వారెవా మేయర్స్‌

లక్ష్యం 395. ఏ జట్టుకైనా చాలా చాలా కష్టమే. పైగా ఛేదించాల్సింది వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన, అనుభవజ్ఞులు లేని వెస్టిండీస్‌. ఆ జట్టు గెలుపు సాధ్యమని ఒక్కరైనా ఊహించి ఉండరు. కానీ కరీబియన్‌ జట్టు అద్భుతమే చేసింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌

Published : 08 Feb 2021 01:16 IST

అరంగేట్రంలోనే అద్భుత ద్విశతకం
 తొలి టెస్టులో బంగ్లాకు షాక్‌
 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్‌

చట్టోగ్రామ్‌

లక్ష్యం 395. ఏ జట్టుకైనా చాలా చాలా కష్టమే. పైగా ఛేదించాల్సింది వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన, అనుభవజ్ఞులు లేని వెస్టిండీస్‌. ఆ జట్టు గెలుపు సాధ్యమని ఒక్కరైనా ఊహించి ఉండరు. కానీ కరీబియన్‌ జట్టు అద్భుతమే చేసింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ కైల్‌ మేయర్స్‌ అద్వితీయ పోరాటంతో ద్విశతకం చేసిన వేళ తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది అయిదో అత్యధిక లక్ష్య ఛేదన. ఆసియాలో అతి పెద్ద ఛేదన.
అనూహ్య విజయం వెస్టిండీస్‌ సొంతమైంది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న కైల్‌ మేయర్స్‌ డబుల్‌ సెంచరీ (210 నాటౌట్‌; 310 బంతుల్లో 20×4, 7×6) సాధించడంతో ఆ జట్టు తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అద్భుతంగా పోరాడిన విండీస్‌ 395 పరుగుల విజయ లక్ష్యాన్ని చివరి రోజు, ఆదివారం ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 110/3తో ఆ జట్టు ఇన్నింగ్స్‌ కొనసాగించగా.. బంగ్లాదేశ్‌ గెలుస్తుందనే అనుకున్నారంతా. కానీ మరో అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ బానర్‌ (86; 245 బంతుల్లో 10×4, 1×6), జోషువా సిల్వా (20; 59 బంతుల్లో 2×4)ల సహకారంతో పోరాడిన మేయర్స్‌.. విండీస్‌కు చిరస్మరణీయ విజయాన్నిందించాడు. మరో 15 బంతులు మిగిలి ఉండగా.. కరీబియన్‌ జట్టు లక్ష్యాన్ని  అందుకుంది. అరంగేట్ర టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా మేయర్స్‌ ఘనత సాధించాడు. అతడికే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది.

మేయర్స్‌ అదుర్స్‌: చేతిలో 7 వికెట్లు ఉండగా విజయానికి చేయాల్సిన పరుగులు 285. చివరిదైన అయిదో రోజు వెస్టిండీస్‌ పరిస్థితిది. బంగ్లాదేశ్‌కు మంచి స్పిన్నర్లే ఉన్న నేపథ్యంలో ఇది క్లిష్టమైన సమీకరణమే. కానీ అసాధ్యమనుకున్న దాన్ని మేయర్స్‌ సుసాధ్యం చేశాడు. దూకుడుగా ఆడిన అతడికి బానర్‌  మంచి సహకారాన్నిచ్చాడు. ఈ దూకుడు, జాగ్రత్తల వ్యూహం విండీస్‌కు బాగా ఉపయోగపడింది. ఆ జట్టు లక్ష్యం దిశగా సాగింది. టీ సమయానికి స్కోరు 266/3. చివరి సెషన్లో 33 ఓవర్లలో 129 పరుగులు అవసరం కాగా.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో బానర్‌ ఔట్‌ కావడంతో 216 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వెంటనే బ్లాక్‌వుడ్‌ (9)ను నయీమ్‌ హసన్‌ ఔట్‌ చేయడంతో బంగ్లా పట్టుబిగిస్తున్నట్లనిపించింది. అప్పటికి విండీస్‌ స్కోరు 292/5. కానీ ఎదురుదాడిని కొనసాగించిన మేయర్స్‌.. డిసిల్వాతో కలిసి జట్టును విజయపథంలో నడిపించాడు. చివర్లో డిసిల్వా, రోచ్‌ ఒకే స్కోరు (392) వద్ద ఔటైనా.. అప్పటికే విండీస్‌ విజయం ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 430 పరుగులు చేయగా.. విండీస్‌ 259కే ఆలౌటైటంది. రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లా 223/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts