సైనా, శ్రీకాంత్‌ ఆశలకు తెర

భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల టోక్యో ఒలింపిక్స్‌ ఆశలకు తెరపడింది. ఒలింపిక్‌ ర్యాంకింగ్‌ జాబితాలో మార్పులు చేయబోమని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించడంతో వాళ్ల కొద్దిపాటి అవకాశాలకు గండిపడింది.

Published : 29 May 2021 01:26 IST

ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ ముగిసిందని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటన

దిల్లీ: భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల టోక్యో ఒలింపిక్స్‌ ఆశలకు తెరపడింది. ఒలింపిక్‌ ర్యాంకింగ్‌ జాబితాలో మార్పులు చేయబోమని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించడంతో వాళ్ల కొద్దిపాటి అవకాశాలకు గండిపడింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అర్హత టోర్నీలు నిర్వహించబోమని శుక్రవారం బీడబ్ల్యూఎఫ్‌ స్పష్టంచేసింది. ఇండియా ఓపెన్‌, మలేసియా ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌లు వరుసగా రద్దవడంతో సైనా, శ్రీకాంత్‌ల ఒలింపిక్‌ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. అయితే టోక్యో ఒలింపిక్స్‌ అర్హతకు సంబంధించి మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించడంతో వీరిద్దరిలో ఆశలు చిగురించాయి. ‘‘టోక్యో ఒలింపిక్స్‌ అర్హత సమయంలో మరే టోర్నీలు నిర్వహించం. ఒలింపిక్స్‌ అర్హతకు సవరించిన తుది గడువు జూన్‌ 15న అధికారికంగా ముగుస్తుంది. టోక్యో ర్యాంకింగ్‌ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవు. క్రీడాకారులకు పాయింట్లు సాధించే అవకాశాలు లేనందున ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియను మూసేశాం. అయితే షట్లర్ల ఎంట్రీల విషయంలో జాతీయ ఒలింపిక్‌ కమిటీలు, సభ్య దేశాల నుంచి ధ్రువీకరణలు రావాల్సి ఉన్నాయి. అప్పుడు ఏమైనా మార్పులు ఉంటే చెప్పలేం. ఈ ప్రక్రియకు కొన్ని వారాల సమయం పడుతుంది’’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ర్యాంకింగ్స్‌ ఆధారంగా బ్యాడ్మింటన్‌లో భారత్‌ నుంచి పి.వి.సింధు, సాయిప్రణీత్‌, సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టిలు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

కొత్త నిబంధనలు రూపొందించాలి

‘‘ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ ముగియడం.. టోక్యోకు అవకాశం లభించకపోవడం కొంచెం నిరాశ కలిగించింది. కరోనా మహమ్మారి కారణంగా 5, 6 టోర్నీలు రద్దయ్యాయి. ఇది మన చేతుల్లో లేదు. నాతో పాటు చాలామందిపై టోర్నీల రద్దు ప్రభావం పడింది. ఒలింపిక్స్‌ అర్హత కోసం నాకు 5000 నుంచి 6000 పాయింట్లు అవసరం ఉంది. 4, 5 టోర్నీల్లో ఓ స్థాయిలో ఆడినా ఆ పాయింట్లు లభించేవి. ఏకంగా టోర్నీలే రద్దయినప్పుడు ఏం చేయలేం.    6 టోర్నీలు ఇలా అవడంపై బీడబ్ల్యూఎఫ్‌ ఆలోచించాలి. ఇలాంటప్పుడు క్రీడాకారులకు నష్టం కలగకుండా కొత్త నిబంధనలు రూపొందించాలి. జపాన్‌లో అత్యయిక స్థితి విధించినట్లు వింటున్నాం. ఒలింపిక్స్‌ నిర్వహిస్తారా? లేదా? అన్నది వారి చేతుల్లో ఉంది. సింగపూర్‌ ఓపెన్‌ రద్దయ్యే వరకు పూర్తి స్థాయిలో సాధన చేశాం. ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో సాధన సాగలేదు.గాయమైతే ఫలానా సమయానికి కోలుకుంటాం.. ఆ తర్వాత ఆడొచ్చని అంచనాకు వస్తాం. అసలు టోర్నీ కచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం లేనపుడు సాధన చేయడానికి ప్రేరణ లభించదు’’

- ‘ఈనాడు’తో కిదాంబి శ్రీకాంత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు