ముప్పు తప్పేనా!

అంతలోనే ఎంత తేడా.. తొలి రెండు రోజులు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చలాయించిన చెపాక్‌ పిచ్‌పై మూడో రోజు భారత ప్రధాన ఆటగాళ్లు నిలవలేకపోయారు. ప్రత్యర్థి జట్టులో ఓ ద్విశతకం నమోదైతే.. మన ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ నమోదవలేదు. టీమ్‌ఇండియా బౌలర్లు వికెట్ల కోసం పడిగాపులు కాసిన అదే మైదానంలో

Updated : 08 Feb 2021 06:16 IST

వెంటాడుతున్న ఫాలోఆన్‌ ఉచ్చు
భారత బ్యాట్స్‌మెన్‌ విఫలం
తొలి ఇన్నింగ్స్‌లో 257/6
 పంత్‌ మెరుపు దాడి
 తిప్పేసిన బెస్‌
 ఇంగ్లాండ్‌ 578
చెన్నై

అంతలోనే ఎంత తేడా.. తొలి రెండు రోజులు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చలాయించిన చెపాక్‌ పిచ్‌పై మూడో రోజు భారత ప్రధాన ఆటగాళ్లు నిలవలేకపోయారు. ప్రత్యర్థి జట్టులో ఓ ద్విశతకం నమోదైతే.. మన ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ నమోదవలేదు. టీమ్‌ఇండియా బౌలర్లు వికెట్ల కోసం పడిగాపులు కాసిన అదే మైదానంలో ఇంగ్లిష్‌ బౌలర్లు అదరగొడుతున్నారు. పిచ్‌లో కొంచెం మార్పు వచ్చిందనేది నిజమే.. కానీ మరీ భయంకరంగా ఏమీ లేదు. అందుకు పంత్‌ ధనాధన్‌ ఇన్నింగ్సే రుజువు. కాస్త కుదరుకుంటే బ్యాటింగ్‌ సులువే అని పుజారా చాటాడు. కానీ క్రమశిక్షణతో కూడిన ప్రత్యర్థి బౌలింగ్‌కు తోడు నిర్లక్ష్యపు షాట్లు ఆడిన భారత బ్యాట్స్‌మెన్‌ జట్టును కష్టాల్లోకి నెట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి స్కోరులో సగమైనా చేయకముందే ఆరు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా.. మరో 122 పరుగులు చేస్తే తప్ప ఫాలోఆన్‌ గండం దాటుతుంది. ఇప్పుడు జట్టు ఆశలన్నీ క్రీజులో ఉన్న సుందర్‌, అశ్విన్‌పైనే ఉన్నాయి.

స్వదేశంలో.. అనుకూల పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ వెనకబడింది. బ్యాట్స్‌మెన్‌ వైల్యంతో ఆదివారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 257/6తో నిలిచింది. ఓ దశలో 73కే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అందుకు పంత్‌ (91; 88 బంతుల్లో 9×4, 5×6), పుజారా (73; 143 బంతుల్లో 11×4)ల పోరాటమే కారణం. సుందర్‌ (33 బ్యాటింగ్‌), అశ్విన్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆర్చర్‌   (2/52) భారత ఓపెనర్లను పెవిలిలియన్‌ చేర్చగా.. బెస్‌ (4/55) కీలకమైన నాలుగు వికెట్లతో దెబ్బతీశాడు. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు భారత్‌ ఇంకా 321 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు   555/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌ 578 పరుగులకు ఆలౌటైంది. బెస్‌ (34)ను బుమ్రా (3/84) ఔట్‌ చేయగా.. అండర్సన్‌ (1)ను బౌల్డ్‌ చేసిన అశ్విన్‌ (3/146) ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
నిరాశ కలిగిస్తూ..: ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ చూశాక.. భారత్‌కు అలవాటైన పిచ్‌పై మనవాళ్లు బ్యాటింగ్‌లో ఇరగదీస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఆ ఆశలు ఆవిరి కావడానికి ఎంతో సేపు పట్టలేదు. కొత్త బంతితో.. కచ్చితమైన లైన్‌, లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసిన ఆర్చర్‌.. ఓపెనర్లు రోహిత్‌ (6), గిల్‌ (29)ను వెనక్కి పంపాడు. నాలుగో ఓవర్లో అధిక బౌన్స్‌ రాబట్టిన అతను.. రోహిత్‌కు బంతిని ఆడక తప్పని పరిస్థితి కల్పించి వికెట్‌ రాబట్టాడు. కానీ మరో ఓపెనర్‌ గిల్‌ ధాటిగానే ఆడుతుండడం.. అతనికి పుజారా తోడవడంతో ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుందనిపించింది. కానీ ఆర్చర్‌ బంతిని సరిగా ఆడడంలో విఫలమైన గిల్‌.. మిడాన్‌లో అండర్సన్‌ పట్టిన చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. పుజారా, కోహ్లి (11) జట్టును 59/2తో లంచ్‌కు తీసుకెళ్లారు. రెండో సెషన్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ బెస్‌.. భారత్‌ను గట్టిదెబ్బ తీశాడు. క్రీజులో ఉన్నంతసేపు అసౌకర్యంగా కదిలిన కోహ్లీని బుట్టలో వేసుకున్నాడు. అతను డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా.. కొంచెం బౌన్స్‌తో పాటు స్పిన్‌ తిరిగిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని షార్ట్‌లెగ్‌లో ఉన్న పోప్‌ చేతిలో పడింది. తన తర్వాతి ఓవర్లోనే షార్ట్‌కవర్‌లో ఒంటిచేత్తో రూట్‌ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో రహానేను అతను ఔట్‌ చేశాడు.
పంత్‌ ధనాధన్‌..: అప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించిన ఇంగ్లాండ్‌కు మంచి ఫామ్‌లో ఉన్న పంత్‌ అడ్డుగా నిలిచాడు. రక్షణాత్మకంగా ఆడితే ఇబ్బందుల్లో పడతానని భావించిన అతను.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఎదురుదాడి చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్‌ లీచ్‌ (0/94)ను లక్ష్యంగా చేసుకుని సిక్సర్లు బాదాడు. పుజారా కూడా జోరు అందుకోవడంతో స్కోరు పరుగులు పెట్టింది. అదే క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో జట్టు 154/4తో టీ విరామానికి వెళ్లింది. మూడో సెషన్‌లోనూ ఈ జోడీ అలవోకగా పరుగులు రాబట్టింది. అయిదో వికెట్‌కు 145 బంతుల్లోనే 119 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ ఈ దశలో దురదృష్టం పుజారాను వెంటాడింది. బెస్‌ బౌలింగ్‌లో అతనాడిన బంతి షార్ట్‌లెగ్‌లో పోప్‌ భుజానికి తాకి షార్ట్‌ మిడాన్‌లో బర్న్స్‌ చేతుల్లో పడింది. అతను ఔటైనా దూకుడు కొనసాగించిన పంత్‌.. సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. కానీ సెంచరీ అందుకోవాలనే తొందర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత సుందర్‌, అశ్విన్‌ కలిసి మరో వికెట్‌ పడకుండా 17.2 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి ఆటను ముగించారు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 33;  సిబ్లీ ఎల్బీ (బి) బుమ్రా 87; లారెన్స్‌ ఎల్బీ (బి) బుమ్రా 0; రూట్‌ ఎల్బీ (బి) నదీమ్‌ 218; స్టోక్స్‌ (సి) పుజారా (బి) నదీమ్‌ 82; పోప్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 34; బట్లర్‌ (బి) ఇషాంత్‌ 30; బెస్‌ ఎల్బీ (బి) బుమ్రా 34; ఆర్చర్‌ (బి) ఇషాంత్‌ 0; లీచ్‌ నాటౌట్‌ 14; అండర్సన్‌ (బి) అశ్విన్‌ 1; ఎక్స్‌ట్రాలు 45; మొత్తం: (190.1 ఓవర్లలో ఆలౌట్‌) 578; వికెట్ల పతనం: 1-63, 2-63, 3-263, 4-387, 5-473, 6-477, 7-525, 8-525, 9-567; బౌలింగ్‌: ఇషాంత్‌ 27-7-52-2; బుమ్రా 36-7-84-3; అశ్విన్‌ 55.1-5-146-3; నదీమ్‌ 44-4-167-2; సుందర్‌ 26-2-98-0; రోహిత్‌ 2-0-7-0
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 6; శుభ్‌మన్‌ గిల్‌ (సి) అండర్సన్‌ (బి) ఆర్చర్‌ 29; పుజారా (సి) బర్న్స్‌ (బి) బెస్‌ 73; కోహ్లి (సి) పోప్‌ (బి) బెస్‌ 11; రహానె (సి) రూట్‌ (బి) బెస్‌ 1; పంత్‌ (సి) లీచ్‌ (బి) బెస్‌ 91; సుందర్‌ బ్యాటింగ్‌ 33; అశ్విన్‌ బ్యాటింగ్‌ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (74 ఓవర్లలో 6 వికెట్లకు) 257;

వికెట్ల పతనం: 1-19, 2-44, 3-71, 4-73, 5-192, 6-225
బౌలింగ్‌: అండర్సన్‌ 11-3-34-0; ఆర్చర్‌ 16-3-52-2; స్టోక్స్‌ 6-1-16-0; లీచ్‌ 17-2-94-0; బెస్‌ 23-5-55-4; రూట్‌ 1-0-1-0

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని