భళారే బరార్‌

హర్‌ప్రీత్‌ బరార్‌. ఎవరికీ పెద్దగా తెలియని ఈ ఆటగాడు ఇప్పుడు హీరో అయిపోయాడు. ముఖ్యంగా బెంగళూరు మాత్రం ఇప్పట్లో అతణ్ని మరిచిపోదు. తన స్పిన్‌తో మాయాజాలంతో ఆ జట్టును అంత దెబ్బతీశాడు మరి. బ్యాటుతోనూ మెరిశాడు. రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన తోడవడంతో బెంగళూరును పంజాబ్‌ చిత్తు చేసింది. టోర్నీలో పంజాబ్‌ మూడో విజయం సాధించగా..

Updated : 01 May 2021 02:03 IST

హర్‌ప్రీత్‌ మాయలో బెంగళూరు చిత్తు
చెలరేగిన రాహుల్‌, గేల్‌
పంజాబ్‌ కింగ్స్‌ ఘనవిజయం
అహ్మదాబాద్‌

హర్‌ప్రీత్‌ బరార్‌. ఎవరికీ పెద్దగా తెలియని ఈ ఆటగాడు ఇప్పుడు హీరో అయిపోయాడు. ముఖ్యంగా బెంగళూరు మాత్రం ఇప్పట్లో అతణ్ని మరిచిపోదు. తన స్పిన్‌తో మాయాజాలంతో ఆ జట్టును అంత దెబ్బతీశాడు మరి. బ్యాటుతోనూ మెరిశాడు. రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన తోడవడంతో బెంగళూరును పంజాబ్‌ చిత్తు చేసింది. టోర్నీలో పంజాబ్‌ మూడో విజయం సాధించగా.. కోహ్లీసేన రెండో ఓటమి చవిచూసింది.

పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ శుక్రవారం 34 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. కెప్టెన్‌ రాహుల్‌ (91 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 5×6), క్రిస్‌ గేల్‌ (46; 24 బంతుల్లో 6×4, 2×6), హర్‌ప్రీత్‌ బరార్‌ (25 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 2×6) చెలరేగడంతో మొదట పంజాబ్‌ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఛేదనలో హర్‌ప్రీత్‌ (3/19) స్పిన్‌ వలలో చిక్కుకున్న బెంగళూరు 8 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. రవి బిష్ణోయ్‌ (2/17) కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కోహ్లి (35; 34 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. దూకుడుగా ఆడలేకపోయాడు.
తిప్పేసిన బరార్‌: ఛేదనలో బెంగళూరులో జోరే లేదు. మూడో ఓవర్లోనే మెరిడిత్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ (7)ను కోల్పోయిన ఆ జట్టు స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. 180 పరుగుల ఛేదనకు అవసరమైన దూకుడు ఆ జట్టులో కొరవడింది. ఓపెనర్‌ కోహ్లి స్వేచ్ఛగా, ధాటిగా ఆడలేకపోయాడు. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. పటీదార్‌ కూడా అంతే. 10 ఓవర్లలో బెంగళూరు స్కోరు 62/1. అప్పటికి కోహ్లి 33 బంతుల్లో 35 చేయగా.. పటీదార్‌ 21 బంతుల్లో 15 పరుగులే చేశాడు. చేతిలో వికెట్లు ఉండడంతో బెంగళూరుకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌.. అద్భుతమైన బౌలింగ్‌తో ఆ జట్టును చావు దెబ్బతీశాడు. చకచకా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 11వ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ (0)లను బౌల్డ్‌ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లోనే స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ (3)నూ బోల్తా కొట్టించాడు. అంతే అక్కడి నుంచి బెంగళూరు కోలుకోలేకపోయింది. పటీదార్‌ (31), షాబాజ్‌ అహ్మద్‌ (8), సామ్స్‌ (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు. 16 ఓవర్లకు స్కోరు 96/7. చివరి 4 ఓవర్లలో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు ఓటమి లాంఛనమే. మిగతా ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే. చివర్లో హర్షల్‌ (31; 13 బంతుల్లో 3×4, 2×6) బ్యాట్‌ ఝుళిపించాడు.

ఆ ముగ్గురినీ..

కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌! బెంగళూరుకు మూలస్తంభాలు వీళ్లు. ఒకరు ఒకరు కాకున్నా ఒకరైనా చెలరేగుతారు. ఒక్కరైనా మెరవడం ఆ జట్టుకు అవసరం కూడా. కానీ ఛేదనలో ఊహించని విధంగా బెంగళూరు భంగపడింది. ఈ ముగ్గురిని ఏడు బంతుల వ్యవధిలోనే ఔట్‌ చేసి మ్యాచ్‌ను పంజాబ్‌ వైపు తిప్పేశాడు ఎడమచేతి వాటం స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బరార్‌. ఎప్పుడూ వినని పేరే ఇది. 2019లో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.

చెలరేగిన గేల్‌: పది ఓవర్లలో 90/1. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ పరిస్థితిది. నిజానికి ఇన్నింగ్స్‌ ఇబ్బందిగానే మొదలైంది. గాయపడ్డ మయాంక్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ (7) త్వరగానే నిష్క్రమించాడు. రాహుల్‌ పరుగుల కోసం కష్టపడ్డాడు. ఎదుర్కొన్న తొలి 17 బంతుల్లో 12 పరుగులే చేశాడు. కానీ గేల్‌ వస్తూనే బాదుడు మొదలెట్టడం, రాహుల్‌ కూడా కాస్త జోరు పెంచడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. చెలరేగి ఆడిన గేల్‌.. జేమీసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ఏకంగా అయిదు ఫోర్లు బాదేశాడు. చాహల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ వరుసగా 4, 6 కొట్టాడు. 11వ ఓవర్లో సామ్స్‌ బౌలింగ్‌లోనూ సిక్స్‌ దంచాడు. పంజాబ్‌ భారీ స్కోరు చేయడం ఖాయమనిపించిన దశ అది. కానీ అదే ఓవర్లో గేల్‌ నిష్క్రమించడంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. సామ్స్‌ బౌన్సర్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. అది మొదలు ఇన్నింగ్స్‌పై పంజాబ్‌ పట్టు కోల్పోయింది.  పూరన్‌ (0), దీపక్‌ హుడా (5), షారుక్‌ ఖాన్‌ (0) చకచకా పెవిలియన్‌ బాట పట్టారు. రాహుల్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. కానీ హర్షల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో హర్‌ప్రీత్‌ బరార్‌ వరుసగా 4, 6 కొట్టాడు. రాహుల్‌ కూడా ఓ ఫోర్‌ రాబట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులొచ్చాయి. రాహుల్‌ రెండు ఫోర్లు, సిక్స్‌.. హర్‌ప్రీత్‌ ఓ సిక్స్‌ బాదడంతో హర్షల్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఏకంగా 22 పరుగులొచ్చాయి.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ నాటౌట్‌ 91; ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) కోహ్లి (భి) జేమీసన్‌ 7; గేల్‌ (సి) డివిలియర్స్‌ (బి) సామ్స్‌ 46; పూరన్‌ (సి) షాబాజ్‌ (బి) జేమీసన్‌ 0; దీపక్‌ హుడా (సి) పటీదార్‌ (సి) షాబాజ్‌ 5; షారుక్‌ ఖాన్‌ (బి) చాహల్‌ 0; హర్‌ప్రీత్‌ బరార్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 5

మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179; 

వికెట్ల పతనం: 1-19, 2-99, 3-107, 4-117, 5-118;

బౌలింగ్‌: సామ్స్‌  4-0-24-1; సిరాజ్‌ 3-0-24-0; జేమీసన్‌ 3-0-32-2; చాహల్‌ 4-0-34-1; హర్షల్‌ పటేల్‌ 4-0-53-0; షాబాజ్‌ అహ్మద్‌ 2-0-11-1
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) హర్‌ప్రీత్‌ 35; పడిక్కల్‌ (బి) మెరిడిత్‌ 7; పటీదార్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 31; మ్యాక్స్‌వెల్‌ (బి) హర్‌ప్రీత్‌ 0; డివిలియర్స్‌ (సి) రాహుల్‌ (బి) హర్‌ప్రీత్‌ 3; షాబాజ్‌ అహ్మద్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) బిష్ణోయ్‌ 8; సామ్స్‌ (బి) బిష్ణోయ్‌ 3; జేమీసన్‌ నాటౌట్‌ 16; హర్షల్‌ పటేల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) షమి 31; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145;

వికెట్ల పతనం: 1-19, 2-62, 3-62, 4-69, 5-91, 6-96, 7-96, 8-144;

బౌలింగ్‌: మెరిడిత్‌ 3.2-0-29-1; షమి 3.4-0-28-1; రవి బిష్ణోయ్‌ 4-0-17-2; హర్‌ప్రీత్‌ బరార్‌ 4-1-19-3; జోర్డాన్‌ 4-0-31-1; దీపక్‌ హుడా 1-0-13-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని