
ఆ ఒక్కటీ అడక్కు!
అహ్మదాబాద్: ఐపీఎల్ ఆడుతున్నా.. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పైనా దృష్టి పెట్టాడు. ఆ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేందుకు లభించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఆ ప్రయత్నంలో న్యూజిలాండ్ పేసర్ జేమీసన్ బౌలింగ్‌లో డ్యూక్స్ బంతులతో సాధన చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడట. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ వివరించాడు. తనకు నెట్స్‌లో డ్యూక్స్ బంతితో బౌలింగ్ చేయమని కోహ్లి కోరగా అతడి వలలో జేమీసన్ పడలేదని అన్నాడు. వారిద్దరి మధ్య సంభాషణను క్రిస్టియన్ బయటపెట్టాడు. ‘‘జేమీ డ్యూక్స్ బంతులతో ఎక్కువగా బౌలింగ్ చేశావా అని కోహ్లి అడిగితే.. ‘అవును. ఇక్కడికి రెండు బంతులను తెచ్చుకున్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముందు వాటితో సాధన చేస్తాను’ అని జేమీ బదులిచ్చాడు. అవునా నెట్స్‌లో నువ్వు నాకు బౌలింగ్ చేయాలని అనుకుంటే.. నీ బౌలింగ్‌లో ఆడేందుకు సంతోషిస్తా అని కోహ్లి అన్నాడు. వెంటనే జేమీ.. నీకు బౌలింగ్ వేసే అవకాశమే లేదు అని తప్పించుకున్నాడు. కోహ్లికి జేమీ బౌలింగ్ వేసివుంటే.. డ్యూక్స్ బంతులను అతడు వదిలే విధానంతో పాటు అన్ని కిటుకలను విరాట్ గమనించేవాడు’’ అని క్రిస్టియన్ వివరించాడు. గతేడాది ఆరంభంలో కివీస్‌లో భారత్ పర్యటించినప్పుడు కోహ్లితో పాటు భారత టాప్ బ్యాట్స్‌మెన్ అందరికి జేమీ ఇబ్బంది పెట్టాడు. తాజాగా ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.15 కోట్లు పెట్టి ఆర్‌సీబీ ఈ పేసర్‌ను దక్కించుకుంది. జూన్ 18న భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
Advertisement