పంత్‌.. అదే వరస

బ్యాటింగ్‌ పిచ్‌పై బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చేజారిన క్యాచ్‌లు సిడ్నీ టెస్టులో భారత్‌ను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయి. తొలి టెస్టులో ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేసి మూల్యం

Updated : 08 Jan 2021 05:48 IST

బ్యాటింగ్‌ పిచ్‌పై బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చేజారిన క్యాచ్‌లు సిడ్నీ టెస్టులో భారత్‌ను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయి. తొలి టెస్టులో ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్న టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో ఆ సమస్య అధిగమించి మంచి ఫలితాన్ని రాబట్టింది. అయితే మూడో టెస్టులో మరోసారి ఫీల్డింగ్‌ పొరపాట్లు భారత జట్టును దెబ్బతీశాయి. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌. గ్లోవ్స్‌తో అతడి తడబాటు కొనసాగుతూనే ఉంది. అతడు సరిగా కీపింగ్‌ చేసి ఉంటే తొలి రోజు టీమ్‌ ఇండియా పరిస్థితి భిన్నంగా ఉండేదే! అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ పకోస్కీ ఇచ్చిన క్యాచ్‌లను పంత్‌ రెండు సార్లు వదిలేశాడు. మొదట 22వ ఓవర్లో అతడు పకోస్కీకి జీవనదానమిచ్చాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో పకోస్కీ డ్రైవ్‌ చేయబోగా బంతి ఎడ్జ్‌ తీసుకోని నేరుగా పంత్‌ చేతుల్లోకి వెళ్లింది. కానీ లడ్డూ లాంటి క్యాచ్‌ను అతడు ఒడిసి పట్టలేకపోయాడు. అప్పటికి పకోస్కీ స్కోరు 26 మాత్రమే. పకోస్కీ మరో ఆరు పరుగులు జోడించాక మరోసారి ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఈసారీ దాత పంతే. బౌలర్‌ సిరాజ్‌. షార్ట్‌ బంతిని పకోస్కీ పుల్‌ షాట్‌ ఆడబోగా.. అది అతడి గ్లోవ్స్‌ను తాకుతూ పంత్‌ వెనక్కి వెళ్లింది. వెనక్కి వెళుతూ డైవ్‌ చేసిన పంత్‌ బంతిని తాకినా ఒడిసి పట్టలేకపోయాడు. బంతి కిందపడుతుండగా మరోసారి అందుకునే ప్రయత్నం చేశాడు. దాదాపు అందినట్లే అనిపించింది. కానీ అతడు పట్టేలోపు బంతి నేలను తాకినట్లు రీప్లేల్లో తేలడంతో పకోస్కీ బతికిపోయాడు. అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవడంతో ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో నిలిపింది. లబుషేన్‌తో రెండో వికెట్‌కు పకోస్కీ ఎంతో విలువైన 100 పరుగులు జోడించాడు. మరో ఓపెనర్‌ వార్నర్‌ త్వరగా ఔటైన నేపథ్యంలో పకోస్కీ ఇచ్చిన అవకాశాలను పంత్‌ వృథా చేయకపోయి ఉంటే ఆసీస్‌ ఒత్తిడిలో పడేదే.

‘‘టెస్టుల్లో అరంగేట్రం తర్వాత రిషబ్‌ పంత్‌ వదిలేసినన్ని క్యాచ్‌లను ప్రపంచంలో మరే వికెట్‌కీపర్‌  చేజార్చివుండడు. వికెట్‌ కీపింగ్‌లో పంత్‌ ఎంతో మెరుగవ్వాల్సి ఉందనడానికి అదో హెచ్చరిక. సిడ్నీ టెస్టు తొలి రోజు సులువైన రెండు క్యాచ్‌లు అతడు వదిలేశాడు’’  

- రికీ పాంటింగ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని