వారెవ్వా రాహుల్‌

రాహుల్‌ నైపుణ్యంపై ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. టీమ్‌ఇండియాలో సొగసైన టెక్నిక్‌ కలిగిన ఆటగాడు అతడు. కొత్తగా నిరూపించుకోవాల్సింది

Updated : 13 Aug 2021 04:58 IST

రాహుల్‌ నైపుణ్యంపై ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. టీమ్‌ఇండియాలో సొగసైన టెక్నిక్‌ కలిగిన ఆటగాడు అతడు. కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. టెస్టుల్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీ కొట్టిన ఘనత అతడిది. కావాల్సినంత అనుభవం ఉంది. కాకపోతే గాయాలకు తోడు నిలకడలేమితో టెస్టు జట్టులో చోటు కోల్పోయి చాలా కాలమే అయ్యింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు దాదాపుగా రెండేళ్లు అతడు టెస్టు జట్టులో ఆడలేదు. అతడి స్థానంలో వచ్చి మయాంక్‌ నిలకడగా ఆడుతుండటంతో జట్టులో అతడికి చోటు లభించడమే కష్టంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ అతడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. అయితే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా మయాంక్‌ గాయపడటంతో అనుకోకుండా అతడికి తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చే అవకాశం లభించింది. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న అతడు.. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఛేదనలో 26 పరుగులు సాధించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ లార్డ్స్‌లో తన కళాత్మక షాట్‌లన్నింటినీ ప్రదర్శించాడు. బౌలింగ్‌ అనుకూల పరిస్థితుల్లో చూడచక్కని ఆటతో అలరించాడు. ప్రతి బ్యాట్స్‌మన్‌ కలలు కనే లార్డ్స్‌ సెంచరీని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడాడిన కవర్‌ డ్రైవ్‌లు, కట్‌ షాట్లను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక టెస్టు ఓపెనర్‌గా అతడి స్థానంలో మరొకరికి ఇప్పుడిప్పుడే అవకాశం దక్కకపోవచ్చు. ప్రస్తుతం రాహుల్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని