అతిశయమే అచ్చెరువొందే..

స్టేడియానికి వెళ్లి ఒక్క మ్యాచ్‌ అయినా ప్రత్యక్ష ప్రసారంలో చూడాలని  ప్రతి అభిమానికీ ఉంటుంది. ఇక తరచుగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లు చూసే వాళ్లకు ఫలానా మైదానంలో మ్యాచ్‌

Updated : 21 Feb 2021 08:44 IST

ఈనాడు క్రీడావిభాగం

స్టేడియానికి వెళ్లి ఒక్క మ్యాచ్‌ అయినా ప్రత్యక్ష ప్రసారంలో చూడాలని  ప్రతి అభిమానికీ ఉంటుంది. ఇక తరచుగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లు చూసే వాళ్లకు ఫలానా మైదానంలో మ్యాచ్‌ చూడాలనే కలలుంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన లార్డ్స్‌, మెల్‌బోర్న్‌ లాంటి స్టేడియాలు ఇలాగే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులను ఆకర్షిస్తుంటాయి. భారత్‌ విషయానికొస్తే.. ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడె లాంటి స్టేడియాలకు ఉన్న ఖ్యాతే వేరు. ఐకానిక్‌ స్టేడియాలుగా పేరున్న ఈ మైదానాల్లో మ్యాచ్‌లు చూడటం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఈ మైదానాల్లో మ్యాచ్‌లు చూడాలని కోరుకుంటారు. అయితే ఇకపై ప్రతి భారత అభిమానీ తప్పక ఓ మ్యాచ్‌ చూడాలని కలలు కనే స్టేడియంగా మొతేరా మారిపోతే ఆశ్చర్యమేమీ లేదు. మనం లార్డ్స్‌ లాంటి స్టేడియాల గురించి మాట్లాడుకున్నట్లే ఇక నుంచి ప్రపంచం ఈ మైదానం గురించి గొప్పగా చర్చించుకోబోతుందంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించబోతోంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షణలో అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. ఇంకో మూడు రోజుల్లోనే ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల్లో అతి పెద్దదైన ఉప్పల్‌ మైదానం ప్రస్తుత సామర్థ్యం 40 వేలు. ఆ స్టేడియంలో మ్యాచ్‌ చూసిన వాళ్లు.. లక్షా 10 వేల సామర్థ్యం ఉన్న మైదానంలో మ్యాచ్‌ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే ‘మొతేరా’ ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. అంత పెద్ద స్టేడియం నిండుగా ఉండగా మ్యాచ్‌ జరిగితే, అభిమానుల అరుపులతో హోరెత్తితుంటే ఎలా ఉంటుందన్న ఊహే ఉద్వేగానికి గురి చేస్తుంది. 1,00,024 సామర్థ్యంతో  ఇప్పటిదాకా అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును బద్దలు కొట్టిన మొతేరా మైదానం కోసం ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. క్రికెట్‌ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా మైదానాలు తీసుకుంటే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్‌గ్రాడో మే డే స్టేడియం తర్వాతి స్థానం మొతేరాదే. ఇంతకుముందు ఇక్కడున్న పాత స్టేడియాన్ని పునర్నిర్మించి ఇంత భారీగా తీర్చిదిద్దారు. ఇక్కడ జరిగే తొలి మ్యాచే గులాబీ బంతితో కావడం విశేషం. ఈ నెల 24 నుంచి 28 వరకు భారత్‌-ఇంగ్లాండ్‌ డేనైట్‌ టెస్టుకు మొతేరా ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి టెస్టు, ఆ తర్వాత అయిదు టీ20లకు కూడా మొతేరానే ఆతిథ్యమిస్తుంది. అంటే వచ్చే నెల రోజులు ఇక్కడ సందడే సందడన్న మాట!

మొతేరా విశేషాలు

* 1982లో గుజరాత్‌ ప్రభుత్వం అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డున స్టేడియం కోసం 100 ఎకరాలు కేటాయించింది. ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్‌ సంస్థ 49,000 సామర్థ్యమున్న పాత స్టేడియాన్ని 9 నెలల్లోనే పునర్నిర్మించింది.

* ప్రస్తుతం మైదానం మధ్యలో 11 పిచ్‌లు ఉన్నాయి. ఎరుపు, నలుపు మట్టితో వికెట్లను సిద్ధం చేశారు. మైదానంలోని బెర్ముడా గడ్డిని ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు.

* పిల్లర్లు లేకుండా స్టేడియాన్ని నిర్మించడం మరో విశేషం. స్టేడియంలోని ఏ మూల నుంచైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

* 55 గదులు, ఇండోర్‌.. ఔట్‌డోర్‌ క్రీడలు, రెస్టారెంట్లు, ఒలింపిక్‌ ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్, జిమ్నాజియం, పార్టీ ఏరియా, 3డి థియేటర్‌లతో క్లబ్‌హౌస్‌ను నిర్మించారు. క్రికెట్‌ అకాడమీ, ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లూ స్టేడియంలో భాగమే.

* స్టేడియంలో అదనంగా రెండు క్రికెట్‌ మైదానాల్లో 9 ప్రాక్టీస్‌ పిచ్‌ల్ని ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, టెన్నిస్, అథ్లెటిక్స్‌ మౌలిక వసతులు ఉన్నాయి.

* దేశంలో ఎల్‌ఈడీ వెలుతురు ఉన్న మొట్టమొదటి స్టేడియం ఇదే. ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేకపోవడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని