సన్‌రైజర్స్‌ ఇక కష్టమే!

ఐపీఎల్‌-14లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ చేరడం ఇక కష్టమే! వార్నర్‌ లేని ఆ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో కీలక పోరులో పేలవమైన ప్రదర్శనతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌ల్లో ఆరో ఓటమితో ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది! బంతి చిరునామాను బౌండరీగా మార్చేస్తూ.. బట్లర్‌ కొనసాగించిన దండయాత్రకు ఆ జట్టు బెంబేలెత్తిపోయింది. తుపానుగా ముందు ప్రశాంతతలా.. అర్ధశతకానికి

Published : 03 May 2021 02:13 IST

బట్లర్‌ సూపర్‌ సెంచరీ
ఆరో ఓటమితో ప్లేఆఫ్‌ ఆశలు సంక్లిష్టం
రాజస్థాన్‌ ఘనవిజయం

ఐపీఎల్‌-14లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ చేరడం ఇక కష్టమే! వార్నర్‌ లేని ఆ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో కీలక పోరులో పేలవమైన ప్రదర్శనతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌ల్లో ఆరో ఓటమితో ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది! బంతి చిరునామాను బౌండరీగా మార్చేస్తూ.. బట్లర్‌ కొనసాగించిన దండయాత్రకు ఆ జట్టు బెంబేలెత్తిపోయింది. తుపానుగా ముందు ప్రశాంతతలా.. అర్ధశతకానికి ముందు నెమ్మదిగా కనిపించిన అతను.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీర బాదుడుతో టీ20ల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. అతని సంచలన ఇన్నింగ్స్‌కు.. బౌలర్ల సమష్టి కృషి తోడవడంతో రాజస్థాన్‌ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

దిల్లీ

రాజస్థాన్‌ రాయల్స్‌ దూకుడుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బెదిరిపోయింది. ఆదివారం మధ్యాహ్న మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమై 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (124; 64 బంతుల్లో 11×4, 8×6) మెరుపు శతకం సాయంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. శాంసన్‌ (48; 33 బంతుల్లో 4×4, 2×6) ఫామ్‌ కొనసాగించాడు. ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆ జట్టులో మనీశ్‌ పాండే (31) టాప్‌స్కోరర్‌. ముస్తాఫిజుర్‌ (3/20), క్రిస్‌ మోరిస్‌ (3/29) చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు.
ఆ విరామమే మలుపు..: భారీ ఛేదనలో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మనీశ్‌.. బెయిర్‌స్టో (30)తో కలిసి జట్టుకు ఆశాజనకమైన ఆరంభమే ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి 57/0తో నిలిచిన సన్‌రైజర్స్‌.. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మనీశ్‌ను ఔట్‌ చేసి ముస్తాఫిజుర్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదింపాడు. తెవాతియా బౌలింగ్‌లో బెయిర్‌స్టో నిష్క్రమించాడు. కొద్దిసేపటికే ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ (8) పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌పై రాజస్థాన్‌ పట్టు బిగించింది. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌ కొనసాగించిన కెప్టెన్‌ విలియమ్సన్‌ (20) బంతికో పరుగు చొప్పున తీస్తూ పోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ 15 దాటింది. ఆ దశలో జాదవ్‌ (19) ఓ సిక్సర్‌ కొట్టి ఇన్నింగ్స్‌ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. 12 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 100కు చేరింది. కానీ పేకమేడలా కుప్పకూలే మిడిలార్డర్‌ మరోసారి ఆనవాయితీ కొనసాగించింది. విలియమ్సన్‌ ఔట్‌ కావడంతోనే జట్టు ఓటమి ఖాయమైంది. నబి (17) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మోరిస్‌ ఒకే ఓవర్లో సమద్‌ (10), జాదవ్‌ను ఔట్‌ చేయడంతో చివర్లో అనూహ్య పరిణామాలేవీ జరగలేదు.
బాదుడే బాదుడు..: రాజస్థాన్‌ బ్యాటింగ్‌లో బట్లర్‌ ఇన్నింగ్సే హైలైట్‌. నెమ్మదిగా బ్యాటింగ్‌ మొదలెట్టిన అతను తర్వాత సునామీలా ప్రత్యర్థిని ముంచెత్తాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఓపెనర్‌ జైస్వాల్‌ (12)ను రషీద్‌ (1/24) ఎల్బీగా వెనక్కిపంపినప్పటికీ.. ప్రత్యర్థికి ఆ ఆనందం మిగలకుండా క్రీజులోకి రాగానే శాంసన్‌ విరుచుకుపడ్డాడు. మరోవైపు బట్లర్‌ జోరు అందుకోవడంతో ఈ జోడీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ వైఫల్యాలూ వాళ్లకు కలిసొచ్చాయి. బట్లర్‌ క్యాచ్‌ను విజయ్‌ శంకర్‌ సరిగా అంచనా వేయలేకపోగా.. శాంసన్‌ క్యాచ్‌ను మనీశ్‌ జారవిడిచాడు. 10 ఓవర్లకు ఆ జట్టు 77/1తో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో బట్లర్‌ బాదుడుతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటికే రషీద్‌ కోటా పూర్తి కావడంతో బట్లర్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో బంతి అందుకున్న నబీకి చుక్కలు చూపించాడు. రెండేసి చొప్పున సిక్సర్లు, ఫోర్లు రాబట్టాడు. బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు 88 బంతుల్లోనే 150 పరుగులు జోడించాక శాంసన్‌ ఔటయ్యాడు. అయినా బట్లర్‌ ఏ మాత్రం నెమ్మదించలేదు. దాడి కొనసాగించి 56 బంతుల్లో శతకం అందుకున్నాడు. తొలి 39 బంతుల్లో 50 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత కేవలం 17 బంతుల్లోనే సెంచరీ చేరుకున్నాడంటే బంతిపై అతని దండయాత్ర ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతా ఇంకా కసి తీరనట్లు బంతిపై కోపం ప్రదర్శించాడు. సందీప్‌ వేసిన 19వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదేసి జట్టు స్కోరును 200 దాటించాడు. అయితే అదే ఓవర్‌ చివరి బంతికి ఔటవడంతో తన సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతిని మిల్లర్‌ స్టాండ్స్‌లో   పడేయడంతో ఆ జట్టు 220  పరుగులను చేరుకుంది.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (బి) సందీప్‌ 124; జైస్వాల్‌ ఎల్బీ (బి) రషీద్‌ 12; శాంసన్‌ (సి) సమద్‌ (బి) విజయ్‌ 48; పరాగ్‌ నాటౌట్‌ 15; మిల్లర్‌ నాటౌట్‌ 7; ఎక్ర్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 220; వికెట్ల పతనం: 1-17, 2-167, 3-209; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-37-0; సందీప్‌ శర్మ 4-0-50-1; రషీద్‌ ఖాన్‌ 4-0-24-1; ఖలీల్‌ 4-0-41-0; విజయ్‌ శంకర్‌ 3-0-42-1; మహమ్మద్‌ నబి 1-0-21-0
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: మనీశ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 31; బెయిర్‌స్టో (సి) అనుజ్‌ (బి) తెవాతియా 30; విలియమ్సన్‌ (సి) మోరిస్‌ (బి) కార్తీక్‌ 20; విజయ్‌ (సి) మిల్లర్‌ (బి) మోరిస్‌ 8; కేదార్‌ జాదవ్‌ (బి) మోరిస్‌ 19; నబి (సి) అనుజ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 17; సమద్‌ (సి) అనుజ్‌ (బి) మోరిస్‌ 10; రషీద్‌ (సి) మోరిస్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; భువనేశ్వర్‌ నాటౌట్‌ 14; సందీప్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-57, 2-70, 3-85, 4-105, 5-127, 6-142, 7-142, 8-143; బౌలింగ్‌: కార్తీక్‌ త్యాగి 4-0-32-1; ముస్తాఫిజుర్‌ 4-0-20-3, సకారియా 4-0-38-0; మోరిస్‌ 4-0-29-3; తెవాతియా 4-0-45-1

1

టీ20 క్రికెట్లో బట్లర్‌కిదే తొలి శతకం. ఈ ఐపీఎల్‌ సీజన్లో నమోదైన మూడో శతకమిది. అంతకుముందు రాజస్థాన్‌ కెప్టెన్‌ శాంసన్‌, ఆర్సీబీ ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ సెంచరీలు చేశారు.

3

ఐపీఎల్‌లో 50కి పైగా పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ ఓడిపోవడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో 2013లో సీఎస్కేపై 77 పరుగులు, 2014లో పంజాబ్‌పై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
 

‘‘టీ20 క్రికెట్లో తొలి సెంచరీ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్‌లుగా క్రీజులో గడిపే సమయం దొరక్క ఇబ్బంది పడ్డా. ప్రతి రోజు ఓ సరికొత్త అవకాశం దొరుకుతుందని సానుకూల దృక్పథంతో ఉండాలి. ఈ మ్యాచ్‌లో ఎక్కువ సమయం ఆడి ఉత్తమ ప్రదర్శన చేయడం సంతృప్తినిచ్చింది’’

- బట్లర్‌

‘ ‘తుది జట్టు నుంచి వార్నర్‌ను తప్పించడం కఠిన నిర్ణయం. జట్టుకు అతనెన్నో విజయాలు అందించాడు. కానీ తప్పలేదు. ఎందుకంటే మాకు ఉపయోగపడే విభిన్నమైన కూర్పులు ప్రయత్నించాలని అనుకున్నాం. జట్టులో చోటు కోల్పోయిన ఆటగాళ్లలాగే వార్నర్‌ కూడా నిరాశ చెందాడు. మ్యాచ్‌ సందర్భంగా 12వ ఆటగాడిగా డగౌట్‌లో ఉంటూ జట్టు కోసం చేయాల్సింది చేశాడు. విలియమ్సన్‌తో పాటు ఇతర ఆటగాళ్లతో మాట్లాడుతూ సలహాలిచ్చాడు. ఓ ఆటగాడిగా వార్నర్‌ లేకుండా, కొత్త కెప్టెన్‌తో జట్టును నడిపించడం సవాలే. కానీ గతంలో సన్‌రైజర్స్‌కు సారథిగా పనిచేసిన అనుభవం విలియమ్సన్‌కు ఉంది. బట్లర్‌ను ఔట్‌ చేసేందుకే మా ఉత్తమ బౌలరైనా రషీద్‌కు తొలి పవర్‌ప్లేలోనే బంతి అందించాం’’

- సన్‌రైజర్స్‌ కోచ్‌ ట్రేవర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని