తుపాకీ.. ఎంత పని చేశావ్‌!

‘గురి’ కుదరలేదు. ‘తుపాకీ’ ఇంకా పేలలేదు. పతకం కాదు.. పతకాలు గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు వరుసగా రెండో రోజూ తీవ్ర నిరాశకు గురి చేశారు. షూటింగ్‌ బృందంలో అత్యధిక అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్‌ను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో దురదృష్టం వెంటాడింది. తుపాకీలో సాంకేతిక లోపం తలెత్తి దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయింది. అయినప్పటికీ ఆమె పోరాడినా.. త్రుటిలో ఫైనల్‌ బెర్తు చేజారింది. దీంతో ఓ పతకం చేజేతులా కోల్పోయినట్లయింది. మిగతా షూటర్లు అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయారు.

Published : 26 Jul 2021 03:26 IST

రెండో రోజూ ఖాతా తెరవని షూటర్లు

మనుకు శాపంగా మారిన సాంకేతిక లోపం

20 నిమిషాలు వృథా.. చేజారిన ఫైనల్‌ బెర్తు

టోక్యో

‘గురి’ కుదరలేదు. ‘తుపాకీ’ ఇంకా పేలలేదు. పతకం కాదు.. పతకాలు గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు వరుసగా రెండో రోజూ తీవ్ర నిరాశకు గురి చేశారు. షూటింగ్‌ బృందంలో అత్యధిక అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్‌ను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో దురదృష్టం వెంటాడింది. తుపాకీలో సాంకేతిక లోపం తలెత్తి దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయింది. అయినప్పటికీ ఆమె పోరాడినా.. త్రుటిలో ఫైనల్‌ బెర్తు చేజారింది. దీంతో ఓ పతకం చేజేతులా కోల్పోయినట్లయింది. మిగతా షూటర్లు అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయారు.

ఒలింపిక్స్‌లో షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ఈ క్రీడలో పతకం దక్కలేదు. కచ్చితంగా పతకం వస్తుందనుకున్న  10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో మను బాకర్‌తో పాటు యశస్విని సింగ్‌ దేశ్వాల్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మను, యశస్విని వరుసగా 575, 574 పాయింట్లతో 12, 13 స్థానాలకు పరిమితం అయ్యారు. 577 పాయింట్లు సాధించిన ఫ్రాన్స్‌ షూటర్‌ గోబర్‌విల్లీ ఎనిమిదో స్థానంతో చివరి ఫైనల్‌ బెర్తును సొంతం చేసుకుంది. అయితే ఫైనల్‌ చేరనందుకు మనును నిందించడానికి లేదు. తన పిస్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా  20 నిమిషాల విలువైన సమయాన్ని ఆమె కోల్పోయింది. అయినా సరే.. మిగతా షూటర్లతో సమానంగా పోటీ పడి ఫైనల్‌ అర్హత మార్కుకు కేవలం రెండు పాయింట్ల దూరంలో ఆగిపోయింది. ఆ సమయం వృథా కాకుంటే మను సులభంగా ఫైనల్‌కు చేరేదే. అంత ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన మను.. సాధారణ స్థితిలో కచ్చితంగా పతకం గెలిచేదేమో. మను  వరుసగా ఆరు సిరీస్‌ల్లో 98, 94, 94, 95, 98, 95 పాయింట్లు సాధించింది. ఆమె ‘10’లు 14 వేసింది. యశస్విని వరుసగా 94, 95, 94, 95, 98, 95 పాయింట్లు సాధించింది. ఆమె ‘10’లు పదకొండే. ఈ ఈవెంట్లో రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) క్రీడాకారిణి బత్సరస్కినా స్వర్ణం గెలవగా.. కొస్తదినోవా (బల్గేరియా) రజతం, జియాంగ్‌ రాన్‌జిన్‌ (చైనా) కాంస్యం నెగ్గారు. ఆదివారం పురుష షూటర్లు మరింతగా నిరాశ పరిచారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ అర్హత రౌండ్లో దీపక్‌ కుమార్‌, దివ్యాంశ్‌ పేలవ ప్రదర్శనతో వరుసగా 26, 32 స్థానాల్లో నిలిచారు. దీపక్‌ 624.7 పాయింట్లు సాధించగా.. దివ్యాంశ్‌ 622.8 పాయింట్లకు పరిమితం అయ్యాడు. పురుషుల స్కీట్‌ క్వాలిఫయింగ్‌లో అంగద్‌ వీర్‌ సింగ్‌ మూడు రౌండ్లు ముగిసేసరికి 11వ స్థానంలో నిలిచాడు. సోమవారం మిగతా రెండు రౌండ్లు జరుగుతాయి. ఇదే విభాగంలో మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 25వ స్థానానికి పరిమితమయ్యాడు.


ఏం జరిగింది?

గత కొన్నేళ్లుగా షూటింగ్‌ ప్రపంచకప్‌ సహా ఎన్నో టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసి భారీ అంచనాల మధ్య ఒలింపిక్స్‌ బరిలో దిగిన షూటర్‌ మను బాకర్‌. ఆదివారం తన తొలి, ఫేవరెట్‌ ఈవెంట్‌ 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో ఆమె పోటీ పడింది. ఇందులో ఒక్కో సిరీస్‌లో 10 షాట్ల చొప్పున ఆరు సిరీస్‌లు జరుగుతాయి. గంట 15 నిమిషాల వ్యవధిలో పిస్టల్‌తో 60 సార్లు లక్ష్యానికి కాల్చాలి. మను తొలి సిరీస్‌లో 98 పాయింట్లతో ఆమె పోటీని బాగానే ఆరంభించింది. అయితే 16 షాట్లు పూర్తయ్యాక ఆమె పిస్టల్‌ మొరాయించింది. అందులో సాంకేతిక లోపం తలెత్తడంతో పోటీ స్థలం నుంచి మను బయటికి వెళ్లాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం అక్కడిక్కడ పిస్టల్‌ను సరిచేసుకోవడానికి వీల్లేదు. అందుకోసం పోటీల స్థలానికి కొంచెం దూరంగా వేరే ప్రదేశానికి వెళ్లాలి. పిస్టల్‌ సరి చేసుకోవడానికి పది నిమిషాల దాకా సమయం పట్టగా.. వేరే ప్రదేశానికి వెళ్లి రావడానికి, అలాగే పోటీని కొనసాగించడానికి ముందు తుపాకీని మరోసారి సరి చూసుకోవడానికి కలిపి మను ఇంకో పది నిమిషాల దాకా సమయం వెచ్చించాల్సి వచ్చింది. షూటింగ్‌ ఈవెంట్లలో తమ పరికరాలు ఉత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం షూటర్ల బాధ్యత. ఈవెంట్‌ మధ్యలో సమస్య తలెత్తి సమయం వృథా అయితే అదనపు సమయం కేటాయించడం ఉండదు. అందరితో కలిసి నిర్దేశిత సమయంలోనే పోటీని పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలి 60 నిమిషాల్లో మను 16 షాట్లు పూర్తి చేసింది. 55 నిమిషాల్లో 44 షాట్లు పూర్తి చేయాల్సిన స్థితిలో ఆమె పిస్టల్‌ మొరాయించింది. తిరిగొచ్చాక మిగిలిన 44 షాట్లను 36 నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. దీంతో మనుపై తీవ్ర ఒత్తిడి పడింది. అయినప్పటికీ ఆమె ఉన్నంతలో ఉత్తమ ప్రదర్శన చేసింది. అయిదో సిరీస్‌లో 98 పాయింట్లతో ఫైనల్‌కు రేసులో నిలిచింది. చివరి సిరీస్‌లో ఇన్నే పాయింట్లు సాధించి ఉంటే ఆమె ఫైనల్‌ చేరేది. కానీ 95 పాయింట్లతో అర్హత మార్కుకు 2 పాయింట్ల దూరంలో ఆగిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని