్న సైనిని ఎంచుకోవచ్చు. అనుభవమే ముఖ్యమనుకుంటే అందరిలోకి ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన శార్దూల్‌ను ఎంపిక చేయొచ్చు. ఎడమ చేతి వాటం బౌలరైతే వైవిధ్యం ఉంటుందనుకుంటే నటరాజన్‌ వైపు చూడొచ్చు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అతను చక్కటి ప్రదర్శన కూడా చేశాడు. ఈ ముగ్గురిలో కెప్టెన్‌ రహానె, కోచ్‌ రవిశాస్త్రి ఎవరికి ఓటేస్తారో?

మాతో గత, ప్రస్తుత సిరీస్‌ల్లో భారత జట్టు గొప్ప క్రమశిక్షణతో ఆడింది. ఇదే వారికి అతి పెద్ద బలమైంది. రెండు జట్ల మధ్య చివరి రెండు టెస్టులు సాగిన తీరు నాకెంతో నచ్చింది. బంతికి, బ్యాటుకు మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టెస్టు క్రికెట్‌ ఇలాగే ఉండాలి. ఈ మ్యాచ్‌ల్లో పిచ్‌లు చక్కగా స్పందించాయి. బంతి రెండు వైపులా స్వింగ్‌ అయింది. అయితే మా బ్యాట్స్‌మెన్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌ ఏర్పాట్లు చేసి వారిని తెలివిగా ఔట్‌ చేశారు. మేం భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి. గత వారం రోజుల్లో దీనిపై గట్టిగా  పని చేశాం. వార్నర్‌ గాయం నుంచి కోలుకుని వస్తున్నాడు. మా జట్టులో అపారమైన బ్యాటింగ్‌ ప్రతిభ ఉంది. అవకాశాల్ని ఎవరెలా ఉపయోగించుకుంటారన్నది ముఖ్యం.

- లాంగర్‌, ఆస్ట్రేలియా కోచ్‌


సవాళ్లకు సిద్ధం

నూహ్యంగా వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్న నటరాజన్‌ ఇప్పుడు టెస్టులకు సిద్ధమవుతున్నాడు. ఉమేశ్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన అతడు తెల్ల దుస్తుల్లో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘‘తెల్ల జెర్సీ ధరించినందుకు గర్వంగా ఉంది. రాబోయే సవాళ్లకు సిద్ధం’’ అని అంటూ ట్వీట్‌ చేశాడు.


గెలిచింది ఒక్కటే కానీ..

సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో 12 టెస్టులాడిన భారత్‌.. ఒక మ్యాచ్‌లో గెలిచి, అయిదు ఓడింది. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. సాధించింది ఒక్క విజయమే కదా అనిపించొచ్చు కానీ.. ఇదే వేదికలో ఆరు మ్యాచ్‌లను భారత్‌ డ్రా చేయగలగడం కూడా సానుకూల విషయమే. ఈ వేదికలో భారత బ్యాట్స్‌మెన్‌ మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడారు. 2000లో లక్ష్మణ్‌ 167 పరుగుల కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌కు వేదికైంది ఈ మైదానమే. సచిన్‌ తన కెరీర్లోనే అత్యధికంగా 242 పరుగులు చేసింది సిడ్నీలోనే. 2004లో జరిగిన ఆ మ్యాచ్‌లోనే లక్ష్మణ్‌ 178 పరుగులు చేశాడు. ఈ టెస్టులో భారత్‌ ఏకంగా 705 (7 వికెట్లకు) పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని