Updated : 19 Jul 2021 02:43 IST

దంచి కొట్టారు...

 పృథ్వీ, కిషన్‌ ధనాధన్‌
 ధావన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
 తొలి వన్డేలో భారత్‌ చేతిలో లంక చిత్తు

కొలంబో

‘‘భారత ద్వితీయ శ్రేణి జట్టుతో  ఆడడం మాకు అవమానకరం’’

.. ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియాపై శ్రీలంక మాజీ కెప్టెన్‌ రణతుంగ వ్యాఖ్యలివి. పాపం.. ఇప్పుడతడు మరింత కుమిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే అతడు ద్వితీయ శ్రేణి జట్టుగా పరిగణించిన ఆ భారత జట్టే.. లంకను నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టేసింది. ఆతిథ్య జట్టు తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కుర్ర బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌కు ధావన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడైన వేళ... తొలి వన్డేలో టీమ్‌ఇండియా  అలవోకగా గెలిచింది.

* ధావన్‌ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పదో భారత బ్యాట్స్‌మన్‌ అతను.

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను భారత యువ జట్టు ఘనంగా ఆరంభించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6×4, 1×6), పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9×4), ఇషాన్‌ కిషన్‌ (59; 42 బంతుల్లో 8×4, 2×6) మెరవడంతో ఆదివారం తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. లక్ష్యాన్ని భారత్‌ 36.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చమిక కరుణరత్నె (43 నాటౌట్‌; 35 బంతుల్లో 1×4, 2×6), దసున్‌ శనక (39; 50 బంతుల్లో 2×4, 1×6), చరిత్‌  అసలంక (38; 65 బంతుల్లో 1×4) తలో చేయి వేయడంతో మొదట శ్రీలంక 9  వికెట్లకు 262 పరుగులు చేసింది. పృథ్వీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

కుర్రాళ్ల వీరవిహారం: లక్ష్యం మరీ చిన్నదేమీ కాకపోయినా కుర్రాళ్ల జోరుతో టీమ్‌ ఇండియా అలవోకగా ఛేదించింది. ఓ వైపు కెప్టెన్‌ ధావన్‌ నిలబడగా.. మరో వైపు  కుర్రాళ్లు ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లంక బౌలర్లను యువ బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. మోత మొదలెట్టింది పృథ్వీనే. ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు.. చమీర వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో కవర్స్‌లో బౌండరీతో ఖాతా తెరిచాడు. వెంటనే ఉదాన బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. ఉదాన తర్వాతి ఓవర్లో వరుసగా మూడు బంతులను బౌండరీ దాటించాడు. అయిదో ఓవర్లో మరో రెండు ఫోర్లు సాధించాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు 57/0 కాగా.. అందులో పృథ్వీ చేసినవే 43. కానీ తర్వాతి ఓవర్లో పృథ్వీ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. అయినా లంకకు ఉపశమనం లేకుండా పోయింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టాడు. వన్డే క్రికెట్‌ ఎదుర్కొన్న తొలి బంతిని (ధనంజయ బౌలింగ్‌) ముందుకొచ్చి స్టాండ్స్‌లోకి కొట్టిన అతడు..  తర్వాతి బంతిని బౌండరీకి తరలించాడు. ధనంజయ తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు దంచాడు. తర్వాత కూడా కిషన్‌ దూకుడు కొనసాగించడంతో భారత్‌ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన ధావన్‌.. ఎక్కువగా సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. 33 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన కిషన్‌.. 18వ ఓవర్లోనే ఔటైనా భారత్‌కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. అప్పటికి స్కోరు 143. బాధ్యతాయుత బ్యాటింగ్‌ను కొనసాగించిన ధావన్‌.. పాండే (26; 40 బంతుల్లో 1×4, 1×6), సూర్యకుమార్‌ (31 నాటౌట్‌; 20 బంతుల్లో 5×4)తో కలిసి జట్టును అలవోకగా విజయతీరాలకు చేర్చాడు.


సంజుకు గాయం.. కిషన్‌, సూర్య అరంగేట్రం

ప్రాక్టీస్‌ సందర్భంగా మోకాలుకు గాయం కావడంతో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ శ్రీలంకతో తొలి వన్డేకు దూరమయ్యాడు. మొత్తం పర్యటనకే అతడు దూరమయ్యే అవకాశముంది. సంజు గాయంతో మరో వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌కు మార్గం సుగమమైంది. అతడితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డే అరంగేట్రం చేశాడు. భారత జట్టు.. లంకతో మూడు వన్డేల సిరీస్‌ ముగిశాక మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.


రాణించిన కుల్‌దీప్‌, చాహల్‌:  అంతకుముందు స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌ యాదవ్‌ (2/48), యుజ్వేంద్ర చాహల్‌ (2/52) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. మరీ విజృంభించనప్పటికీ పరుగుల వేగానికి కళ్లెం వేయగలిగారు. కీలక వికెట్లూ పడగొట్టారు. మధ్య ఓవర్లలో కృనాల్‌ పాండ్య   (1/26) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ముగ్గురు స్పిన్నర్లూ కలిసి 98 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. అయితే ఆఖర్లో కరుణరత్నె చెలరేగడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. దాదాపు శ్రీలంక బ్యాట్స్‌మెనంతా బాగానే ఆరంభించినా.. ఆ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. పెద్ద ఇన్నింగ్స్‌  ఆడలేకపోయారు. లంక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (33), మినోద్‌ భానుక (27) 9 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. అయితే పదో ఓవర్లో ఫెర్నాండోను ఔట్‌ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని చాహల్‌ విడదీశాడు. 17వ ఓవర్లో రాజపక్స (24), భానుకలను వెనక్కి పంపి ఆతిథ్య జట్టును కుల్‌దీప్‌ దెబ్బతీశాడు. ఆ తర్వాత కృనాల్‌ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వకపోవడంతో పరుగుల వేగం తగ్గిపోయింది. 44వ ఓవర్‌ ముగిసే సరికి ధనంజయ డిసిల్వా (14), అసలంక, హసరంగ (8), శనక  వికెట్లు చేజార్చుకున్న లంక 205/7తో నిలిచింది. 47వ ఓవర్లో ఉదాన (8)ను హార్దిక్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 222/8. కానీ చమీర (13), కరుణరత్నె బ్యాట్‌   ఝుళిపించడంతో చివరి రెండు ఓవర్లలో లంక 32 పరుగులు   రాబట్టింది. భువి వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో కరుణరత్నె.. ఓ ఫోర్‌, రెండు సిక్స్‌లు కొట్టాడు. దీపక్‌ చాహర్‌ 7 ఓవర్లలో   32 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌   (9 ఓవర్లలో 0/63) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క ఫెర్నాండో (సి) పాండే (బి) చాహల్‌ 33; మినోద్‌ భానుక (సి) పృథ్వీ (బి) కుల్‌దీప్‌ 27; రాజపక్స (సి) ధావన్‌ (బి) కుల్‌దీప్‌ 24; ధనంజయ డిసిల్వా (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 14; చరిత్‌ అసలంక (సి) ఇషాన్‌ (బి) చాహర్‌ 38; శనక (సి) హార్దిక్‌ (బి) చాహల్‌ 39; హసరంగ (సి) ధావన్‌ (బి) చాహర్‌ 8; కరుణరత్నె నాటౌట్‌ 43; ఉదాన (సి) చాహర్‌ (బి) హార్దిక్‌ 8; చమీర రనౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 15

మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 262;

వికెట్ల పతనం: 1-49, 2-85, 3-89, 4-117, 5-166, 6-186, 7-205, 8-222,  9-262;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9-0-63-0; దీపక్‌ చాహర్‌ 7-1-37-2; హార్దిక్‌ పాండ్య 5-0-34-1; చాహల్‌ 10-0-52-2; కుల్‌దీప్‌ 9-1-48-2; కృనాల్‌ 10-1-26-1

భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) ఫెర్నాండో (బి) ధనంజయ డిసిల్వా 43; ధావన్‌ నాటౌట్‌ 86; ఇషాన్‌ కిషన్‌ (సి) భానుక (బి) సందకన్‌ 59; మనీష్‌ పాండే (సి) శనక (బి) ధనంజయ డిసిల్వా 26; సూర్యకుమార్‌ యాదవ్‌ నాటౌట్‌ 31;  ఎక్స్‌ట్రాలు 18

మొత్తం: (36.4 ఓవర్లలో  3 వికెట్లకు) 263;

వికెట్ల పతనం: 1-58,  2-143, 3-215; బౌలింగ్‌: చమీర 7-0-42-0; ఉదాన 2-0-27-0; ధనంజయ డిసిల్వా  5-0-49-2; సందకన్‌ 8.4-0-53-1; చరిత్‌  అసలంక 3-0-26-0; హసరంగ 9-1-45-0; చమిక కరుణరత్నె 2-0-16-0

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని