Updated : 05 May 2021 01:57 IST

ఖేల్‌ ఖతం

కరోనా ధాటికి ఆగిన ఐపీఎల్‌
టోర్నీ నిరవధిక వాయిదా
భారత్‌లో టీ20 ప్రపంచకప్‌పైనా నీలి నీడలు
దిల్లీ

అయిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్‌ కథ అర్ధంతరంగా ముగిసిపోయింది. సజావుగా సాగిపోతున్న లీగ్‌లో కరోనా కలకలం మొదలైన రెండో రోజుకే మొత్తం కథ మారిపోయింది. అర్ధంతరంగా ఐపీఎల్‌ను ఆపేసి దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతానికి ఇక మ్యాచ్‌లు లేవు. మళ్లీ ఎప్పుడు, ఎక్కడ లీగ్‌ను పునఃప్రారంభిస్తారో తెలియదు. బయో బబుల్‌ను పకడ్బందీగా ఏర్పాటు చేయడంలో విఫలమై కరోనా ప్రవేశానికి కారణమైన బీసీసీఐ.. భారీ మూల్యమే చెల్లించుకుంది. లీగ్‌ను మధ్యలో ఆపేయడం వల్ల వేల కోట్ల నష్టం ఎదుర్కోవాల్సి రావడమే కాదు.. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రమాదంలో పడేసుకుంది.

భారత దేశాన్ని మరోమారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి.. కల్లోల సమయంలో దేశ ప్రజలకు ఉపశమనాన్ని అందిస్తున్న ఐపీఎల్‌కూ బ్రేక్‌ వేసింది. లీగ్‌లో వరుసగా రెండో రోజు కరోనా కేసులు వెలుగు చూడటంతో లీగ్‌ను అర్ధంతరంగా ఆపేయక తప్పలేదు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లతో పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌ బృందంలో ముగ్గురు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు అహ్మదాబాద్‌లో జరగాల్సిన కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్‌ను వాయిదా వేశారు. మంగళవారం దిల్లీలో సన్‌రైజర్స్‌-ముంబయి తలపడాల్సి ఉండగా.. హైదరాబాద్‌ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహ కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. 24 గంటల వ్యవధిలో లీగ్‌ పరిధిలో అరడజను కేసులు వెలుగు చూడటం, ప్రస్తుతం మ్యాచ్‌లు జరుగుతున్న రెండు వేదికలు.. అలాగే మూడు జట్లపై కరోనా ప్రభావం పడటంతో టోర్నీని ఆపేయడం తప్ప బీసీసీఐకి మరో మార్గం లేకపోయింది. సాహా కరోనా పాజిటివ్‌గా తేలిన కాసేపటికే అత్యవసర సమావేశం నిర్వహించి లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటించాయి. దిల్లీ క్యాపిటల్స్‌ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరాడు. అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని దిల్లీ తెలిపింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకెల్‌ హసీకి కూడా వైరస్‌ సోకింది. పరీక్షించిన రెండు సార్లూ అతడికి పాజిటివ్‌ అని తేలింది. 14వ సీజన్లో చివరగా ఆదివారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. అది ఈసారి లీగ్‌లో 29వ మ్యాచ్‌. టోర్నీలో ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈసారి లీగ్‌ ఆరంభానికి ముందే కొందరు ఆటగాళ్లు సహా 40 మందికి పైగానే కరోనా బారిన పడ్డారు. అయితే వెంటనే అప్రమత్తం అయిన నిర్వాహకులు.. పాజిటివ్‌గా తేలిన వారిని క్వారంటైన్‌కు పంపి, వైరస్‌ మరింత మందికి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలిగారు. లీగ్‌ ఆరంభమయ్యాక కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో మ్యాచ్‌లు సజావుగా సాగిపోయాయి. కానీ ముంబయి, చెన్నైలో తొలి దశ మ్యాచ్‌లు ముగించుకుని.. ఆటగాళ్లు, సిబ్బంది విమాన ప్రయాణాలు చేసి అహ్మదాబాద్‌, దిల్లీలకు చేరుకున్న కొన్ని రోజులకే ఇలా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే దేశంలో కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో లీగ్‌ను కొనసాగిస్తే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ప్రాణాలకే ముప్పు తలెత్తవచ్చన్న అంచనాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఇప్పట్లో ఉండదు.. మరెప్పుడు?

గత ఏడాది ఆరంభం కాకుండానే వాయిదా పడ్డ ఐపీఎల్‌ను సెప్టెంబరు-నవంబరు మధ్య యూఏఈ వేదికగా నిర్వహించింది బీసీసీఐ. వరుసగా అంతర్జాతీయ సిరీస్‌లన్నీ రద్దవడం, మిగతా బోర్డులన్నీ సహకరించడంతో ఏ ఇబ్బందీ లేకుండా కుదిరిన సమయంలో లీగ్‌ను పూర్తి చేశారు. కానీ ఇప్పుడు మధ్యలో ఆగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తి చేయడం మాత్రం బోర్డుకు సవాలే. సగానికి పైగా మ్యాచ్‌లు మిగిలుండటంతో మళ్లీ నాలుగైదు వారాల ఖాళీ సమయాన్ని దొరకబుచ్చుకుని.. మళ్లీ వివిధ దేశాల ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిని రప్పించి.. మ్యాచ్‌లు నిర్వహించడం అంత తేలిక కాదు. భారత్‌లోనే లీగ్‌ను జరిపించాలనుకుంటే రాబోయే కొన్ని నెలల్లో సాధ్యం కాకపోవచ్చు. ముందు భారత ఆటగాళ్లకు ఈ ఏడాదిలో ఖాళీ దొరికే సమయం ఏదని పరిశీలిస్తే.. వచ్చే నెల 18-22 తేదీల మధ్య ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాక.. ఆగస్టు 4న ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ఆరంభానికి ముందు నెల రోజులకు పైగా ఖాళీ ఉంది. ఆ సమయానికి భారత్‌లో పరిస్థితులు మెరుగుపడితే ఐపీఎల్‌ను లాగించేయొచ్చు. భారత్‌లో కుదరకపోతే యూఏఈ వైపు చూడొచ్చు. అప్పుడు కుదరకపోతే.. సెప్టెంబరులో ఇంగ్లాండ్‌ పర్యటనను టీమ్‌ఇండియా ముగించుకుని వచ్చాక, అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు ఐపీఎల్‌ ఆడేందుకు అవకాశముంది. అప్పుడూ కుదరకపోతే నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ముగిశాక చూసుకోవాల్సిందే. ఐపీఎల్‌ ఆడే అన్ని దేశాల క్రికెటర్లకూ కుదిరే సమయాన్ని ఎంచుకోవడం.. లీగ్‌ను ఎక్కడ నిర్వహించినప్పటికీ మరోసారి ఇలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీగా బయో బబుల్‌ను ఏర్పాటు చేసి, మ్యాచ్‌లు జరిపించడం కీలకం.

ప్రపంచకప్‌ ఎలా?

ఐపీఎల్‌-14 ఇలా అర్ధంతరంగా వాయిదా పడగానే.. ఇప్పుడందరి దృష్టీ భారత్‌ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ మీద పడింది. అక్టోబరు-నవంబరు నెలల్లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను భారత్‌ నుంచి తరలించక తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఆ టోర్నీకి మధ్యలో నాలుగు నెలల సమయమే ఉండగా.. ప్రస్తుతం భారత్‌లో కరోనా ఎలా విలయ తాండవం చేస్తోందో తెలిసిందే. దేశంలో కరోనా మూడో దశను కూడా చూడబోతున్నామనే అంచనాలూ ఉన్నాయి. ఐపీఎల్‌ విజయవంతంగా నిర్వహించి ఉంటే.. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ జరిపించడంపై కాస్తో కూస్తో ఆశలుండేవి. కానీ ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ.. లీగ్‌పై కరోనా ప్రభావం తప్పలేదు. టోర్నీని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఐపీఎల్‌ను స్వదేశంలో సమర్థంగా నిర్వహించడం ద్వారా.. టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడ జరిపించడానికి ఏ ఇబ్బందీ లేదని చాటాలని భావించిన బీసీసీఐ.. పట్టుబట్టి ఇక్కడే ఐపీఎల్‌కు సన్నాహాలు చేసింది. అందుకే అభిమానులను సైతం స్టేడియాలకు దూరం పెట్టింది. వేదికల సంఖ్యను తగ్గించి.. ఒక్కో దశలో రెండు స్టేడియాలను ఎంపిక చేసుకుని, బయో బబుల్‌Ë ఏర్పాటు చేసి పకడ్బందీగా మ్యాచ్‌లు నిర్వహించాలని చూసింది. లీగ్‌ ఆరంభానికి ముందు కరోనా కేసులు బయటపడ్డా తట్టుకుని విజయవంతంగా ఇప్పటిదాకా మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా కూడా ఇదే నమూనాను అనుసరించాలని కూడా బోర్డు భావించింది. కానీ లీగ్‌ మధ్యలో అనుకోకుండా కరోనా కేసులు వెలుగుచూసి బీసీసీఐ ప్రణాళికలన్నింటినీ దెబ్బ తీశాయి. రాబోయే కొన్ని నెలల్లో కరోనా తీవ్రత అమాంతం తగ్గిపోయి, పరిస్థితులు అసాధారణ రీతిలో మారిపోతే తప్ప టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ నుంచి తరలించడం ఖాయమనే భావించాలి. నిరుడు ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చిన యూఏఈనే ప్రత్యామ్నాయం కావొచ్చని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా క్రికెటర్లు అక్కడికి..

ఐపీఎల్‌ వాయిదా పడ్డ నేపథ్యంలో విదేశీ క్రికెటర్లను వారి స్వదేశాలకు తరలించడం ఇప్పుడు బీసీసీఐ ముందున్న పెద్ద సవాల్‌. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధించాయి. ఆస్ట్రేలియా అయితే తమ దేశ పౌరులను కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతానికి మే 15 వరకు ఆంక్షలు పెట్టింది. తర్వాత ఏం జరుగుతుందో స్పష్టత లేదు. ఇప్పటికే ఐపీఎల్‌ వ్యాఖ్యాతల బృందం నుంచి మధ్యలో తప్పుకొని మాల్దీవులకు చేరుకుని, అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్దామనుకున్న మాజీ ఆటగాడు మైకేల్‌ స్లేటర్‌కు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఉండటం ఎంతమాత్రం క్షేమం కాదని ఆస్ట్రేలియా క్రికెటర్లు భావిస్తున్నారు. మాల్దీవులకే ఆ దేశ క్రికెటర్లు, కోచింగ్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చేరుకోనున్నారు. వీరంతా తమ దేశంలో ఆంక్షలు తొలగిపోయే వరకు మాల్దీవుల్లో గడిపి ఆ తర్వాత స్వదేశానికి పయనం కానున్నారు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ దేశాలకు వెళ్లే ఆటగాళ్లు అక్కడ విమానం దిగాక హోటళ్లలో రెండు వారాల పాటు క్వారంటైన్‌ అయ్యాకే తమ ఇళ్లకు వెళ్లే అవకాశముంది. దక్షిణాఫ్రికాకు ప్రయాణించే వారికి ఇలాంటి షరతులేమీ లేవు. ఈసారి ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 14 మంది క్రికెటర్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌ (11), దక్షిణాఫ్రికా (11), న్యూజిలాండ్‌ (10), వెస్టిండీస్‌ (9), అఫ్గాన్‌ (3), బంగ్లాదేశ్‌ (2) క్రికెటర్లు పోటీపడుతున్నారు. మాజీ ఆటగాళ్లు చాలామంది కోచ్‌లుగా, వ్యాఖ్యాతలుగా వివిధ హోదాల్లో లీగ్‌లో భాగమయ్యారు.

బుడగ ఎలా పేలింది?

బయో బబుల్‌ మధ్య ఐపీఎల్‌ నిర్వహిస్తున్నా సరే.. లీగ్‌ మధ్యలో కరోనా కేసులు ఎలా వెలుగు చూశాయన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. గత ఏడాది యూఏఈలో ఎంతో పకడ్బందీగా బుడగను ఏర్పాటు చేసి రెండు నెలల పాటు విజయవంతంగా లీగ్‌ను నిర్వహించారు. లీగ్‌ ఆరంభానికి ముందు కొన్ని కేసులు వెలుగు చూసినా.. అవి ఆటగాళ్లు, సిబ్బంది క్వారంటైన్‌ ప్రక్రియ మొదలు కావడానికి ముందే, విమాన ప్రయాణాల కారణంగా బయటపడ్డవి. అంతటితో వైరస్‌కు అడ్డుకట్ట వేశారు. లీగ్‌ మొదలయ్యాక వైరస్‌ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బ్రిటన్‌కు చెందిన రెస్ట్రారా అనే కంపెనీకి బబుల్‌ బాధ్యతలు అప్పగించారు. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మైదాన, హోటళ్ల నిర్వాహకులు.. ఇలా లీగ్‌లో భాగమైన అందరినీ బుడగలోకి తీసుకొచ్చారు. బయటి వ్యక్తులు ఎవ్వరూ బుడగ లోపలికి రాకుండా చూసుకున్నారు. అలాగే మూడు వేదికలకే మ్యాచ్‌లు పరిమితం చేయడం, విమాన ప్రయాణాల అవసరం లేకుండా రోడ్డు మార్గాల్లోనే ఒక వేదిక నుంచి మరో వేదికకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా ఎవరికీ వైరస్‌ సోకకుండా చూసుకున్నారు. అయితే ఇప్పుడు స్వదేశంలో అంత పకడ్బందీగా బబుల్‌ లేకపోవడం వల్లే లీగ్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నది స్పష్టం. ప్రస్తుతం అందరికీ కలిపి ఉమ్మడి బయో బబుల్‌ ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. ఆయా ఫ్రాంఛైజీలు తమ తమ పరిధిలో బబుల్‌ ఏర్పాటు చేసుకున్నాయి. మైదానాలకు, జట్లు బస చేసే హోటళ్లకు మధ్య ఎక్కువ దూరం ఉండటం.. హోటళ్ల సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటం, వారికి నిర్బంధ క్వారంటైన్‌ లేకపోవడం.. అలాగే మైదానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎవరూ బబుల్‌ నిబంధనలు పాటించకపోవడం లాంటి లోపాల గురించి ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతోంది. లీగ్‌ను ఒకట్రెండు వేదికలకు పరిమితం చేయకుండా.. ఆరు నగరాలను ఎంపిక చేయడంతో మధ్యలో మూడుసార్లు ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చెన్నై, ముంబయిల్లో మ్యాచ్‌లు అయ్యాక అందరూ ప్రయాణాలు చేసిన కొన్ని రోజులకే కరోనా కేసులు బయటపడటాన్ని బట్టి ఆ సమయంలోనే వైరస్‌ వ్యాప్తి జరిగి ఉంటుందని స్పష్టమవుతోంది. కోల్‌కతా ఆటగాడు వరుణ్‌ చక్రవర్తి మధ్యలో మోకాలి గాయానికి స్కానింగ్‌ తీసుకోవడానికి బబుల్‌ను వీడి వెళ్లాడు. తిరిగి బబుల్‌లోకి వచ్చాక క్వారంటైన్‌కు వెళ్లకుండా జట్టుతో కలిసి మ్యాచ్‌లు ఆడేశాడు. అతడితో పాటు జట్టు సభ్యుడు సందీప్‌ వారియర్‌ పాజిటివ్‌గా తేలడంతో ముందుగా లీగ్‌లో సమస్య మొదలైంది. తర్వాతి 24 గంటల్లో చెన్నై, సన్‌రైజర్స్‌ జట్లలోనూ కేసులు బయటపడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐపీఎల్‌ నిర్వాహకుల్లో కరోనా పట్ల భయం తగ్గి, నిర్లక్ష్యం పెరిగిందన్నది స్పష్టం! బయో బబుల్‌ను పకడ్బందీగా లేకపోవడమే లీగ్‌ను ఇలా మధ్యలో ఆపేయక తప్పని పరిస్థితి తలెత్తింది.

స్వదేశానికి కివీస్‌ ఆటగాళ్లు: ఐపీఎల్‌లో పాల్గొన్న న్యూజిలాండ్‌ క్రికెటర్లు నేరుగా స్వదేశం చేరుకోనున్నారు. భారత్‌కు ప్రయాణలపై ఉన్న నిషేధాన్ని న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. అయితే ఇరుదేశాల మధ్య విమానాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. తమ ఆటగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ) తగిన ఏర్పాట్లు చేస్తుంది.
 

‘‘ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ ఎవరూ పరిపూర్ణులు కారు. ప్రపంచకప్‌కు ముందు భారత్‌లో ఐపీఎల్‌ను నిర్వహించాలనుకోవడం ఉత్తమ నిర్ణయం. పరిస్థితి అత్యంత వేగంగా క్షీణించడం దురదృష్టకరం’’

-  నెస్‌ వాడియా,
పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని

‘‘ఐపీఎల్‌ను సత్వరం వాయిదా వేయాలని అత్యవసర సమావేశానంతరం ఐపీఎల్‌ పాలక మండలి, బీసీసీఐ నిర్ణయించాయి. ఐపీఎల్‌లో భాగమైన ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ఇతర వర్గాల భద్రత విషయంలో రాజీ పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. లీగ్‌లో భాగస్వాములైన అందరి ఆరోగ్యం, రక్షణ దష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కష్ట కాలంలో ఐపీఎల్‌ నిర్వహణ ద్వారా అందరిలోనూ కొంత సానుకూలత, సంతోషం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే లీగ్‌ను నిర్వహించాం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేయక తప్పలేదు. దీంతో ఈ కఠిన సమయంలో అందరూ వారి వారి కుటుంబాల వద్దకు వెళ్లడానికి అవకాశం దొరికింది. ఐపీఎల్‌లో భాగమైన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరేలా బీసీసీఐ అన్ని ఏర్పాట్లూ చేస్తుంది. ఇలాంటి కఠిన సమయంలో ఇప్పటి వరకు లీగ్‌ను నిర్వహించడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’

- బీసీసీఐ

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts