పంత్‌కు పాజిటివ్‌

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, త్రోలు విసిరే నిపుణుడు దయానంద్‌ గారానీలు పాజిటివ్‌గా తేలారు. ఈనెల 8న పాజిటివ్‌గా తేలిన పంత్‌ 8 రోజులుగా ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు

Published : 16 Jul 2021 02:29 IST

త్రో నిపుణుడికి కూడా
ఐసోలేషన్‌లో సాహా, అభిమన్యు, భరత్‌ అరుణ్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, త్రోలు విసిరే నిపుణుడు దయానంద్‌ గారానీలు పాజిటివ్‌గా తేలారు. ఈనెల 8న పాజిటివ్‌గా తేలిన పంత్‌ 8 రోజులుగా ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం పంత్‌కు కరోనా లక్షణాలేవీ లేవని.. అతను కోలుకుంటున్నాడని బోర్డు పేర్కొంది. ఈనెల 14న పాజిటివ్‌గా తేలిన దయానంద్‌తో జట్టు హోటల్‌లో సన్నిహితంగా ఉన్న వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, రిజర్వ్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌లను 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంచినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ నలుగురు తమ హోటల్‌ గదుల్లోనే ఉంటారని స్పష్టంచేసింది. వీరంతా ప్రస్తుతం లండన్‌లోనే ఉండగా.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం మిగతా జట్టంతా గురువారం లండన్‌ నుంచి డర్హమ్‌ చేరుకుంది. ‘‘పంత్‌ క్వారంటైన్‌ ముగింపు దశలో ఉంది. విశ్రాంతి సమయంలో జట్టు హోటల్‌లో పంత్‌ లేడు. పాజిటివ్‌గా వచ్చిన చోటే అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో పంత్‌ కోలుకుంటున్నాడు. రెండు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన తర్వాత డర్హమ్‌లో టీమ్‌ఇండియాతో పంత్‌ కలుస్తాడు. దయానంద్‌తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న సాహా, అభిమన్యు, భరత్‌ అరుణ్‌లు 10 రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులకు ఈనెల ప్రారంభంలో లండన్‌లో రెండో డోసు టీకా ఇచ్చారు’’ అని బీసీసీఐ పేర్కొంది. తాజా పరిణామంతో ఈనెల 20న కంబైన్డ్‌ కౌంటీ జట్టుతో ప్రారంభమయ్యే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు పంత్‌, సాహా, ఈశ్వరన్‌లు దూరమయ్యారు. గత నెలలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనంతరం టీమ్‌ఇండియాకు మూడు వారాలు విశ్రాంతినిచ్చారు. దీంతో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి నచ్చిన చోటుకు వెళ్లారు. ఈ క్రమంలోనే పంత్‌ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు స్టేడియాలకు వెళ్లాడు. మాస్క్‌ ధరించకుండానే ప్రేక్షకుల మధ్య కూర్చున్నాడు. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమంలో పెట్టాడు కూడా. అక్కడే పంత్‌కు కరోనా డెల్టా వేరియంట్‌ సోకినట్లుగా భావిస్తున్నారు. తేలికపాటి జ్వరం రావడంతో పంత్‌కు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఆ వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇంగ్లాండ్‌లో డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుందని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆటగాళ్లను హెచ్చరిస్తూ బీసీసీఐ కార్యదర్శి జై షా గతంలోనే లేఖ రాశాడు. యూరో ఛాంపియన్‌షిప్‌, వింబుల్డన్‌ టోర్నీలకు దూరంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు లభించిన 20 రోజుల విశ్రాంతి బుధవారం ముగిసింది. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 4న తొలి టెస్టు ఆరంభమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు