Milkha Singh: ఫ్లయింగ్‌ సిఖ్‌ మిల్కా ఇకలేరు

దేశానికి ఎన్నో గొప్ప విజయాలు సాధించి పెట్టిన స్ప్రింట్‌ దిగ్గజం 91 ఏళ్ల మిల్కా సింగ్‌ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకుంటున్న ఆయన ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది.

Updated : 19 Jun 2021 08:52 IST

కరోనాతో కన్నుమూసిన స్ప్రింట్‌ దిగ్గజం

చంఢీగఢ్‌: దేశానికి ఎన్నో గొప్ప విజయాలు సాధించి పెట్టిన స్ప్రింట్‌ దిగ్గజం 91 ఏళ్ల మిల్కా సింగ్‌ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకుంటున్న ఆయన ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది. జ్వరం రావడంతో పాటు అతని ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)లో వైద్యం అందించారు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 11.30కు ఆయన తుదిశ్వాస విడిచారని మిల్కా కుటుంబం ప్రతినిధి తెలిపాడు. గత నెలలో కొవిడ్‌ బారిన పడ్డ మిల్కాకు బుధవారం నెగెటివ్‌గా తేలింది. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా క్షీణించింది. కరోనా సోకిన మిల్కాకు మొదట మొహాలీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రిలో ఓ వారం పాటు చికిత్స అందించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో ఈ నెల 3న పీజీఐఎమ్‌ఈఆర్‌లో చేర్పించారు. వైరస్‌ కారణంగా ఆయన భార్య, 85 ఏళ్ల నిర్మల్‌ కౌర్‌ ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ అవార్డీ మిల్కాకు కుమారుడు జీవ్‌ మిల్కాసింగ్‌, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మిల్కా ఆసియా అథ్లెటిక్స్‌లో నాలుగుసార్లు స్వర్ణం నెగ్గారు. 1958 కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి గెలిచారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌ 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకం కోల్పోయారు. ఫైనల్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. 1956, 1964 ఒలింపిక్స్‌లోనూ మిల్కా పోటీపడ్డారు. ప్లయింగ్‌ సిఖ్‌గా ప్రసిద్ధి చెందిన మిల్కాకు 1959లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు