కుర్రాడు.. అడ్డుపడ్డాడు

తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ ఓపెనర్లను త్వరగానే పెవిలియన్‌ చేర్చిన భారత్‌.. ఆ జట్టుకు శుభారంభం దక్కకుండా చేసింది. ఆ తర్వాత అదే ఒత్తిడి కొనసాగించి ప్రత్యర్థిని కట్టడి చేసింది. మూడో టెస్టు తొలి

Published : 08 Jan 2021 01:31 IST

తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ ఓపెనర్లను త్వరగానే పెవిలియన్‌ చేర్చిన భారత్‌.. ఆ జట్టుకు శుభారంభం దక్కకుండా చేసింది. ఆ తర్వాత అదే ఒత్తిడి కొనసాగించి ప్రత్యర్థిని కట్టడి చేసింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ వార్నర్‌ను త్వరగానే ఔట్‌ చేసిన భారత్‌.. మరోసారి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తుందనిపించింది. కానీ మరో ఓపెనర్‌, అరంగేట్ర కుర్రాడు విల్‌ పకోస్కీ జట్టుకు అడ్డుపడ్డాడు. ఆడుతుంది తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా, పరిణతి కూడిన ఆటతో భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. లబుషేన్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యంతో భారత్‌కు పట్టుబిగించే అవకాశమివ్వలేదు. టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌కు కంగారూ జట్టును ప్రకటించినప్పటి నుంచే అందరి దృష్టి ఈ 22 ఏళ్ల ఓపెనర్‌పై పడింది. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడి తొలిసారి ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన అతను.. స్మిత్‌, లబుషేన్‌ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో సమానంగా చర్చల్లో నిలిచాడు. అందరూ అతని బ్యాటింగ్‌ సామర్థ్యం గురించే మాట్లాడారు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేస్తాడని, వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగుతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికా అవకాశం మూడో టెస్టులో కానీ రాలేదు. భారత్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అతను కంకషన్‌ బారిన పడడమే అందుకు కారణం. దాని నుంచి కోలుకుని, ఈ మ్యాచ్‌తో ఆసీస్‌ క్యాప్‌ అందుకున్న అతను.. తనపై పెట్టుకున్న అంచనాలు తప్పు కాదని నిరూపించాడు. చక్కటి ఫుట్‌వర్క్‌తో బుమ్రా, సిరాజ్‌లను సమర్థంగా ఎదుర్కొన్న అతను.. అశ్విన్‌ కూడా బాగానే కాచుకున్నాడు. మధ్యలో పంత్‌ రెండు క్యాచ్‌లు వదిలేయడంతో బ్యాటింగ్‌ కొనసాగించి.. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా అర్ధసెంచరీ అందుకుని భారత్‌కు అడ్డుగా నిలిచాడు. 62 పరుగుల వద్ద సైని బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరినప్పటికీ.. అప్పటికే నష్టం చేసి వెళ్లాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని